అయిననూ వచ్చి పోవలె కరోనా..!

విదేశీ ప్రయాణాల్లో పాస్ పోర్ట్, వీసా కంటే ఎక్కువగా.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కే ప్రాధాన్యం ఇస్తున్న రోజులివి. అయితే వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా అనే విషయం కంటే, అసలు కరోనా వచ్చిందా లేదా అనే…

విదేశీ ప్రయాణాల్లో పాస్ పోర్ట్, వీసా కంటే ఎక్కువగా.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కే ప్రాధాన్యం ఇస్తున్న రోజులివి. అయితే వ్యాక్సిన్ వేసుకున్నారా లేదా అనే విషయం కంటే, అసలు కరోనా వచ్చిందా లేదా అనే విషయమే రాబోయే రోజుల్లో హైలెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

అవును, వ్యాక్సిన్ వేయించుకున్నవారి కంటే, కరోనా నుంచి కోలుకున్నవారే అదృష్టవంతులు. ఇప్పటికే పలు పరిశోధనలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. తాజాగా బ్రిటన్ లో సాగిన ఓ అధ్యయనం కరోనా విజేతల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. దాదాపు ఏడాది పాటు విజేతల జోలికి వైరస్ రాలేదని తేల్చి చెప్పింది.

ఫస్ట్ సీజన్ లో కరోనా బారినపడనివారు.. రెండో వేవ్ వస్తుందని చెప్పినా పెద్దగా పట్టించుకోలేదు. ఫస్ట్ టైమ్ తప్పించుకున్నాం, రెండోసారి మమ్మల్నేం చేస్తుందని ధీమాగా ఉన్నారు. అలాంటివారంతా సెకండ్ వేవ్ ధాటికి అల్లాడిపోయారు. ఫస్ట్ వేవ్ లో కరోనాబారిన పడి కోలుకున్న కుటుంబాలు రెండోసారి దాని ప్రభావానికి దూరంగా ఉన్నాయి. ఒకరకంగా వారిది ముందు జాగ్రత్త అనుకున్నా.. వారిలో పెరిగిన యాంటీబాడీల ప్రభావం వల్లే కరోనా రెండోసారి సోకలేదనేది సైన్స్ చెప్పే నిజం.

యూనివర్శిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. మొత్తం 2111మందిపై వీరు పరిశోధన సాగించారు. వీరిలో వైద్యులు, సాధారణ ప్రజలు ఉన్నారు. వైరస్ ని జయించినవారు 634మంది కూడా వీరిలో ఉన్నారు. అందరూ రోజువారి పనులు చేసుకుంటూ కొవిడ్ జాగ్రత్తలు తీసుకునేలా చూశారు.

చివరిగా తేలిందేంటంటే.. కరోనాని ఒకసారి జయించినవారిలో కేవలం 14మందికే అది రెండోసారి అటాక్ అయింది. అసలు కరోనాకు గురికాకుండా ఉన్నవారిలో 204మంది పరిశోధన సమయంలో వైరస్ బారినపడ్డారు. మొత్తమ్మీద కరోనా విజేతలు రీ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు 85శాతం అవకాశాలున్నాయని తేల్చింది ఈ పరిశోధన.

కరోనా వ్యాక్సిన్ వేయించుకుని, తమలో యాంటీబాడీస్ పెరగలేదని ఇటీవల ఓ వ్యక్తి సదరు కంపెనీపై కోర్టుకెక్కిన ఉదాహరణ చూశాం. వ్యాక్సిన్ తో యాంటీబాడీస్ పెరగడంలేదనే విషయాన్ని పలువురు వైద్యులు కూడా నిర్థారిస్తున్నారు. అదే సమయంలో వైరస్ సోకి కోలుకున్నవారిలో మాత్రం యాంటీబాడీస్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. 10నెలల నుంచి ఏడాది పాటు ఈ యాంటీబాడీస్ శరీరంలోనే ఉంటాయని యూసీఎల్ పరిశోధన చెబుతోంది. కొంతమందిలో ఏడాది కంటే ఎక్కువగా కూడా ఉంటాయని అంటున్నారు.

అంటే కరోనా రానివారు అది ఎప్పుడొస్తుందా అని బిక్కుబిక్కుమంటుంటే.. ఒకసారి వచ్చిపోతే మాత్రం ఏడాదిపాటు అలాంటి భయాలేవీ లేకుండా బతికేయొచ్చనమాట.