వంట ఇంట్లోనూ అధునాతన సాంకేతికత..!

ఖమ్మం నగరానికి చేరిన ఫైబర్‌ గ్యాస్‌ సిలిండర్లు ఒకటి రెండు రోజుల్లో వినియోగదారులకు పంపిణీ చేయనున్నారు. వంట గదిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలుతుందనే భయం ఇకనుంచి అక్కర్లేదు. ఎందుకంటే దీనిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో…

ఖమ్మం నగరానికి చేరిన ఫైబర్‌ గ్యాస్‌ సిలిండర్లు ఒకటి రెండు రోజుల్లో వినియోగదారులకు పంపిణీ చేయనున్నారు. వంట గదిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలుతుందనే భయం ఇకనుంచి అక్కర్లేదు. ఎందుకంటే దీనిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫైబర్‌తో దృఢంగా రూపొందించిన సిలిండర్లు అందుబాటులోకి వచ్చాయి కనుక. 

కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఫైబర్‌ గ్యాస్‌ సిలిండర్లు తయారుచేసింది. ప్రస్తుతం ఇండేన్‌ గ్యాస్‌ కంపెనీ కంపెనీ మాత్రమే దీనిని మార్కెట్‌లోకి విడుదల చేసింది. మిగిలిన గ్యాస్ కంపెనీలు ఇంకా ముందుకు రాలేదు.

ప్రస్తుతం వంట గ్యాస్‌ సిలిండర్లు స్టీల్‌తో తయారు చేసినవి ఉపయోగిస్తున్నారు అది మనందరికీ తెలిసిన విషయమే. అయితే వాటిని ఇంట్లో ఒకే చోట ఉంచితే తుప్పు పడతాయి. సిలిండర్‌తో పాటు ఇంటి ఫ్లోరింగ్‌పైనా తుప్పు మరకలు పడుతున్నాయి. బరువు కూడా ఎక్కువే. దీనిని మోసుకుని వెళ్ళాలంటే గృహిణులకు ఒక పెద్ద టాస్కే. ఇందులో 14.2 కిలోల గ్యాస్‌ నింపి ఇస్తున్నారు.

తాజాగా ఫైబర్‌తో రూపొందించిన గ్యాస్‌ సిలిండర్‌ చాలా తక్కువ బరువు మాత్రమే ఉంటుంది. తేలిగ్గా ఒక చేతితో తీసుకెళ్లవచ్చు. మూడు వరుసల్లో సిలిండర్‌ గోడలు ఫైబర్‌తో దృఢంగా రూపొందించారు. గ్యాస్‌ వెలువరించే తీవ్ర ఒత్తిడిని ఇందులోని మూడు పొరలు సమర్థంగా తట్టుకుంటాయి. లోపల గ్యాస్‌ అధిక ఒత్తిడి కలిగిస్తే గోడలు మెత్తబడతాయి. తద్వారా ఆకారంలో వచ్చే మార్పును స్పష్టంగా గమనించవచ్చు. ఒత్తిడికి పేలుడు సంభవించే అవకాశం చాలా తక్కువ వుంటుంది.

ఇక దీని ధర విషయానికొస్తే డిపాజిట్‌ రూ.3350..

ఫైబర్‌ సిలిండర్‌లో 10 కిలోల గ్యాస్‌ మాత్రమే నింపుతారు. దీని ధర రూ.775గా నిర్ణయించారు. ఖమ్మంలో అదే 14.2 కిలోల వంట గ్యాస్‌ స్టీల్‌ సిలిండర్‌ ధర రూ.1084 ఉంది. ప్రస్తుతం వంట గ్యాస్‌ కనెక్షన్‌ కలిగిన వారు ఫైబర్‌ సిలిండర్‌ కావాలంటే కొత్తగా రూ.3350 డిపాజిట్‌ గ్యాస్‌ కంపెనీకి చెల్లించాలి. ఇప్పుడు వాడుతున్న స్టీల్‌ సిలిండర్‌ గ్యాస్‌ పంపిణీదారుకు అప్పగించాలి. పాత సిలిండర్‌కు మీరు చెల్లించిన ధర తిరిగి ఇచ్చేస్తారు. 

పాత సిలిండర్‌ తీసుకున్న సమయంలో డిపాజిట్‌ పలు రకాలుగా ఉంది. రూ.600 నుంచి రూ.1800 వరకు అప్పట్లో తీసుకున్నారు. అప్పట్లో కనెక్షన్‌ తీసుకునే సమయంలో ఎంత డిపాజిట్‌ చెల్లించారో కనెక్షన్‌ మంజూరు పత్రంపై ఉంటుంది. ఆ మేరకు డిపాజిట్‌ డబ్బు తిరిగి ఇచ్చేస్తారు. అయితే ఫైబర్‌ సిలిండర్‌ డిపాజిట్‌ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.

అంతా బాగానే వుంది. బుక్ చేసిన ఎన్ని రోజుల్లో ఇంటికి తెచ్చి ఇస్తారు? అన్న దానికి సమాధానం రెండు రోజుల్లో పంపిణీ చేస్తారు అని చెప్పారు. అలాగే ఫైబర్‌ వంట గ్యాస్‌ సిలిండర్లు రెండు రోజుల్లో వినియోగదారులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మంలోని రవిచంద్ర ఇండేన్‌ గ్యాస్‌ ఏజెన్సీ నిర్వాహకుడు మేళ్లచెర్వు మనోజ్‌కుమార్‌ తెలిపారు.