కేంద్రంలో భాజపా కనుక ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటే తాము రెడీ అని, అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికల బరిలో దిగడానికి తాము రెడీ అని తెలంగాణ సిఎమ్ కేసిఆర్ ప్రకటించారు. అంతే కాదు, ముందస్తు ఎన్నికలకు తెలంగాణలో భాజపా, కాంగ్రెస్ రెడీనా? ఆ దమ్ముందా? అంటూ సవాల్ చేసారు.
కేంద్రంలో భాజపా ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా అన్న విషయంలో క్లారిటీ లేదు. నిజానికి భాజపాకు ఆ అవసరం కూడా అంతగా లేదు. కానీ భాజపా రాజకీయ వ్యూహ కర్తలు ఏం ఆలోచిస్తారో అన్నది ఎవరికీ అంత సులువుగా అంతు పట్టదు.
కానీ ఒకవేళ అనుకోకుండా కేంద్రం కనుక ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఆంధ్రలో వైకాపా పరిస్థితి ఏమిటి? అన్నది అసలు సిసలు క్వశ్చను. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వెళ్లే మూడ్ లో వైకాపా లేదు. ఇంకా రెండేళ్ల సమయం వుంది. ఇంత గ్యాప్ ను వదలుకోవడం అంత మంచి ఆలోచన అనిపించుకోదు. పైగా ఆంధ్రలో ప్రతిపక్షాలు యుద్దానికి కాలు దువ్వుతూ సన్నద్దంగా వున్నాయి.
ప్రభుత్వం మీద యాంటీ ఓటు ఏదైనా వుంటే దాన్ని మార్చుకోవడానికి రెండేళ్ల సమయం అన్నది చాలా అదృష్టం. ఇలాంటి సమయాన్ని వదులుకోవడం అన్నది ఆత్మహత్యా సదృశం అవుతుంది.
అందువల్ల జగన్ పరిస్థితి, లిమిటేషన్లు తెలుసుకుంటే కేంద్రం కూడా ముందస్తుకు వెళ్లదు. జగన్ పరిస్థితి మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాల్లో భాజపా, దాని మిత్ర పక్షాల పరిస్థితిని కూడా దృష్టిలో వుంచుకోవాల్సి వుంటుంది. పైగా కేసిఆర్ ను ఈ వేడిలో ఢీకొనడం అంత సబబుగా వుండదు. మరో ఏడాది ఆగితే తెలంగాణలో భాజపా మరింత బలం పుంజుకునే అవకాశం వుంది.
ఎందుకంటే భాజపా తెరవెనుక రాజకీయాలు మొదలుపెట్టి ఇంకా గట్టిగా ఆరు నెలలు కూడా కాలేదు. ఒక్కొక్క ఎత్తుగడ వేస్తూ, తెరాసను కట్టడి చేసే ప్రయత్నం భాజపా చేస్తోంది. అది తెలుసుకునుకనే కేసిఆర్ భగ్గుమంటున్నారు.
కేసిఆర్ సంగతి అలా వుంచితే ఆంధ్రలో జనసేన హడావుడి పెరిగింది. తేదేపా గడబిడ పెరిగింది. సిఎమ్ జగన్ మొత్తం పరిస్థితిని అంచనా వేసుకుని, ఎక్కడెక్కడ లోపాలు వున్నాయన్నది ఒక్కొక్కటి సవరించుకుంటూ రావాల్సి వుంది. దానికి ఈ రెండేళ్ల సమయం అవసరం అందువల్ల ముందస్తుకు జగన్ సిద్దం కాకపోవచ్చు.
గతంలో ముందస్తు సూచనలు ఇచ్చింది కేవలం ప్రతిపక్షాలను కాస్త అయోమయానికి గురి చేసే ప్రయత్నం తప్ప వేరు కాదని ఇప్పటికే సూచనలు వచ్చాయి.