పవన్ కళ్యాణ్ బుద్ధి అంతేనా ఇక మారదా?

రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారు? ప్రభుత్వంలో ఉండే మంత్రులు అంటే, ఆ నిర్వచనాన్ని పవన్ కళ్యాణ్ ఎలా భావిస్తున్నారు? అధికారంలోకి వచ్చేవాళ్లు తమ వర్గాలకు తమ కులాలకు తమ మతాలకు మేలు చేసుకోవడం…

రాజకీయం అంటే పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారు? ప్రభుత్వంలో ఉండే మంత్రులు అంటే, ఆ నిర్వచనాన్ని పవన్ కళ్యాణ్ ఎలా భావిస్తున్నారు? అధికారంలోకి వచ్చేవాళ్లు తమ వర్గాలకు తమ కులాలకు తమ మతాలకు మేలు చేసుకోవడం కోసమే నిరంతరం పనిచేస్తూ ఉండాలని ఆయన అభిప్రాయమా? అందుకోసమే మంత్రులుగా పదవులు పొందుతారని ఆయన భావిస్తున్నారా? ఈ రాష్ట్రంలో ఏ సాధారణ వ్యక్తి కూడా ఈ రకమైన సంకుచిత ఆలోచన చేయడు! 

కానీ పవన్ కళ్యాణ్ తాజా మాటలను గమనిస్తే ఆయన అలాగే భావిస్తున్నట్లు మనకు అర్థం అవుతుంది!! ‘మంత్రులుగా గెలిచిన వాళ్ళందరూ తమ కులాలకు మేలు చేసుకోవాలి’ అని ఆయన పరోక్షంగా ఉపదేశిస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ ‘జనవాణి జనసేన’ అనే పేరిట ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించే ప్రహసనాన్ని రెండో విడత కూడా నిర్వహించారు. వారానికి ఒకరోజు ప్రజలనుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నా అంటూ.. అక్కడికేదో జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ప్రజలలో వ్యతిరేకత వెన్నువెత్తిపోతున్నట్లుగా ఆయన బిల్డప్ ఇవ్వాలని అనుకోవడమే తమాషా!

ఇదంతా పక్కన పెడితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకుల మీద తన సహజమైన శైలిలో అర్థంపర్థం లేని అవాకులు చెవాకులు పేలారు! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు అందరూ కూడా తమ తమ సామాజిక వర్గాలకు మేలు చేసుకోవడానికి భయపడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. వారందరూ జగన్ ను భజన చేయడం మాత్రమే పనిగా పెట్టుకున్నారని కూడా చెప్పుకొచ్చారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నిర్వహించుకున్నప్పుడు ఆ పార్టీ అధినేత పడుతున్న కష్టం గురించి.. ఆయన దార్శనికత గురించి పార్టీ నాయకులు మాట్లాడటం చాలా సహజం! ఏపార్టీలో అయినా ఇది సహజం. జనసేన పార్టీలో ఇలాంటి కార్యక్రమం జరిగితే కనుక ప్రతి వాళ్ళు పవన్ కళ్యాణ్‌కు చిడతలు వాయిస్తారు! అది ఆయనకు తెలియని సంగతి ఏమీ కాదు! 

అసలు నాయకులకే దిక్కులేని జనసేనలోనే అంత భజన ఉంటే ఎంతో మంది నాయకులకు రాజకీయ జీవితం ప్రసాదించిన జగన్మోహన్ రెడ్డి పట్ల వాళ్లకు ఎంత కృతజ్ఞత ఉండాలి? ప్లీనరీ వంటి ఆ ఒక్క సందర్భంలో కూడా ఆ కృతజ్ఞతలు వాళ్ళు తెలియచెప్పుకోకుండా ఎలా ఉంటారు? అయితే ఈ పోకడను పవన్ కళ్యాణ్ జీర్ణం చేసుకోలేకపోతున్నారు! జగన్ పట్ల జ్వలించిపోతున్నారు. జగన్ ను పొగుడుతుంటే సహించలేకపోతున్నారు! అందుకే ఇలా ఆడిపోసుకుంటున్నారు. 

ఇంతకూ పవన్ కళ్యాణ్ విలాపం ఏమిటి? మంత్రి పదవులు పొందడం అంటే వారి వారి కులాలకు మేలు చేసుకోవడమే.. ఆ పదవి యొక్క కనీస ధర్మం అని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా ఉంది! అందుకే ‘వారు తమ కులాలకు మేలు చేసుకోలేకపోతున్నారు’ అనే మాటలను ఆయన నిస్సిగ్గుగా అనగలుగుతున్నారు! నిజానికి మంత్రి పదవి అంటే ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి ఒక వర్గానికి సంబంధించినది కాదు. తమకు ఓట్లు వేసిన వాళ్లకు మాత్రమే మేలు చేసే వ్యవహారం వాళ్లను మాత్రమే ప్రసన్నం చేసుకునే వ్యవహారం కూడా కాదు! 

యావత్తు రాష్ట్రంలోని మొత్తం ఐదు కోట్ల జనాభాకు సంబంధించినది. ఆ పదవి రాష్ట్రమంతటినీ దృష్టిలో ఉంచుకొని నిర్వహించాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ కు ఆ మాత్రం అవగాహన కూడా ఉన్నట్టు లేదు. మంత్రివర్గం కూర్పులో సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా అన్ని మతాలకు కులాలకు ప్రాతినిధ్యం ఉండేలాగా జాగ్రత్త తీసుకుంటారు. 

తద్వారా అన్ని కులాల వారికి అధికారంలో సమానంగా వాటా యిస్తున్నట్లుగా వారు భావిస్తారు! అంతే తప్ప ఆ కులాల మంత్రులందరూ ఆయా కులాలకు మేలు చేసుకోమని లాకులు ఎత్తేసినట్లు కాదు! 

పవన్ కళ్యాణ్ బుర్రలో మెదలుతున్నట్లుగా సంకుచిత పోకడలతో చెలరేగమని కూడా కాదు. రాజకీయం గురించి, ప్రజలు ఎన్నుకునే ప్రజల ప్రభుత్వం గురించి, అందులో ఉండే ప్రజా సేవకులు అయిన మంత్రుల గురించి.. ఈ మాత్రం కనీస అవగాహన పవన్ కళ్యాణ్ ముందుగా తెలుసుకుంటే చవకబారు మాటలు మాట్లాడకుండా ముందు ముందు పరువు దక్కించుకుంటారు!