ప్రపంచం సంగతి సరే, దేశం సంగతి సరే, తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే, ఇప్పుడు అందరి మదిలో ఇదే ప్రశ్న. కరోనా కల్లోలం కారణంగా వచ్చిన లాక్ డౌన్ అన్నది ఎన్నాళ్లు వుంటుంది. ఒక రోజు ట్రయిల్ రన్ అయింది. నెలాఖరు వరకు వుంటుంది కొన్ని జిల్లాల్లో అనుకున్నది దేశం అంతా ఏప్రియల్ నడిమి వరకు అని ఫిక్స్ అయింది. అయితే అక్కడితో ఆగుతుందా? ఇంకా ముందుకు వెళుతుందా అన్నది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. దీనికి ఎవరికి వారు రకరకాల సమాధానాలు చెబుతున్నారు. చెప్పుకుంటున్నారు. ఎవరి లాజిక్ లు వారికి వున్నాయి. ఎవరి రీజన్స్ వారివి.
కానీ అందరూ మాత్రం ఓ పాయింట్ దగ్గర ఏకీభవిస్తున్నారు. ఇది ఇప్పటితో అంటే ఏప్రియల్ 14తో ఆగేది కాదు అని అంటున్నారు. పాండిచ్చేరి వైద్య ఆరోగ్య మంత్రి ఈ రోజు ఈ విషయమే అన్నారు. లాక్ డౌన్ అన్నది ఇంకా పొడిగిస్తారు అని. అలాగే రిజర్వ్ బ్యాంక్ మూడు నెలలు ఇఎమ్ఐ లు వాయిదా వేసింది. ఇది ఇప్పట్లో తెమిలేది అయితే ఒక్క నెల వాయిదా వేస్తే సరిపోతుంది. రెండు నెలలు వాయిదా వేస్తే సరిపోతుంది. ఏప్రియల్, మే, జూన్ నెలలు వాయిదా వేసింది.
ఇక ఇప్పుడు ఈలాక్ డౌన్ అన్నది ఇండియాలో వున్న జనాభాలో ఎవరికి ఈ వ్యాధి సోకింది అన్నది తెలుసుకోవడానికి మాత్రమే పనికివస్తుంది. ఎవరికి వాళ్లు ఇళ్లలో వుంటే, ఈ వ్యాధి సోకిన వారు, అది తీవ్రమైతే బయటకు రాక తప్పదు. అలాగే వారి నుంచి ఆ వ్యాధి మరెవరికి పాకకుండా, సోకకుండా వుంటుంది. ఇదీ ప్రభుత్వాల ఆలోచన. కానీ ఇక్కడ ఓ సమస్య వుంది. వ్యాధి సోకిన వారి నుంచి చివరి రోజున ఏ విధంగా ఇది పాకినా, లేదా ఇప్పటికే వ్యాధి సోకిన వారి నుంచి రకరకాల మార్గాల ద్వారా వేరే వారికి చేరి వున్నా, ఇవన్నీ బయటకు రావడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది.
పైగా మన దగ్గర టెస్టింగ్ అంతా ఫాస్ట్ గా జరగడం లేదు. కోట్ల జనాభా వుంది మన దగ్గర. ఆంధ్రలో విదేశాల నుంచి వచ్చిన వారే 20 వేల మంది వరకు వున్నారు. కానీ వీరంతా అబ్జర్వేషన్ లో మాత్రమే వున్నారు. అందరికీ పరిక్షలు జరగడం లేదు. ఈ మహమ్మారి కరోనా ఎప్పుడు ఎలా బయటకు వస్తుంది అన్నది పూర్తిగా క్లారిటీ లేదు.
లోపాయికారీగా వినవస్తున్న సమాచారం ఏమిటంటే, నిబంధనలు కట్టుదిట్టంగా వుంటాయో, సడలిస్తారో తెలియదు కానీ, మళ్లీ పూర్తి నార్మల్ లైఫ్ రావడానికి మాత్రం కనీసం రెండు మూడు నెలలు పడుతుందని వినిపిస్తోంది. రైళ్లు నడవాలి. విమానాలు నడవాలి. రాష్ట్రాల మధ్య రాకపోకలు మొదలు కావాలి. ఇవి కీలకం. కానీ ఇవన్నీ ఇప్పుడప్పుడే సాధ్యమవుతాయా? అన్న దానికి మాత్రం అంత సులువుగా సమాధానం దొరికేలా లేదు.
ఏప్రియల్ 1 నుంచి లాక్ డౌన్ నిబంధనలు మరింత కట్టుదిట్టం అవుతాయని, సడలింపు వేళలు తగ్గుతాయని వినిపిస్తోంది. బయటకు వచ్చే వాహనాలను ఏడాది పాటు సీజ్ చేయడం, విపరీతంగా ఫైన్ విధించడం లాంటివి వుంటాయని వార్తలు వినవస్తున్నాయి. మరో పక్క ఐసోలేషన్ వార్డుల కోసం భారీగా కసరత్తు చేస్తున్నారు. వేలాది ఐసోలేషన్ వార్డులు తెలుగు రాష్ట్రాల్లో రెడీ అవుతున్నాయి. దాదాపు 20 వేల పడకలు రెడీ చేస్తున్నారు. ఒక విధంగా యుద్ద ప్రాతిపదికన రాబోయే గడ్డు పరిస్థితిని ఊహించి రెడీ చేస్తున్నారు. ఏ సమస్య రాకుంటే ఏ గొడవా లేదు. వస్తే తట్టకోవాలనే ఈ ఏర్పాట్లు.
ప్రభుత్వాలు ఇలా ముందు చూపుతో ఆలోచిస్తున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు. సమస్య తీవ్రతను ఏ రేంజ్ లో అంచనా వేస్తున్నాయో. ఆ రేంజ్ లో సమస్య కమ్ముకు వస్తే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో నార్మల్ లైఫ్ రావడానికి కనీసం రెండు మూడు నెలలు పడుతుందేమో?