ఒకే ఫ్రేమ్ లో పవన్-రేణుదేశాయ్.. అయితే ఏంటి?

విడాకులు తీసుకుని విడివిడిగా ఉంటున్నారు భార్య, భర్త. ఆ తర్వాత భర్త మరో పెళ్లి చేసుకున్నాడు, ఆమెతో పిల్లల్ని కూడా కన్నాడు. కానీ మాజీ భార్య మాత్రం ఎంగేజ్ మెంట్ రింగ్ చూపించి అక్కడితో…

విడాకులు తీసుకుని విడివిడిగా ఉంటున్నారు భార్య, భర్త. ఆ తర్వాత భర్త మరో పెళ్లి చేసుకున్నాడు, ఆమెతో పిల్లల్ని కూడా కన్నాడు. కానీ మాజీ భార్య మాత్రం ఎంగేజ్ మెంట్ రింగ్ చూపించి అక్కడితో కథ ఆపేసింది. కొన్నాళ్ల తర్వాత పిల్లల కోసం ఆ మాజీ భార్య, మాజీ భర్త కలుసుకున్నారు. ఈ స్టోరీ ఎవరి గురించో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అవును, పవన్ – రేణు గురించే. తాజాగా ఓ సందర్భంలో వీళ్లిద్దరూ కలుసుకున్నారు.

అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో పవన్ ఫ్యాన్స్ మాత్రం చంకలు గుద్దుకోవడం విచిత్రం. గతంలో రేణుని ట్రోలింగ్ తో ఆటాడేసుకున్న సైనిక్స్, ఇప్పుడు పవన్ వెళ్లి ఆమెను పలకరించే సరికి ఎగిరెగిరి పడుతున్నారు. ఆ ఫొటోని తెగ ట్రెండ్ చేస్తున్నారు. అల్పసంతోషం అంటే ఇదేనేమో.

వారసుడంటే ఎవరికి చేదు..?

పవన్ కల్యాణ్ కొడుకు అకీరానందన్ ప్రస్తుతం తల్లి రేణుదేశాయ్ సంరక్షణలోనే ఉన్నా కూడా.. అతను కొణిదెల వారి వారసుడే. మెగా ఫ్యామిలీ మెంబరే. కుటుంబ కార్యక్రమాలకు కూడా అకీరా వస్తూ పోతూ ఉంటాడు. మరి కొడుకుని పలకరించకుండా పవన్ ఉండగలరా. అందులోనూ కొడుకు స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే కావడంతో పవన్ ఆ ఫంక్షన్ కి వెళ్లారు. అక్కడికి రేణూ కూడా వచ్చారు. పిల్లలతో కలసి ఓ గ్రూప్ ఫొటో తీసుకున్నారు.

ఈ సందర్భంగా పవన్ తన మాజీ భార్యతో మాట్లాడారో లేదో తెలియదు కానీ.. జనసైనికులు మాత్రం ఈ ఫొటోని తమ వాట్సప్ స్టేటస్ లో పెడుతూ.. రచ్చ రచ్చ చేస్తున్నారు. హైదరాబాద్ లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఈ ఫంక్షన్ జరిగింది.

అప్పుడు తిట్టింది వీళ్లేగా..?

గతంలో రేణు దేశాయ్ ఎంగేజ్ మెంట్ రింగ్ చూపిస్తే.. పవన్ అభిమానులు ఓ రేంజ్ లో ట్రోలింగ్ వేసుకున్నారు. ఆ దెబ్బకి ఆమె భయపడ్డారు కూడా. తనకు వచ్చే ఫోన్స్, మెసేజ్ లతో భయపడిపోయానని చెప్పారు రేణు. ఆ తర్వాత అసలు ఎంగేజ్ మెంట్, పెళ్లి విషయాన్ని కూడా ఆమె ఎక్కడా ప్రస్తావించలేదు. మళ్లీ ఇప్పుడు అదే అభిమానులు ఆమెకు పాజిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు. 

పవన్ వెళ్లి కలిసేసరికి రేణు దేశాయ్ ఉన్నా కూడా ఆ ఫొటోకి అంత క్రేజ్ వచ్చిందనమాట. సంతోషం వచ్చినా, బాధ వచ్చిన తట్టుకోలేరు పవన్ అభిమానులు. పవన్ తన మాజీ భార్యను కలవడాన్ని కూడా వారు సోషల్ మీడియా వేదికగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 

ఇక్కడ నీతి ఏంటంటే.. పవన్ పక్కన ఉన్నప్పుడు మాత్రమే ఆమె దేవత. పవన్ మరో పెళ్లి చేసుకున్నా.. ఆయన భార్య మాత్రం ఇంకో పెళ్లి చేసుకోకూడదు. గతంలో తన అభిమానులు చేసిన రచ్చకి ఇప్పుడైనా కనీసం పవన్.. రేణూకి సారీ చెప్పారో లేదో.