కరోనా మహమ్మారి సంసారంలో కూడా చిచ్చు పెడుతోంది. కరోనా వైరస్ చేస్తున్న ఆగడాలు అన్నీఇన్నీ కావు. తనిష్టమొచ్చినట్టు మనుషుల జీవితాలతో ఆడుకుంటోంది. చివరికి భార్యాభర్తల మధ్య గొడవ సృష్టించి…పోలీస్‌స్టేషన్ వరకు పంచాయితీ వెళ్లింది. భర్తపై భార్య కేసు పెట్టే వరకు పరిస్థితిని కరోనా వైరస్ తీసుకెళ్లింది.
ఎయిడ్స్ కంటే ఎక్కువగా కరోనా భయపెడుతున్నదనేందుకు ఇదే ఉదాహరణ. కర్నూలు జిల్లా ఆదోనిలో ఆ జంట పిల్లాపాపలతో సుఖంగా కాలం గడుపుతోంది. ఇది కరోనా వైరస్ మహమ్మారి వ్యాపించడానికి ముందు మాట. తాజాగా ఏం జరిగిందంటే…ఆదోని మండలంలోని ఓ గ్రామం అది. ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వృత్తిరీత్యా డ్రైవర్. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడలో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
లాక్‌డౌన్ కారణంగా ఆ డ్రైవర్ రెండు రోజుల క్రితం స్వగ్రామానికి చేరుకున్నాడు. అయితే భర్తను ఇంట్లోకి వచ్చేందుకు భార్య అనుమతించలేదు. దీనికి కారణం కరోనా. ఎక్కడెక్కడో తిరిగొచ్చిన భర్తను…ముందు వైద్య పరీక్షలు చేయించుకుని రావాల్సిందేనని ఆమె పట్టు పట్టింది. అతను వినలేదు. అయినా ఆమె పట్టు వీడలేదు. దీంతో భార్యాభర్తల మధ్య సమస్య ఉత్పన్నమైంది.
ఒకవేళ తన భర్తకు కరోనా పాజిటీవ్ ఉంటే…ఇంట్లోని తన ఇద్దరు పిల్లలతో పాటు తనకు సోకుతుందని, అందువల్ల వైద్య పరీక్షలు చేయించుకుని, నెగటీవ్ అని రిపోర్ట్ వస్తే తప్ప ఇంట్లోకి అనుమతించనని ఆమె తెగేసి చెప్పింది. భార్య మాట వినాల్సింది పోయి…గొడవ పడ్డాడు. దీంతో ఆమె ఆదోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
పోలీసులు దంపతులిద్దరినీ ఆదోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ లింగన్న సదరు డ్రైవర్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాడు. అనంతరం అతన్ని ఆదోనిలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. ఈ విధంగా కథ సుఖాంతమైందన్న మాట.