అభిమాని త‌ప్పు… జూహీకి రూ.20 ల‌క్ష‌ల జరిమానా

ఏదో చేయాల‌ని కోర్టును ఆశ్ర‌యిస్తే, మ‌రేదో అయ్యింది. రూ.20 ల‌క్ష‌ల జ‌రిమానా చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి జూహీచావ్లాకు ఢిల్లీ హైకోర్టు సినిమా చూపించింది. బ‌హుశా అన‌వ‌స‌రంగా త‌ల‌దూర్చి…

ఏదో చేయాల‌ని కోర్టును ఆశ్ర‌యిస్తే, మ‌రేదో అయ్యింది. రూ.20 ల‌క్ష‌ల జ‌రిమానా చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి జూహీచావ్లాకు ఢిల్లీ హైకోర్టు సినిమా చూపించింది. బ‌హుశా అన‌వ‌స‌రంగా త‌ల‌దూర్చి త‌ల‌పోటు తెచ్చుకున్నాన‌నే భావ‌న ఇప్పుడామెలో క‌లిగి ఉంటుంది. కానీ జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయిన త‌ర్వాత చింతిస్తే ఏం లాభం?

5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ సీనియర్ నటి జూహీచావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగ‌తి తెలిసిందే. కాగా, 5జీ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయని, పౌరులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వం ధ్రువీకరించే వరకూ 5జీని ఆపాలని కోరుతూ జూహీచావ్లాతో సహా మరో ఇద్దరు పిటిషనర్లు ఢిల్లీ  హైకోర్టును ఆశ్రయించారు. 

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి దాఖ‌లు చేసిన వ్యాజ్యం కావ‌డంతో దేశ‌వ్యాప్త దృష్టిని ఆక‌ర్షించింది. ఈ పిటిష‌న్ల‌పై శుక్రవారం ఢిల్లీ హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసమే అని, ఆమె పిటిషన్ను కొట్టేయాలని కేంద్రం ఢిల్లీ హైకోర్టును కోరింది.

ఈ నేప‌థ్యంలో 5జీ టెక్నాలజీ వద్దన్న జూహీ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ కావాల్సిందేనని తేల్చి చెప్పింది. వ్యాజ్యం వేయ‌డానికి ముందు సందేహాల‌ను వ్య‌క్త‌ప‌రుస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి బాగుండేద‌ని హైకోర్టు అభిప్రాయ ప‌డింది. పిటిషన్లో బలం లేదని, అనవసరంగా దాఖలు చేశారని కోర్టు సీరియ‌స్ కామెంట్స్ చేసింది.

ఇదిలా ఉండ‌గా  కోర్టులో ఓ ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. వాదనలు జరుగుతున్నప్పుడు జూహీచావ్లా అభిమాని సినిమా పాటలు వినిపించ‌డం, ప్రొసీడింగ్స్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయ‌డంపై ఢిల్లీ హైకోర్టు సీనియ‌ర్ న‌టిపై సీరియస్‌ అయింది. రూ.20లక్షల జ‌రిమానా విధించింది. దీంతో జూహీ కంగుతింది. మొత్తానికి అభిమాని చేసిన త‌ప్పున‌కు జూహీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది.