సొంత పార్టీ వ్యక్తుల తప్పుల విషయంలో వైసీపీ భిన్నంగా వ్యవహరిస్తోంది. చివరికి సొంత కుటుంబ సభ్యుడు కాంట్రాక్టర్‌పై బెదిరింపులకు దిగితే, వెంటనే కఠిన చర్యలు తీసుకున్న వైసీపీ, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ విషయానికి వచ్చే సరికి నాన్చివేత ధోరణి ప్రదర్శించడం విమర్శలకు తావిస్తోంది.
పులివెందుల నియోజకవర్గంలో రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేయడానికి వైఎస్ కొండారెడ్డి బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ విషయమై సీఎం జగన్ దృష్టికి ఫిర్యాదు వెళ్లగానే సీరియస్‌గా స్పందించారు. వరుసకు అన్న అయ్యే వైఎస్ కొండారెడ్డిని అరెస్ట్ చేయించి, తన పేరు చెప్పుకుని అక్రమాలకు పాల్పడాలని చూస్తే కఠిన చర్యలు తప్పవనే హెచ్చరిక పంపారు. అరెస్ట్‌తో ఆగలేదు. ఏకంగా జిల్లా బహిష్కరణకు ఆదేశించారు. వైఎస్ కొండారెడ్డి విషయంలో కఠినంగా వ్యవహరించిన వైసీపీ ప్రభుత్వం, మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకు పాల్పడిన ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌పై చర్యలు తీసుకోవడంలో మాత్రం తటపటాయిస్తున్నట్టు కనిపిస్తోంది.
తన (మాజీ) డ్రైవర్ సుబ్రమణ్యాన్ని తానే హత్య చేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అంగీకరించారు. నేరాన్ని తనే ఒప్పుకున్నప్పుడు, అలాంటి నేతను వెనకేసుకొస్తున్నారనే అపప్రదను మూటకట్టుకోడానికి ప్రభుత్వం, పార్టీ సిద్ధంగా ఎందుకున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. హత్యోదంతంతో అనంత ఉదయభాస్కర్‌కు సంబంధించి అనేక అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. రంగురాళ్ల వ్యాపారం, అక్రమ కలప రవాణా, మట్టి తవ్వకాలు, ఇసుక దోపిడీ తదితర అసాంఘిక పనులన్నీ అనంత ఉదయభాస్కర్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు వార్తలొచ్చాయి.
హత్య కేసులో అరెస్ట్ అనేది సాంకేతిక అంశమే. కానీ ఇతరత్రా ఆరోపణలపై ఆయనపై పార్టీ, ప్రభుత్వ పరంగా చర్యలేంటి? వైఎస్ కొండారెడ్డిఫై ఫిర్యాదు వచ్చిన గంటల్లోనే కఠిన చర్యలు తీసుకున్నారు కదా. మరి అనంత ఉదయభాస్కర్ విషయంలో అలాంటి చర్యలు ఏమయ్యాయ్? ఈ ప్రశ్నకు సమాధానం లేదా? ఇలాంటి అక్రమార్కుడి గురించి పార్టీ, ప్రభుత్వం బద్నాం కావడానికి సిద్ధంగా ఉందా? ఏమిటీ వైపరీత్యం?
సొదుం రమణ