తనను ప్రేమించలేదని, పైపెచ్చు జైలుకు కూడా పంపించిందనే కోపంతో ఓ వ్యక్తి, తను ప్రేమించిన అమ్మాయిని కిరాతకంగా హత్య చేశాడు. ఇదే ఘటనలో అతడు కూడా చనిపోయాడు. చిత్తూరు జిల్లాలో జరిగింది ఈ దారుణం.
జిల్లాలోని సాంబయ్యకండ్రిగలో ఉంటున్న 22 ఏళ్ల సుశ్మిత, స్టాఫ్ నర్స్ గా పనిచేస్తోంది. ఈమె ఇంటి వెనక ఉండే 24 ఏళ్ల చిన్నా సుశ్మితను ప్రేమించాడు. లవ్ చేయమంటూ వెంటపడ్డాడు. చిన్నా వేధింపులు భరించలేక సుశ్మిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో చిన్నా కొన్నాళ్లు జైళ్లో ఉండి వచ్చాడు.
దీంతో సుశ్మితపై కోపం పెంచుకున్నాడు చిన్నా. సరైన సమయం కోసం వేచి చూశాడు. ఆ టైమ్ రానే వచ్చింది. ఎప్పట్లానే డ్యూటీ చేసుకొని ఇంటికొచ్చింది సుశ్మిత. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఈ విషయం తెలుసుకున్న చిన్నా, కత్తితో ఇంట్లోకి ప్రవేశించాడు. సుశ్మితను హత్య చేశాడు.
ఆ తర్వాత తను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ చనిపోలేదు, అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అప్పుడే ఇంటికి వచ్చిన సుశ్మిత తమ్ముడు సునీల్, జరిగిన ఘటన చూసి చలించిపోయాడు. అక్కను చంపిన చిన్నాపై పెద్ద రాయితో దాడిచేశాడు. ఆ దాడిలో చిన్నా అక్కడికక్కడే మృతి చెందాడు.