సెల‌బ్రిటీల‌కు స‌హ‌జీవ‌న‌మే ప‌రిష్కార‌మా!

ఇప్ప‌టికే సుప్రీం కోర్టు స్థాయిలో స‌హ‌జీవ‌నానికి ఆమోద‌ముద్ర ప‌డింది. ద‌శాబ్దం కింద‌ట నుంచినే దేశంలో ఈ అంశంపై గ‌ట్టి చ‌ర్చ జ‌రుగుతూ ఉంది. ఇప్ప‌టికే సినిమాల వ‌ర‌కూ స‌హ‌జీవ‌న అంశం స్క్రిప్ట్ గా మారింది!…

ఇప్ప‌టికే సుప్రీం కోర్టు స్థాయిలో స‌హ‌జీవ‌నానికి ఆమోద‌ముద్ర ప‌డింది. ద‌శాబ్దం కింద‌ట నుంచినే దేశంలో ఈ అంశంపై గ‌ట్టి చ‌ర్చ జ‌రుగుతూ ఉంది. ఇప్ప‌టికే సినిమాల వ‌ర‌కూ స‌హ‌జీవ‌న అంశం స్క్రిప్ట్ గా మారింది! ఇలాంటి త‌రుణంలో వివాహాలు, వాటిని వెంటాడుతున్న వివాదాల ప‌రంప‌ర‌ను గ‌మ‌నిస్తే.. సినిమా సెల‌బ్రిటీల‌కు వివాహం క‌న్నా స‌హ‌జీవ‌న‌మే ఉత్త‌మ‌మైన జీవన విధానం ఏమో అనిపిస్తుంది ప‌రిశీల‌కుల‌కు. 

ఈ విష‌యంలో సినిమా వాళ్ల‌కు స‌ల‌హాలు ఇవ్వ‌డం కాదు కానీ, వారి వివాహ అంశాలు వార్త‌ల‌కు ఎక్కుతున్న తీరును గ‌మ‌నిస్తే మాత్రం.. సెల‌బ్రిటీల‌కు స‌హ‌జీవ‌న‌మే ఉత్త‌మ ప‌రిష్కార‌మార్గం అని స్ప‌ష్టం అవుతుంది.

అది రంగురంగుల ప్ర‌పంచం. వ్య‌క్తుల‌తో ప‌రిచ‌యం చాలా సుల‌భం. సినిమా రంగం అంటేనే.. మిగిలిన ప్ర‌పంచానికి ఉన్న అభిప్రాయ‌మే వేరు! సినిమా రంగంలో స్త్రీలంటే చిన్న‌చూపు ఈనాటిది కాదు, ఒక ప్రాంతానికో, దేశానికో ప‌రిమితం అయిన‌దీ కాదు. ఆ హీరోయిన్ల‌ను మ‌హాన‌టీమ‌ణులుగా ఆరాధిస్తారు. వారి పేర్ల క్రేజీగా ప‌ల‌వ‌రిస్తారు. అయితే.. అంతిమంగా మాత్రం తారామ‌ణులంటే చిన్న చూపే! అయితే అదే సినీ రంగంలో స‌ద‌రు హీరోయిన్ల‌కు ఆద‌ర‌ణ‌కు కొద‌వ‌లేదు. వారంటే విప‌రీత‌మైన ప్రేమ‌తో పెళ్లి చేసుకునే హీరోలుంటారు. 

వ్యాపారంగంలో సక్సెస్ ఫుల్ ప‌ర్స‌న్లు త‌మ రెండో భార్య‌లుగా అయినా హీరోయిన్లను తెచ్చుకుంటూ ఉంటారు. మ‌రి కొంద‌రికి మొద‌టి భార్య‌గానే సినిమా న‌టిని తెచ్చుకునే క్రేజ్ కూడా ఉంటుంది. క్రీడాకారులూ సినీతార‌లు స‌మ స్థాయి ఆద‌ర‌ణ ఉన్న వారు ప్ర‌పంచ‌మంతా. ఇలాంటి రంగాల నుంచి వ‌చ్చిన వారు కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెట్ట‌డం రివాజు.

మ‌రి తార‌ల పెళ్లిళ్లు ఎంత ఘ‌నంగా జ‌రుగుతున్నాయో ఆ బంధాలు మాత్రం అంత దివ్యంగా సాగుతున్న‌ట్టుగా క‌న‌ప‌డ‌వు. ప్ర‌త్యేకించి వైవాహిక బంధానికి ఎంతో ప్రాధాన్య‌త‌ను ఇస్తున్న‌ట్టుగా క‌నిపించే భార‌తీయ స‌మాజంలో సినిమా వాళ్ల పెళ్లిళ్లను సామాన్యులు ప్ర‌హ‌సానాలుగా చూడటం కొత్త‌దేమీ కాదు. 

సినిమా వాళ్లు సుల‌భంగా ప్రేమ‌లో ప‌డ‌తార‌ని, వారి పెళ్లిళ్లు సులువుగా జ‌రుగుతాయ‌ని, విడిపోవ‌డం కూడా అంతే వేగంగా జ‌రుగుతుంద‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా ఉన్నాయి! ఇవి మారిస్తే మారే ప‌రిస్థితి లేదు. దీనికి వీలైనన్ని సినీ  వైవాహిక బంధ వైఫ‌ల్యాలు ఊతం ఇస్తున్నాయి.

జీవితంలో ఒక వివాహం విఫ‌లం అయితే అది గ్ర‌హ‌చారం అనుకోవ‌చ్చు. ఇక రెండో వివాహం కూడా అదే దారిన న‌డిస్తే.. ప‌రిస్థితిని స‌మీక్షించుకోవ‌డం ఎవ‌రైనా చేయాల్సిన ప‌నే. అయితే కొంద‌రు సినిమా వాళ్లు మూడో పెళ్లి త‌ర్వాత కూడా తాము మ్యారేజ్ మెటీరియ‌లా కాదా..  అనే విష‌యంపై అంచ‌నాకు రాలేరు పాపం! స‌రే.. వారి వివాహాలు వారి వ్య‌క్తిగ‌తం అనవ‌చ్చు. 

కానీ స‌ద‌రు సినీ తారలు స‌మాజానికి ఎన‌లేని నీతులు చెబుతూ ఉంటారు. రాజ‌కీయాలు మాట్లాడతారు, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా అవుదామ‌నే ప్ర‌య‌త్న‌మూ చేస్తారు. మ‌రి త‌మ వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఒక క‌ట్టుబాటుకు కొన‌సాగించ‌లేని స‌ద‌రు తార‌లు స‌మాజాన్ని గాడిన పెట్టేందుకు రాజ‌కీయంలోకి రావ‌డం విడ్డూర‌మైన అంశం.

ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవ‌చ్చు, ఎన్ని సార్లు అయినా విడిపోవ‌చ్చు..అనేది పాశ్చాత్య సంస్కృతి కావొచ్చు గాక‌. పాశ్చాత్య నాగ‌రక‌త‌ను ఎంత‌గా అనుస‌రిస్తున్నా.. ఇండియా ఇంకా వైవాహిక బంధానికి ఎంతో కొంత విలువ అయితే ఉంది. దాన్ని వీలైనంత గా త‌గ్గించి వేయాల‌న్న‌ట్టుగా సినీతార‌ల వ్య‌వ‌హారాలైతే సాగుతూ ఉన్నాయి. 

ఇలాంటి వివాదాలు రేప‌డం క‌న్నా.. సినిమా తార‌ల‌కు ఎలాగూ స‌హజీవ‌నం అనే ఆప్ష‌నం ఉండ‌నే ఉంది. సినీతార‌లే కాదు.. భార‌త‌దేశంలో ఇష్టం ఉన్న వారెవ‌రికైనా ఈ అవ‌కాశాన్ని ప్ర‌భుత్వాలు, కోర్టులే ఇస్తున్నాయి. ఇలాంట‌ప్పుడు ఎంచ‌క్కా ఆ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవ‌డం ఉత్త‌మ‌మేమో! ఇదో ఉచిత స‌ల‌హా!