ఈ నెల 11న మధురవాడలో పెళ్లి పీటలపై కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన నవవధువు సాయి సృజన కేసు మిస్టరీ వీడింది. కొన్ని క్షణాల్లో మెడలో మూడు ముళ్లు వేయించుకోవాల్సిన శుభముహూర్తాన విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని విష పదార్థం తీసుకోవడం వల్లే సాయి సృజన మరణించినట్టు వైద్యులు నిర్ధారించడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఈ కేసుపై పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపారు. చివరికి కేసు మిస్టరీని ఛేదించారు. తన ప్రేమను బతికించుకునే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకుందనే చేదు వాస్తవం బయట పడింది.
ఫోన్‌లో డిలీట్ చేసిన సమాచారాన్ని కాల్ డయల్ రికార్డర్ (సీడీఆర్) సాయంతో పోలీసులు తిరిగి సంపాదించారు. దీంతో కేసు మిస్టరీని ఛేదించడం సులువైంది. ప్రేమికుడితో కాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేకనే బలవన్మరణానికి పాల్పడినట్టు తేలింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
బంధువుల ఇంట్లో ఉంటూ పరవాడ మండలం దేశపాత్రునిపాలెంలోని విజ్ఞాన్ కాలేజీలో 2015లో సాయి సృజన ఇంటర్‌లో చేరింది. అదే కళాశాల విద్యార్థి తోకాడ మోహన్(24)తో సృజనకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమకు దారి తీసింది. ఇంటర్ అనంతరం హైదరాబాద్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ప్రేమ మాత్రం కొనసాగుతోంది. 2021లో ప్రియుడు మోహన్ హైదరాబాద్ వెళ్లాడు. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగింది. పెళ్లి చేసుకుందామని సృజన ప్రతిపాదించింది. అయితే మంచి ఉద్యోగం వచ్చే వరకు మరికొంత కాలం వేచి చూద్దామని మోహన్ కోరాడు.
మరోవైపు ఇంకో వ్యక్తితో సాయి సృజనకు తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చారు. పెళ్లిని రద్దు చేసుకునేందుకు చివరి వరకూ సాయిసృజన ప్రయత్నిస్తూనే ఉంది. ఈ నెల 11న విశాఖ నగరశివారులోని మధురవాడలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. సరిగ్గా పెళ్లికి మూడు రోజుల ముందు మోహన్‌తో ఇన్‌స్టాలో సృజన చాటింగ్ చేసింది. పెళ్లి ఇష్టం లేదని, ఎలాగైనా తనను తీసుకెళ్లాలని ప్రాథేయపడింది.
అప్పుడు కూడా ప్రియుడు ధైర్యం చేయలేకపోయాడు. ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోలేనని పాత పాటే పాడాడు. పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది కుర్రోమొర్రో అని సృజన చెప్పినా, ప్రియుడు తన ప్రేమను కాపాడుకునేందుకు ముందుకు రాలేకపోయాడు. మరికొన్నాళ్లు వేచి చూడాలని సృజనను అతను కోరాడు. దీంతో ప్రేమించిన వాడితో కాకుండా మరో వ్యక్తితో జీవితాన్ని ఊహించుకోలేకపోయింది. దీనికంటే చావే మేలని గట్టి నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా పెళ్లి ఆపుతానని ప్రియుడితో అన్న మాటను చావు రూపంలో సృజన నిలబెట్టుకుంది.
ప్రియుడితో చాటింగ్‌ను సెల్‌ఫోన్ నుంచి సృజన తొలగించింది. పెళ్లి ఆపాలన్న ఉద్దేశంతో ఈ నెల 10న ఆస్పత్రిలో చేరింది. వైద్యులు ట్రీట్‌మెంట్ ఇచ్చి ఇంటికి పంపారు. మరుసటి రోజు విషపదార్థాన్ని ఎక్కువ తీసుకోవడంతో ప్రాణాల మీదకొచ్చింది. ప్రేమను బతికించుకునే పోరాటంలో ఆమె ప్రాణాలు విడిచింది. ప్రేమికుడు ఏ మాత్రం ధైర్యం చేసినా, సృజన బతికి వుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.