ఒకప్పుడు థియేటర్ అంటే ప్రిస్టేజ్ సింబల్. సినిమా థియేటర్ ఓనర్ అంటే ఆ లెవెల్ వేరు. నాలుగైదు థియేటర్లు వుంటే ఆయన స్థాయిని ఊహించలేం. 60 ఏళ్ల క్రితం డబ్బున్న వాళ్లు ప్రిస్టేజ్ కోసం పెట్టుబడి పెట్టేవి రెండే వ్యాపారాలు. ఒకటి థియేటర్, రెండు బస్సు. అప్పట్లో సినిమా తప్ప వేరే వినోదం లేదు. అందుకే పరమడొక్కు థియేటర్లు కూడా జనాలతో నిండేవి. పిక్చర్ క్వాలిటీ లేకుండా మసకమసకగా కనిపించినా చూసేవాళ్లు. టాయిలెట్స్ లేకపోయినా భరించేవాళ్లు. 80 తర్వాత థియేటర్ నిర్వహణలో చిన్నచిన్న మార్పులు వచ్చాయి. నగరాల్లో కొంచెం శుభ్రత వచ్చింది కానీ, ఊళ్లలో అదే ఘోరం.
1985 తర్వాత థియేటర్‌ని హత్య చేయడానికి టీవీ పుట్టింది. తర్వాత వీడియో క్యాసెట్లు. చిన్న వూళ్లలో టెంట్లు మూతపడడానికి ఈ వీసీఆర్‌లే కారణం. వీడియో ద్వారా అర్ధ రూపాయికి, రూపాయికి కొత్త సినిమాలు చూపించే వ్యాపారం పుట్టింది. తర్వాత సీడీలు, డీవీడీలు వచ్చే సరికి టౌన్లలో థియేటర్లు మూత ప్రారంభమైంది. ఇవన్నీ పాత సినిమాలపై ఆధారపడి బతికేవి. డీవీడీలు వచ్చే సరికి ఇళ్లలోనే పాత సినిమాలు చూడసాగారు. దాంతో ఇవన్నీ ఫంక్షన్ హాల్స్‌గా మారిపోయాయి.
థియేటర్లు బతకాలంటే ఏసీ, సౌండ్ సిస్టమ్, సిటింగ్ ఈ హంగులన్నీ కంపల్సరీ అయ్యాయి. ఇంతలో డిజిటల్ విప్లవం వచ్చింది. పైరసీ, యూట్యూబ్ దెబ్బకి థియేటర్లకి చుక్కలు కనబడ్డాయి. కొత్త సినిమా విడుదలైనప్పుడు ఏదో వారం రోజులు డబ్బులు కళ్ల జూసే స్థితి. కరోనాతో మొత్తం వ్యవస్థే మారిపోయింది. జనం OTTలకి అలవాటు పడ్డారు. దీనికి తోడు నాసిరకం సినిమాలు, టికెట్ రేట్లతో జనం థియేటర్ వైపు రావడం మానేశారు.
ఇప్పుడు థియేటర్ మనుగడ సాగించాలంటే ఒకటి అధునాతనంగా వుండాలి. రెండు సూపర్‌హిట్ సినిమాలు వుండాలి. రెండోది థియేటర్ చేతిలోనే కాదు ఎవరి చేతుల్లోనూ లేదు. ప్రపంచంలోని ఏ భాష సినిమా అయినా అరచేతిలోని ఫోన్‌లో చూసే ప్రేక్షకుడికి నచ్చే విధంగా తీయడం కొమ్ములు తిరిగిన దర్శకుల వల్ల కూడా కావడం లేదు.
ఏదో రకంగా హైప్ క్రియేట్ చేసి, హీరోల ఫేస్ వాల్యూతో ఓపెనింగ్స్ లాక్కోవడం తప్ప వేరే దిక్కులేదు. ఇది తెలుగు సినిమా సమస్య కాదు. దేశ వ్యాప్త సినిమా. ఈ మధ్య కాలంలో బాగా డబ్బులొచ్చిన సినిమాలు RRR, పుష్ప, KGF2 ఇవి మూడు దక్షిణాదివే. సినిమాలన్నీ డిజాస్టర్ అవుతుండడంతో బాలీవుడ్ జుత్తు పీక్కుంటూ సౌత్ వైపు చూస్తోంది.
థియేటర్‌లు భవిష్యత్‌లో ఎంత మాత్రం వుంటాయి అనే ప్రశ్న పట్టిన సమయంలో వ్యాపార రంగంలో ఒక కొత్త పరిణామం జరిగింది.
దేశ వ్యాప్తంగా మల్టీప్లెక్స్ థియేటర్‌లలో 88 శాతం వున్న పీవీఆర్ , ఐనాక్స్ కలిసి పోయాయి. థియేటర్ల నిర్వహణలో గుత్తాధిపత్యం సాధించడానికి ప్రయత్నం మొదలైంది. 2024 నాటికి 18 వేల కోట్ల నుంచి , 22 వేల కోట్ల వ్యాపారానికి ఎదగాలని , కనీసం 6800 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంటే నగరాలకే పరిమితమైన ఈ థియేటర్లు రాబోవు రెండేళ్లలో పట్టణాలకి వస్తాయి. గతంలో కంటే ఇపుడు నిర్మాణం సులువు, తక్కువ సమయం కాబట్టి విస్తరణ వేగంగా వుంటుంది. ఉదాహరణకి అనంతపురంలో ఐదు థియేటర్ల మల్టీప్లెక్స్ వస్తే, ఆల్రెడీ ఉన్న వాటిలో నాలుగైదు మూతపడతాయని అర్థం.
ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాల సక్సెస్ రేట్ తక్కువ కాబట్టి లాభాలు కూడా అంత సులువు కాదని ఈ సంస్థలకి తెలుసు. అందుకే చిన్న చేపల్ని తినేస్తాయి. అంతా అనుకున్నట్టు జరిగితే సింగిల్ స్క్రీన్ థియేటర్లు రాబోయే ఐదేళ్లలో సగం మూతపడతాయి. అంతర్జాతీయ లెక్కల ప్రకారం చైనాలో ప్రతి 10 లక్షల మందికి 37 స్క్రీన్స్ వుంటే మనకి 9 మాత్రమే. థియేటర్లకి వచ్చే వాళ్లు ఇక్కడ లేకకాదు. రప్పించగలిగే అధునాతన థియేటర్లు లేవు.
పీవీఆర్, ఐనాక్స్‌కి కలిపి 1546 స్క్రీన్స్ వున్నాయి. 145 నగరాల్లో విస్తరించి వున్నాయి. ఈ సంఖ్యని 2000 స్క్రీన్స్‌కి పెంచుతారు. అయితే మల్టీప్లెక్స్ అనగానే జనం వచ్చేస్తారా? ఖచ్చితంగా రారు. వాళ్లకి ప్రత్యేకమైన థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. ఒక్కో థియేటర్ టెక్నాలజీ కోసం 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నారు. సింగిల్ స్క్రీన్ యజమానులకి ఈ పెట్టుబడి సాధ్యం కాదు, వర్కౌట్ కాదు. థియేటర్‌కి జనం రారు. వాళ్లకి పెద్ద సినిమాలు రావు. చిన్న సినిమాలతో నడవాలి. భరించలేని స్థితిలో వాళ్లు మూసేస్తారు.
అయితే థియేటర్‌లో ఎన్ని హంగులున్నా జనం రావాలంటే మంచి సినిమాలు, భారీ సినిమాలు ఉండాలి కదా! బాహుబలి-2కి 24 గంటల్లో 10 లక్షల టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ అయ్యాయి. మిగతా సినిమాల్ని చూసే నాథుడే లేడు. ఈ సంస్థల వ్యాపారం సజావుగా జరగాలంటే భారీ బడ్జెట్, హెవీ సినిమాలు రావాలి. అందుకని వాళ్లే పెట్టుబడులు పెడతారు. చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు OTTకి పరిమితం అవుతారు.
వచ్చే పదేళ్లలో భారతీయ సినిమా, థియేటర్ల నిర్వహణ మొత్తం కార్పొరేట్ సంస్థల చేతుల్లో వుంటుంది. ఇదే భవిష్యత్తు!
జీఆర్ మహర్షి