పార్టీ పరిస్థితి బాగోలేదంటే.. పార్టీలో నాయకత్వం బాగోలేదనే అర్థం. కేవలం అధినాయకుడే కాదు, ఆయనతో కలసి పనిచేసే నాయకగణం కూడా అంతంతమాత్రంగానే ఉందని అర్థం. ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇదే. అవును, వృద్ధనేతల పునరావాస శిబిరంగా మారింది టీడీపీ.
చంద్రబాబుతో పాటు కెరీర్ మొదలు పెట్టినవారు, ఆయనతో కలసి రాజకీయాలు చేసినవారే పార్టీలో కీలక పదవుల్లో ఉన్నారు. ఈ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలంతా గత వైభవాలు చెప్పుకోడానికే కానీ, ప్రస్తుతం పార్టీ పరిస్థితి బాగయ్యేందుకు వ్యూహాలు పన్నడంలో వెనకబడిపోతున్నారు.
యనమల, సోమిరెడ్డి, కళా.. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ తలపండినవారే. ఈ సీనియర్లతోనే ఇప్పుడు సమస్యంతా. కొత్త జనరేషన్ రాజకీయాలు చేయలేక, అటు పాత పద్ధతులు ఫలించక ఇబ్బంది పడుతున్నారు, పార్టీని ఇబ్బంది పెడుతున్నారు.
రిటైర్మెంట్ వయసు దగ్గర్లో ఉన్న టీడీపీ బ్యాచ్ కొత్త జనరేషన్ తో పోటీపడలేకపోతోంది. పోనీ టీడీపీలో యువత లేదా అంటే లేదని చెప్పలేం. టీడీపీలో యువనాయకులున్నా వారికి ప్రోత్సాహం లేదు. ఎవరిని ప్రోత్సహించినా కొడుకు లోకేష్ కి పోటీ వస్తారనేది బాబు భయం. ఆమధ్య రామ్మోహన్ నాయుడు లాంటి వారు కాస్త హడావిడి చేసినా బాబు భయపెట్టి పక్కనపెట్టారు. సో.. లోకేష్ మినహా ఎవరు ఆవేశపడ్డా అదే పరిస్థితి అని అందరికీ అర్థమైంది. అందుకే ఎవరూ ముందుకు రావడంలేదు.
పోనీ లోకేష్ బయటకు వచ్చినా, ఆయన చుట్టూ యువనాయకత్వం ఉంటుందనికుంటే పొరపాటే. సీనియర్ బ్యాచ్ ని చుట్టూ తిప్పుకుంటూ.. ''బాబుగారూ బాబుగారూ'' అని అంటుంటే పొంగిపోతూ.. లోకేష్ కాలం గడిపేస్తున్నారు. తనకంటే చురుకైనవారు, యాక్టివ్ గా ఉండేవారిని లోకేష్ ఎప్పుడూ తన కోటరీలోకి రానీయరు. అటు సీనియర్ నాయకులు కూడా వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు వెనకాడుతున్నారు. చంద్రబాబు కూడా అదే పాతబ్యాచ్ ని మెయింటెన్ చేస్తున్నారు. అందుకే వారు కాలం చెల్లిన ఫార్ములాలకి సై అంటున్నారు, బాబుకి వంతపాడుతున్నారు.
ఇటు వైసీపీ నవయవ్వనంతో తొణికిసలాడుతోంది. కేబినెట్ లో యువతకు పెద్దపీట వేశారు జగన్. బొత్స, ధర్మాన వంటివారికి ప్రయారిటీ ఇస్తూనే, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వంటి వారిని తన వెంటే ఉంచుకుంటూ.. యువతను ప్రోత్సహించారు. జగన్ తో సహా అందరూ యంగ్ స్టర్సే కాబట్టి.. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు కూడా కొత్తతరం రాజకీయాలకు అనుగుణంగా ఉంటున్నాయి.
టీడీపీలో అలాంటి పరిస్థితి లేదు. కావాలనే యువతను పక్కనపెట్టారు, వృద్ధ బ్యాచ్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకరకంగా కొడుకుపై ఉన్న ప్రేమతో చంద్రబాబు పార్టీని చంపేస్తున్నారు. అందుకే చరిత్రలో ఎప్పుడూ ఎరగని ఘోర పరాభవాన్ని టీడీపీ మూటగట్టుకుంది.