రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలో నిలిచారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయి, ప్రస్తుతం ఆమె దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు.
తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని ఆమె విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆమె ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఇప్పటికే ఆమెకు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది. ద్రౌపది నామినేషన్ కార్యక్రమంలో కూడా వైసీపీ ఎంపీలు పాల్గొన్న సంగతి తెలిసిందే.
సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో మంగళగిరి సమీపంలో జరిగే వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశంలో ద్రౌపది పాల్గొని మద్దతు కోరనున్నారు. అయితే ఏపీ పర్యటనలో భాగంగా ఆమె 40 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి మద్దతు కోరనున్నారా? లేదా? అనే విషయమై స్పష్టత రాలేదు.
కారణాలేవైనా కేంద్రంలో బీజేపీకి ఏపీ అధికార ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలుకుతున్న సంగతి తెలిసిందే. అయితే నామినేషన్ ప్రక్రియకు టీడీపీకి ఎలాంటి అహ్వానం లేదు.
టీడీపీకి ముగ్గురు లోక్‌సభ సభ్యులు, ఒక రాజ్యసభ సభ్యుడు, అలాగే 23 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అడిగినా అడక్కపోయినా ఎన్‌డీఏ అభ్యర్థికే టీడీపీ మద్దతు ఇస్తుంది. అయితే కనీస మర్యాదగా తమను మద్దతు అడగాలని ఆ పార్టీ కోరుకుంటోంది. ద్రౌపది ముర్ము పర్యటనలో టీడీపీని కలుస్తున్న సమాచారమే లేదు.