లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను అడ్డుకోడానికి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బాబు గేమ్ ప్లాన్ లో మొదటి ఆప్షన్ సెన్సార్ బోర్డ్. సెన్సార్ దగ్గరే వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు అడ్డుగోడ కట్టేయాలని చూస్తున్నారు బాబు. తెలుగుదేశం పార్టీపేరు, పార్టీ సింబల్ వాడటంపై అభ్యంతరం తెలపాలనుకుంటున్నారు. తమ పేర్లు పెట్టి, తమ పార్టీ గుర్తు చూపిస్తూ, తమను కించపరిచే సన్నివేశాలుంటే వాటిని తొలగించాలనే డిమాండ్ తో మొత్తం సినిమానే అడ్డుకోవాలనే పన్నాగం పన్నారు.
అందుకే వర్మ ముందు జాగ్రత్తగా మొత్తం విషయాన్నే మార్చేసుకున్నారని సమాచారం. గతంలో రక్తచరిత్ర సమయంలో కూడా సెన్సార్ కత్తెర నుంచి తప్పించుకోడానికి ఊరి పేర్లతో సహా మొత్తం పాత్రల పేర్లనే మార్చేశారు రామ్ గోపాల్ వర్మ. అసలైన పాత్రలు గుర్తుకొచ్చేలా, కాస్త దగ్గరగా పోలిన పేర్లను పెట్టి కవర్ చేశారు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే జరుగుతోంది.
ముఖ్యంగా టీడీపీ గుర్తు సైకిల్ ని రిక్షాలా మార్చి చూపిస్తున్నారు వర్మ. తెలుగుదేశం పార్టీకి కూడా కొనసాగింపుగా కొత్త పదాన్ని జతచేస్తున్నారు. తాజాగా విడుదలైన వర్కింగ్ స్టిల్స్ లో రిక్షా గుర్తు బైటపెట్టి అందర్నీ షాక్ కి గురిచేశారు వర్మ. ఎన్టీఆర్ పాత్రధారి పార్టీ పెట్టి రిక్షా గుర్తుపై పోటీచేసి ఏడాది తిరిగేలోగా అధికారంలోకి వచ్చినట్టు చూపిస్తారన్నమాట.
ఇక ఎన్టీఆర్ సహా.. సినిమాలో మిగతా పాత్రల పేర్లన్నీ మారిపోతాయి. వెన్నుపోటు బాబుతో సహా.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు కూడా మార్చేస్తారు. లక్ష్మీపార్వతి అభ్యంతరం చెప్పరు కాబట్టి అక్కడ లిబర్టీ తీసుకున్నారు. మొత్తానికి చంద్రబాబు అండ్ బ్యాచ్ ని చాలా తెలివిగా ఏమార్చి, ఉన్నది ఉన్నట్టు చూపించడానికి సర్వం సిద్ధంచేశాడు రామ్ గోపాల్ వర్మ.
సెన్సార్ కత్తెర నుంచి తప్పించుకోడానికి తన స్టైల్ లో సెటప్ మొత్తం సెట్ చేసి పెట్టుకున్నారు. ఎవరైనా విమర్శలు చేసినా, న్యాయపోరాటానికి దిగినా.. గుమ్మడికాయల దొంగల్లా భుజాలు తడుముకుంటారెందుకని అనేసి వారి ఇమేజ్ ని మరింత డ్యామేజీ చేయాలని కంకణం కట్టుకున్నారు వర్మ.