మేధావి దర్శకుడిగా పేరుబడ్డ రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ అలియాస్ రాంగో ఇక మారడా? కొన్నాళ్లుగా దేశమంతా, ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంది. కరోనా అన్నిదేశాలను పట్టిపీడిస్తోంది. తురుంఖాన్ దేశంగా అందరూ చెప్పుకునే అమెరికా సైతం బేరుమంటోంది.
నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. విలయ తాండవం అంటే ఏమిటో కరోనా మహమ్మారి తెలియచేస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్, బాలీవుడ్ సినిమా తారలు అనేకమంది దేశప్రజలను ఆదుకోవడం కోసమే కాకుండా ప్రస్తుతం ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న సినిమా రంగంలోని పేద కళాకారులను ఆదుకునేందుకు కూడా ముందుకు వచ్చారు.
కేంద్ర ప్రభుత్వానికి, ఇరు తెలుగు రాష్ట్రాలకు విరాళాలు అందించిన తెలుగు తారలు కొత్తగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. దీనికి కూడా చాలామంది నటులు, దర్శకులు, రచయితలూ, ఇంకా ఎందరో విరాళాలు ఇచ్చారు. కొందరు తారలు వివిధ సేవల రూపంలోనూ సహాయం చేస్తున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ ఉదారంగా ముందుకు కదిలిందన్న విషయం వాస్తవం. మెగాస్టార్లు మొదలుకొని నిన్న మొన్న వచ్చిన చిన్నాచితకా నటుల వరకు శక్తికొద్దీ విరాళాలు ఇచ్చారు.
ఎవరెవరు ఎంతెంత విరాళాలు ఇచ్చారో ఆ జాబితా కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఇందులో అబద్ధమేదీ లేదు. విరాళాలు ఇచ్చిన వారి జాబితాలో మేధావి దర్శకుడిగా పేరు పొందిన ఆర్జీవీ పేరు మాత్రం లేదు. ఆయన పైసా విరాళం ఇచ్చినట్లు మీడియాలో వార్త రాలేదు. ఒకవేళ తాను విరాళం ఇస్తే బయటకు చెప్పకూడదని అనుకున్నాడా ?
అంటే కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అంటారు పెద్దలు. రాంగోది అలాంటి స్వభావమా? కాకపోవచ్చు. ఎందుకంటే తనకు సాయం చేసే గుణం లేదని టీవీ ఛానెల్స్ ఇంటర్వ్యూల్లో చెప్పాడు. తాను పక్కా స్వార్ధపరుడిని అని కూడా చెప్పాడు. ఇప్పటివరకూ ఎవ్వరికీ పది పైసలు దానం చేయలేదన్నాడు. ఇలాంటి ఆర్జీవీ కరోనా విపత్తులో విరాళం ఇస్తాడని అనుకోలేం. పోనీ… సాయం చేయకపోతేపోయాడు.. గమ్మున ఇంట్లో కూర్చోవచ్చుకదా.
ప్రస్తుతం లాక్ డౌన్ కాబట్టి తప్పనిసరిగా ఇంట్లోనే ఉన్నాడు. కానీ ఇంట్లో కూర్చొని ఆయన చేసే పని ఏమిటంటే ట్విట్టర్లో వివాదాస్పద పోస్టులు పెట్టడం. ప్రస్తుత పరిస్థితిలో అందరి దృష్టి కరోనా విపత్తు మీదనే ఉంది. ఎవరూ రాజకీయాలు మాట్లాడటంలేదు. వివాదాలు లేవనెత్తడం లేదు. ఒకరిని మరొకరు గెలకడంలేదు. కానీ రాంగోపాల్ వర్మ అనవసరంగా గెలుకుతున్నాడు.
లాక్ డౌన్ కారణంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ హైదరాబాదులోని తమ ఇంట్లోనే ఉన్నారు. తండ్రీకొడుకులిద్దరూ ఖాళీగానే ఉన్నారు కాబట్టి అమెజాన్ ప్రైమ్ లో తాను తీసిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా చూడాలని కోరుతూ పోస్టు పెట్టాడు. ఇది గెలకడమే కదా. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు పెద్ద వివాదాస్పద చిత్రమని అందరికీ తెలుసు.
ఇందులో చంద్రబాబును, లోకేష్ ను కించపరిచారని అప్పట్లో టీడీపీ నాయకులు పెద్దఎత్తున ఆరోపణలు చేశారు. సినిమా టైటిల్ వివాదాస్పదం కావడంతో సెన్సార్ బోర్డు ఆదేశంతో దాన్ని మార్చారు. ఇలాంటి సినిమాను చూడాలని వర్మ కోరడం వివాదం రాజేయాలనే ఉద్దేశంతోనే. శివ సినిమా వచ్చినప్పుడు టాలీవుడ్ లో వర్మ వండర్స్ చేస్తాడని అనుకున్నారు. కానీ క్రమంగా గాడి తప్పాడు. పాతాళానికి దిగజారాడు.