ఇదంతా కామన్ … లైట్ తీసుకుంటున్నారు 

రాజకీయాలు అంటేనే వింతలు, విశేషాలు, అనుకోని సంఘటనలు, అనూహ్యమైన ట్విస్టులు … ఇంకా అనేకం ఉంటాయి. ఒక నాయకుడు ఒక పార్టీలో ఉన్నంత కాలం విమర్శలు ఉండవు. పొగడ్తలు, ప్రశంసలే. భజన సంకీర్తనలే ఉంటాయి.…

రాజకీయాలు అంటేనే వింతలు, విశేషాలు, అనుకోని సంఘటనలు, అనూహ్యమైన ట్విస్టులు … ఇంకా అనేకం ఉంటాయి. ఒక నాయకుడు ఒక పార్టీలో ఉన్నంత కాలం విమర్శలు ఉండవు. పొగడ్తలు, ప్రశంసలే. భజన సంకీర్తనలే ఉంటాయి.

ఆ నాయకుడు తాను ఉన్న పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్లాడనుకోండి, పాత పార్టీలో ఉన్నప్పుడు అతని మాటలకు, చేతలకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు అన్నీ బయటకు వస్తాయి. అయితే వాటిని జనం పట్టించుకోరు. పాత పార్టీ నాయకులూ పట్టించుకోరు. రాజకీయాల్లో ఇవన్నీ కామన్ అని ఊరుకుంటారు.

ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాక ఇప్పుడు కేసీఆర్ ను, టీఆర్ఎస్ ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాజీనామా సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లోనూ బాగానే విమర్శలు గుప్పించారు. దీంతో టీఆర్ఎస్ మంత్రులు ఈటల మీద విమర్శలు చేయడంతోపాటు ఆయన టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ను, కేటీఆర్ ను, ఇతర కొందరు నాయకులను పొగిడిన వీడియోలను విడుదల చేశారు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు పొగిడిన వ్యక్తే ఇప్పుడు విమర్శిస్తున్నాడని చెప్పడమన్నమాట.

గులాబీ పార్టీలో ఉండగా బీజేపీపై చాలా విమర్శలు చేశాడు. ఇప్పుడు అదే పార్టీలో చేరుతున్నాడు. ఆ వీడియోలు కూడా టీఆర్ఎస్ నాయకులు విడుదల చేశారు. కానీ ఈ వీడియోలు చూస్తే బీజేపీ నాయకులకు కోపం వస్తుందా? ఎందుకయ్యా మమ్మల్ని అంతలా విమర్శించావు అని అడుగుతారా? నువ్వు మమ్మల్ని, మా పార్టీని తీవ్రంగా విమర్శించావు కాబట్టి నిన్ను చేర్చుకోము వెళ్ళిపో అంటారా ? బీజేపీ నాయకులు అస్సలు ఫీలవరు. పార్టీలో చేర్చుకోము అనరు. ఈటల టీఆర్ఎస్ లో ఉండగా బీజేపీని తిట్టిన సంగతి బీజేపీ నాయకులకు తెలియదా ?

ఇబ్బడి ముబ్బడిగా టీవీ చానళ్లు, యూట్యూబ్ చానళ్లు, సోషల్ మీడియా పెరిగిపోయిన ఈ రోజుల్లో ఏది మాత్రం దాగుతుంది. నాయకులు రహస్యంగా జరుపుకునే సమావేశాలు కూడా కాసేపటికే టీవీ చానళ్లలో ప్రత్యక్షం అవుతున్నాయి. తెలంగాణా ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు కేసీఆర్ ను బండబూతులు తిట్టిన కొందరు నాయకులు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. రోజూ కేసీఆర్ భజన చేస్తున్నారు. చంద్రబాబును తిడుతుంటారు. ఆ వీడియోలన్నీ యూట్యూబులో దొరుకుతున్నాయి.

జోరుగా భజన చేసే మంత్రుల్లో తలసాని శ్రీనివాస యాదవ్ ముందుంటాడు. ఈయన టీడీపీలో ఉన్నప్పుడు సమైక్య ఆంధ్రను గట్టిగా సమర్ధించాడు. చంద్రబాబును ఆకాశానికి ఎత్తేవాడు. టీఆర్ఎస్ లో చేరాక చంద్రబాబును బండబూతులు తిట్టాడు. కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తాడు. 

టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరి మంత్రులు అయినవారందరిది ఇదే వ్యవహారం. కేసీఆర్, చంద్రబాబు పట్టించుకోలేదు కదా. నగరి ఎమ్మెల్యే, ఏపీ ఐఐసీసీ చైర్ పర్సన్, వైఎస్ జగన్ కు వీర భక్తురాలు రోజా టీడీపీలో ఉండగా అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అనరాని మాటలు అన్నది. రోజా నోరు విప్పితే ఎంత ఘాటుగా మాట్లాడుతుందో తెలిసిందే కదా.

ఇప్పుడు అదే రోజా చంద్రబాబును ప్రతిరోజూ బూతులు తిడుతోంది. టీడీపీ అధికారంలో ఉండగా అసెంబ్లీలో రోజా రెచ్చిపోయిన సందర్భాలు చాలా చూసాం. చంద్రబాబును ఆమె తిట్టిన తిట్లు ఎవరూ తిట్టలేరు. పచ్చిగా తిట్టడంలో రోజా దిట్ట. ఒకప్పుడు చంద్రబాబు మా పార్టీలో మగవాడు ఉన్నాడంటే అది రోజాయే అన్నాడు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని తిట్టినందుకు అది చంద్రబాబు ప్రశంస. టీడీపీలో ఉన్నప్పుడు ఆమె తిట్లు, వైసీపీలో ఆమె తిట్లు యూట్యూబులో బొచ్చెడు కనబడతాయి.

వీర లెవెల్లో తిట్టడం, వీర లెవెల్లో పొగడటం ఇప్పటి నాయకుల నైజం. ఈ ధోరణిని ఎవ్వరూ పట్టించుకోరు. కోర్టులో కేసులు వేయరు. తమ పరువు పోయిందని ఏడవరు. ఇదంతా ఆటలో భాగం అనుకుంటారు అంతే. ప్రతిపక్షాలను తిడితేనే, తామున్న పార్టీ అధినేతను పొగిడితేనే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నట్లు లెక్క. అలా  వ్యవహరిస్తేనే మీడియాలో ప్రచారం లభిస్తుంది. జనాల్లో చర్చలు జరుగుతాయి. అలాంటి వాళ్ళకే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది.