ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆయన టీడీపీ. ఢిల్లీలో మాత్రం బీజేపీ. ఇదీ “సత్యం”
టీడీపీకి మామ లేని లోటు తీర్చాలనేది ఆయన తాపత్రయం. సొంత వూళ్లో కనీసం వార్డుకు గెలవలేని నాయకుడు. కానీ జాతీయ స్థాయిలో అధికారం చెలాయిస్తున్న పార్టీకి “జాతి”నాయకుడు. సొంత రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడం మాటేమో గానీ, బీజేపీని అడ్డు పెట్టుకుని చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్‌లో సొంతిళ్లను మాత్రం చక్కదిద్దుకున్న నాయకుడాయన.
ఏపీలో తాను ఆరాధించే పార్టీని మట్టి కరిపించిన వైసీపీ అంటే ఆయనకు ద్వేషం. అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని వైసీపీని తాము అడగలేదని అహంకార మాటలు. మరి అడగకుండానే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌కు వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులు ఎలా వెళ్లారో సదరు సత్యవంతుడు సమాధానం చెప్పాలి.
వైసీపీ ఎంపీలను పక్కన కూచోపెట్టుకుని మరీ నామినేషన్ వేసిన దృశ్యాలను లోకం చూడలేదా? ఎవరి కళ్లకు గంతలు కడదామని అవాకులు చెవాకులు? బహుశా తనకు కావాల్సిన వ్యక్తి రాష్ట్రపతి కాకుండా వైసీపీ అడ్డుకున్నదనే అక్కసో లేక మరే కారణమో తెలియదు కానీ, ఏపీ అధికార పార్టీని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే వున్నాడు.
తాము నిలబెట్టిన రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము రేపు ఏపీ పర్యటనలో వైసీపీ నేతల దగ్గరికి వెళ్లకుండా అడ్డుకునే దమ్ము ఢిల్లీలో బీజేపీ, ఏపీలో టీడీపీ అయిన ఆ నాయకుడికి ఉందా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
తెడ్డు విసిరేస్తే పొయ్యి దగ్గరికి పోదనే సామెత చందాన…ఈడ్చి తన్నితే రెండు ఓట్లు కూడా వేయించలేని నాయకుడు నోట ఏమిటీ ప్రేలాపనలు? ఎవరి ప్రయోజనాల కోసం కవ్వింపు మాటలు?
అంటరాని పార్టీ అంటూనే అదే పార్టీతో అంటకాగుతూ… పతివ్రత మాటలు దేనికి? తమ పార్టీ జాతీయ నాయకత్వమూ వైసీపీ మద్దతు కోరలేదంటున్న ఆయన… తమ పార్టీ అంటే టీడీపీని దృష్టిలో పెట్టుకుని అంటున్నారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏది సత్యం, ఏది అసత్యం చెప్పవయ్యా!