ఎర్రకోటను దాటుతున్న గులాబీ మాటలు!

రాజకీయ గులాబీ ఇప్పుడు ఢిల్లీలో విరబూయాలని అనుకుంటోంది. ఆ గుబాళింపులు దేశమంతా సువాసనలు వెదజల్లాలని కోరుకుంటోంది. ఇంకో రకంగా చెప్పాలంటే.. గులాబీ రంగు మారాలనుకుంటోంది. అందుకే వారి మాటలు.. ఏకంగా ఎర్రకోటను దాటుతున్నాయి.  Advertisement…

రాజకీయ గులాబీ ఇప్పుడు ఢిల్లీలో విరబూయాలని అనుకుంటోంది. ఆ గుబాళింపులు దేశమంతా సువాసనలు వెదజల్లాలని కోరుకుంటోంది. ఇంకో రకంగా చెప్పాలంటే.. గులాబీ రంగు మారాలనుకుంటోంది. అందుకే వారి మాటలు.. ఏకంగా ఎర్రకోటను దాటుతున్నాయి. 

దేశంలో మార్పు రావడం కోసం తెరాస జాతీయ పార్టీగా మారితో తప్పేమిటని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. నిజానికి తప్పేమీలేదు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో ఏ ఒక్కడు రాజకీయ పార్టీ పెట్టినా.. తనను తాను ఉద్ధరించుకోడానికి పార్టీ పెడుతున్నానని బహిరంగ ప్రకటన చేయడు. దేశంలో మార్పుకోసమే పెడుతున్నానని అంటాడు. కాబట్టి.. కేసీఆర్ మాటల్లో చెబుతున్న ‘గుణాత్మక మార్పు కోసం జాతీయ పార్టీ’ అనేది ఆచరణలోకి వస్తే తప్ప ప్రజలు నమ్మరు. కొన్ని వందల వేల రాజకీయ పార్టీలను ఈ దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు. 

ఇకపోతే.. దేశం ప్రమాదంలో ఉన్నప్పుడు తాము చూస్తూ ఊరుకోమని కేసీఆర్ అనడం చాలా మంచి మాట! ఇలాంటి స్ఫూర్తి అందరిలో ఉండాలి. అయితే ఈ స్ఫూర్తిని ఎంతవరకు నమ్మగలం? ఈ స్ఫూర్తిని ఎంతకాలం కేసీఆర్ కొనసాగిస్తారు? ఎంత వేగిరంగా.. ఆయన తన జాతీయ పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తారు? అనేవి కీలకమైన ప్రశ్నలు.

2024 సార్వత్రిక ఎన్నికలకు నిండా రెండేళ్ల వ్యవధి కూడా లేదు. 

కేంద్రంలో మూడో కూటమి అంటూ కేసీఆర్ సుదీర్ఘకాలం రంకెలు వేశారు. కానీ, ఆయనకు జాతీయస్థాయిలో ఇతర పార్టీల నుంచి దక్కిన మద్దతు చాలా స్వల్పం. దేశం ఎలా తగలడిపోయినా పర్లేదు.. తనకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ గద్దెమీద తన కుటుంబం కూర్చుని రాజ్యమేలడం ప్రధానంగా భావించే కేసీఆర్.. ఆ సమీకరణాల దృష్ట్యా కాంగ్రెస్ లేని కూటమిని కేంద్రంలో కోరుకుంటారు. 

కానీ.. కేసీఆర్ ని నమ్మి.. కాంగ్రెస్ తో ప్రస్తుతం జట్టుకట్టి ఉన్నవారు బయటకు వచ్చే పరిస్థితి లేదు. మమతా దీదీ, స్టాలిన్ లాంటి వారు కేసీఆర్ తమ చెంతకు వచ్చినప్పుడు గౌరవమర్యాదలు బాగానే నెరపినా.. ఆయన తలపెట్టే బిజెపి వ్యతిరేక కాంగ్రెసేతర కూటమికి జైకొట్టే రకం కాదు. అలాంటి వారి మద్దతు సంపూర్ణంగా లభించి ఉంటే ఇవాళ జాతీయ పార్టీ మాట కూడా వినిపించేది కాదు.

కేవలం.. జాతీయ రాజకీయాల్లో తన అస్తిత్వం కోసం కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించారే అనుకుందాం. ఎవ్వరి అండా లేకుండా.. దాని జాతీయస్థాయి వ్యాప్తి ఎలా ఉండబోతుందనేది తెలియదు. పైగా ఇప్పుడు కొత్త జాతీయ పార్టీ పెట్టి.. ఒకటిన్నర ఏడాదిలోగా ఆ పార్టీని దేశస్థాయిలో ఆయన ఎన్నికలకు సిద్ధం చేయగలరా? సాధ్యమేనా అనేది పెద్దప్రశ్న.

వీటన్నింటినీ బేరీజు వేసినప్పుడు.. కేసీఆర్.. జాతీయ పార్టీ పేరుతో ఏదో.. తనకు పక్కలో బల్లెంలా మారుతున్న బిజెపిని.. నేను కూడా మీ పక్కలో బల్లెం కాగలనని బెదిరిస్తున్నట్టుగా ఉన్నది తప్ప.. క్రియాశీలంగా ఆయన ఆ ఆలోచన చేస్తున్నట్టు లేదు.