ఆర్జీవీ తాజా సంచలనం లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా విడుదల మార్చి 22న అని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. కానీ అలా ప్రకటించకముందు మార్చి 15 అని వినిపించింది. అయితే లేటెస్ట్ గా మళ్లీ ఈ మార్చి 15నే విడుదల చేయాలనే డిస్కషన్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.
సినిమా అమ్మకం పూర్తయిపోయింది. లాంఛనంగా ప్రకటించడమే తరువాయి. ఈ సోమవారం నాడు ఆర్జీవీ ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం వుంది. అయితే ఈలోగా డేట్ మీద కూడా పునరాలోచించమని ఆర్జీవీకి పలువురి నుంచి సూచనలు సలహాలు అందుతున్నట్లు తెలుస్తోంది.
మార్చినెల పది నుంచే ఎన్నికల వేడి భీకరంగా అందుకుంటుందని, అందువల్ల 15న విడుదల చేస్తే రెవెన్యూ బాగుంటుందని, 22 కన్నా 15 అయితే రెవెన్యూలో చాలా తేడా వుంటుందని లెక్కలుకట్టి మరీ ఆర్జీవీకి వివరిస్తున్నారట.
ఈవిషయంలో ఆర్జీవీ ఈరోజో, రేపో ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. ఇదిలావుంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ కు దాదాపు 10 కోట్ల ఖర్చు అయినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆర్జీవీ సినిమాలకు ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేయడం అన్నది అరుదు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు మాత్రం పదికోట్లకు పైగానే ఖర్చు అయినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా వరల్డ్ థియేటర్ రైట్స్ కు 8 కోట్లు రికవరీ వచ్చేసింది. మిగిలినది శాటిలైట్, డిజిటల్ వంటి వాటితో పూడ్చుకోవాల్సి వుంటుంది.