మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరాలనే నిర్ణయంపై తెలంగాణ ఉద్యమ నేత, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటలతో ఇటీవల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి కోదండరాం భేటీ అయ్యారు.
ఈటలకు తెలంగాణ సర్కార్ అన్యాయం చేసిందని, అవమానపరిచిందని నేతలిద్దరూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈటలకు సంఘీభావం తెలపామన్నారు. తాజాగా శనివారం మీడియాతో కోదండరాం మాట్లాడారు.
కేసీఆర్కు వ్యతిరేకంగా ఈటల అన్ని శక్తులను కలుపుకుని ముందుకెళ్లుతారని ఆశించామన్నారు. అయితే ఆ ఆశలను, నమ్మకాన్ని ఈటల నీరుగార్చారన్నారు. ప్రజాస్వామ్యం కోసం పోరాడే శక్తిగా ఈటల మారతారనుకుంటే, బీజేపీలో చేరుతున్నారన్నారు.
ఈటల ప్రత్యామ్నాయ శక్తిగా తయారవుతారని తెలంగాణ సమాజం చూసిందన్నారు. ఈటల బీజేపీలో చేరాలనే నిర్ణయంతో పోరాడాలనుకున్న వాళ్లంతా చల్లబడ్డారని కోదండరాం వాపోయారు.
కేసీఆర్పై పోరాటం చేస్తే తాను, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కలసివస్తామని ఈటలకు భరోసా ఇచ్చామన్నారు. అయితే కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీలో చేరాలన్న ఈటల నిర్ణయం ఆయన వ్యక్తిగతమన్నారు. దీనివల్ల బీజేపీకి తప్ప ఈటలకొచ్చే లాభం ఏదీ లేదన్నారు.