Advertisement

Advertisement


Home > Politics - Opinion

వైఎస్సార్‌సీపీ ప్లీన‌రీ -ప‌రిశీల‌న‌

వైఎస్సార్‌సీపీ ప్లీన‌రీ -ప‌రిశీల‌న‌

ఈ నెల 8,9 తేదీల్లో నాగార్జున యూనివర్సిటీ వద్ద జరిగిన వైసీపీ ప్లీనరీ -అంగరంగ వైభోగంగా, పెద్ద రెడ్డి గారి ఇంట్లో పెళ్లి వేడుక లా అట్టహాసంగా జరిగాయి. ఆకాశం అంత పందిరి వేశారు. భూదేవి అంత సభాస్థలి ఏర్పాటు చేసి సభికులకు ఆసనాలు వేశారు. కోనసీమ నుంచి చేపలు, రొయ్యలు, రాయలసీమ నుంచి పొటేళ్ల మాంసం, కాకినాడ నుంచి కోటయ్య ఖాజాలు, ఆత్రేయపురం నుంచి పూత రేకులు -సభికులను ముంచెత్తాయి.  

మృష్టాన్న భోజనంతో అతిధులకు కళ్ళల్లో, ముక్కుల్లో నీరు తెప్పిస్తూ 'కూల్' గా చంపేసే గోదావరి ఆతిథ్యానికి ప్రతినిధి అయిన చిర్ల సోమసుందరరెడ్డి గారి అబ్బాయి చిర్ల జగ్గిరెడ్డి (కొత్తపేట ఎమ్మెల్యే) పర్యవేక్షణలో ఆహార ఏర్పాట్లను అదరహో అనిపించారు. ఇవి చాలవన్నట్టు, పోలీసులే సభలో ఐస్ క్రీమ్‌లు పంపిణీ చేశారంటూ వార్తలు వచ్చాయి. 

రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన సభికులు రెండురోజుల పాటు - కలలో సైతం ఊహించని వైసీపీ అతిథ్యం స్వీకరించి, 'అన్నదాతా సుఖీభవ' అంటూ ముఖ్యమంత్రి జగన్‌ను ఆశీర్వదించి వెళ్లిపోయారు. అంత వరకు, ప్లీనరీ సూపర్ హిట్.

* అయితే, జగన్ మూడేళ్ల పాలనలో ఎదురైన లోటు పాట్లు....

* సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రభుత్వం ఎదుర్కొన్న సమస్యలు......

* వనరులను ప్రభుత్వం ఏ విధంగా సమకూర్చుకోగలిగింది.....

* ప్రభుత్వం ఈ మూడేళ్ళల్లో బదిలీ చేసిన దాదాపు లక్షా అరవై వేల నగదు వల్ల, ఎన్ని లక్షల మంది లబ్ధి దారులను దారిద్ర్య రేఖ దిగువ నుంచి ఎగువకు తీసుకు వచ్చి, వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టు చేయగలిగాం....

* వచ్చే ఎన్నికల లోపు ఆ తరువాత అధికారంలోకి వచ్చే అయిదేళ్ల లోనూ ఎంతమంది నిరుపేదలను దారిద్ర్య రేఖ పైకి తీసుకు రాగలం......

* సమాజం లోని వివిధవర్గాలు - ఉద్యోగులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గృహిణులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మొదలైన వారి సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు.....

* ప్రభుత్వ పథకాలు, ఆలోచనలు ముందుకు సాగకుండా ప్రతిపక్షాలు అడ్డు పడుతున్న తీరు.....

* వాటిని ప్రభుత్వం  సమర్ధంగా తిప్పికొట్టగలిగిన వైనం....

* 'దుష్ట చతుష్టయం ' తో పాటు, 'దత్త పుత్రుడు' వల్ల రాష్ట్రానికి ఎదురవుతున్న ఇబ్బందులు......

* ఆ ఇబ్బందులను అధిగమించడానికి  తీసుకోవలసిన చర్యలు......

*ఆ అయిదుగురినీ నిలువరించలేకపోతే, సమాజానికి జరిగే నష్టం....

* ఇక,రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అందుతున్న సహకారం......

* ఇంకా మరింత సహకారం కోసం మనం చేయాల్సిన కృషి....

* ఎన్నికలు జరగవలసి ఉన్న మిగిలిన రెండేళ్ల కాలంలో రాష్టాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయించడానికి ప్రభుత్వం వద్దనున్న బ్లూ ప్రింట్....

* ప్రతిపక్షాలను చావుదెబ్బ తీయడానికి - పార్టీ, ప్రభుత్వ పరంగా తీసుకోవలసిన చర్యలు......

* 'ఆ 23' కూడా- 'వాళ్ల'కు రాకుండా చేయడానికి, అంటే వైసీపీ కి 175 కి 175 రావడానికి ఏమి చేయాలి....

వీటితో పాటుగా, మంత్రిత్వ శాఖల వారీగా - ఆయా శాఖల మంత్రుల -రిపోర్ట్ కార్డులను ప్లీనరీ ముందు ఆవిష్కరించి ఉంటే, ఆయా శాఖల మంత్రులకు.. ప్రభుత్వానికి ప్రజల దృష్టిలో ఇమేజ్ బాగా పెరిగి ఉండేది. అలాగే చేసారేమో తెలియదు. అలా కాకుండా, తమ శాఖల విషయాలను అసలు పట్టించుకోకుండా, ఏవేవో అప్రస్తుత విషయాలు మాట్లాడి ఉంటే, వాటి వల్ల వారికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, ప్రభుత్వానికి, ప్రజలకు, చివరకు ప్లీనరీకి తరలి వచ్చిన వారికి కూడా ప్రయోజనం ఉండదు. వాటిని ఎవరూ గుర్తుంచుకోరు.

పార్టీ ని ప్రజలలోకి తీసుకెళ్ళడానికి అవసరమైన నిర్మాణాత్మాక వైఖరితో కూడిన అంశాలను చర్చించుకోడానికి, పార్టీ భవిష్యత్ ప్రయాణం సజావుగా కొనసాగించుకోడానికి వీలుగా ఒక మాస్టర్ ప్లాన్ ను రూపొందించుకోగలిగితే ఇటువంటి ప్లీనరీలు నిజంగానే ఉపయోగ పడతాయి.

అంత నిర్మాణాత్మకంగా ఎంతమంది వక్తలు, మంత్రులు మాట్లాడారో తెలియదు కానీ, రెండు, మూడు ఘటనలకు -ఈ ప్లీనరీ సమావేశాలు గుర్తుండి పోతాయి. ఒకటి - జగన్ మాతృమూర్తి వైఎస్. విజయమ్మ, తన గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం. ఇక, రెండోది - వైఎస్సార్‌సీపీకి శాశ్వత అధ్యక్షుడి గా జగన్ను సభికుల హర్షామోదాల మధ్య ప్రకటించడం.

చట్ట పరంగా ఈ ప్రకటన చెల్లుబాటు అవుతుందా అంటూ కొందరు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. ఎందుకంటే - భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేసుకునే ఏ రాజకీయ పార్టీ అయినా రెండేళ్లకోసారి కార్యవర్గానికి ఎన్నికలు 'జరిపినట్టు', కొత్త కార్యవర్గాన్ని 'ఎన్నుకొన్నట్టు' ఓ నివేదికను ఎన్నికల సంఘానికి సమర్పించాలి. రెండేళ్లకు కుదరక పోతే, ఎక్కువలో ఎక్కువ అయిదేళ్లకు ఈ గడువు మించకూడదు.

చంద్రబాబు నాయుడు 1997 నుంచి టీడీపీ కి అధ్యక్షుడుగా 'ఎన్నికవుతూ ' వస్తున్నారు. అంటే - గత పాతికేళ్ళుగా అన్న మాట. మరో పదిహేనేళ్లు ఆయనే టీడీపీ అధ్యక్షుడుగా 'ఎన్నిక'వుతారు. ఎవరికీ సందేహాలు అవసరం లేదు. కానీ, ఎన్నికల సంఘం నిబంధనలను తు. చ. తప్పకుండా, టీడీపీ పాటిస్తోంది.

ఒక రాజకీయ పార్టీకి ఎవరైనా సరే, శాశ్వత అధ్యక్షుడిగా 'ఎన్నికయ్యే' వెసుల బాటు మన ఎన్నికల సంఘం నిబంధనల్లో ఉండి ఉంటే తమిళనాడులో కరుణానిధి, ఒడిశాలో నవీన్ పట్నాయక్, బెంగాల్‌లో మమతా బెనర్జీ, యూపీలో అభిషేక్ యాదవ్, మాయావతి, బీహార్లో లాలూప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, ఢిల్లీలో కేజ్రీవాల్, కాశ్మీర్ లో అబ్దుల్లా, ముఫ్తి మహమ్మద్, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే,  రాజ్ థాక్రే , తెలంగాణాలో కేసీర్....ఎప్పుడో తమ తమ పార్టీ లకు శాశ్వత అధ్యక్షులుగా ప్రకటించుకుని ఉండే వారు. అలా ప్రకటించుకోలేదని అంటే - వారంతా ఉత్తమ ప్రజాస్వామిక వాదులు అని అర్ధం కాదు. అలా ప్రకటించుకోడానికి  ఎన్నికల సంఘం నియమ నిబంధనలు అనుమతించవు.

ఇది చట్టపరమైన కోణం. మరొకటి రాజకీయ కోణం.

సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు, వైస్సార్సీపీ అనేది - జగన్మోహన్ రెడ్డి తనకోసం, తన చేత ఏర్పాటు చేసుకున్న ఒక రాజకీయ పార్టీ లాటిది. ఆయనకు ఆయనే అధ్యక్షులు. దానిలో వివాదం లేదు. ఆయనకు పోటీ లేరు. ఎవరైనా ఆయన సమ్మతి తోనే దానిలో కొనసాగగలరు. మిగిలిన పదవుల్లో ఎవరిని నియమించినా.... ఆయన విల్ & ప్లెజర్ మేరకే కదా!ఇందులో ఎవరికీ అస్పష్టతే లేదు.

అయినా - వైస్సార్సీపీ కి 'శాశ్వత' అధ్యక్షుడు కావాలని ఆయన ఈ తరుణంలో ఎందుకు భావించారో తెలియదు. తగిన కారణం లేకుండా, ఆయన ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఉండరు. ఇక, భారత ఎన్నికల సంఘం నుంచి ఈ మార్పుకు ఆయన ఆమోద ముద్ర వేయించుకోవలసి ఉంది. ఇందులో ఆయన కృతకృత్యులు అయితే, దేశం లోని ప్రాంతీయ పార్టీలకు ఓ మార్గం చూపిన వారు అవుతారు.

బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలకు శాశ్వత అధ్యక్షులు వస్తారు. ఇక, పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు విజయమ్మ ప్రకటించడం అనేది జగన్ కుటుంబ వ్యవహారం. ఆవిడ ఆయన మాతృమూర్తి. దీనిపై బయటి వారు ఎవరైనా వ్యాఖ్యానించాల్సిన పని లేదు.

చివరకు, ప్లీనరీ గురించి మూడు ముక్కల్లో చెప్పాల్సి వస్తే - 1. బ్రహ్మాండమైన, షడ్రషోపేతమైన, మళ్ళీ మళ్ళీ గుర్తుండి పోయే వంటకాలు. 2. అంతగా గుర్తు ఉండడానికి వీలు లేని నేతల ప్రసంగాలు 3. వైస్సార్సీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ పేరుకు ప్లీనరీ ఆమోద ముద్ర వేయడం.

భోగాది వేంకట రాయుడు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?