జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయాల నుంచి కాస్తా విరామం తీసుకుని మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ ‘పింక్’ చిత్రాన్ని శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు, బోనీకపూర్ కలిసి ‘వకీల్‌సాబ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. బాగా గ్యాప్ తీసుకున్న తర్వాత చేస్తున్న ఈ సినిమాపై అభిమానులతో పాటు టాలీవుడ్ కూడా చాలా అంచనాలే పెట్టుకొంది.
ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది. మిగిలిన షూటింగ్‌కు షెడ్యూల్ రెడీగా ఉన్న దశలో కరోనా మహమ్మారి మన దేశాన్ని కమ్మేస్తూ వచ్చింది. దీంతో లాక్డౌన్ చేయాల్సి వచ్చింది. ఈ వైరస్ దుష్ప్రభావంతో ‘వకీల్‌సాబ్’ చిత్రీకరణ కూడా ఆగింది.
నిజానికి అన్నీ అనుకున్నట్టుగానే జరిగి ఉంటే ఈ సినిమా మే 15న విడుదల అయ్యేది. ఆ మేరకు సినిమా విడుదల డేట్‌ను ప్రకటించడంతో పాటు ఏర్పాట్లు కూడా చేపట్టిన విషయం తెలిసిందే. కానీ అనుకోని విపత్తు కరోనా రూపంలో రావడంతో సినిమా షూటింగ్‌ను విరమించుకోవాల్సి వచ్చింది.
అయితే కరోనా వైరస్ వల్ల వచ్చిన ఈ గ్యాప్‌ను ‘వకీల్‌సాబ్’ టీమ్ సద్వినియోగం చేసుకుంటోందని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకు పూర్తయిన సినిమా ఎడిటింగ్ చూసి పవన్ డబ్బింగ్ చెబుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. డబ్బింగ్ పూర్తయితే… లాక్ డౌన్ ఎత్తివేయగానే మిగిలిన పార్ట్‌ను త్వరగా పూర్తి చేసి అనుకున్న టైమ్‌లో విడుదల చేయవచ్చని చిత్ర యూనిట్ అనుకుంటోందట.