ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తాను టీడీపీ అనుబంధ నాయకురాలనే విశ్వాసాన్ని కలిగించేందుకు పరితపిస్తున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. ఏపీ బీజేపీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తన తండ్రి స్థాపించిన టీడీపీ కోసం మాత్రమే పని చేస్తున్నారనే అభిప్రాయాన్ని ఆమె కలిగిస్తున్నారు. టీడీపీపై చిన్న విమర్శ కూడా చేయకుండా తన పార్టీ శ్రేణులకి ఆ పార్టీ బీజేపీ అనుకూలమనే సంకేతాలు పంపుతున్నారు.
ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా టీటీడీ నూతన చైర్మన్ నియామకంపై పురందేశ్వరి పరోక్ష విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏదో చెప్పాలని మనసులో బలమైన కోరిక ఉన్నప్పటికీ, చెప్పడానికి ధైర్యం చాలడం లేదని ఆమె ట్వీట్ చదివితే ఎవరికైనా అర్థమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకూ ఆమె ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.
“తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ అన్నది రాజకీయ పునరావాస పదవి కారాదు. హిందూ ధర్మం పై నమ్మకమున్నవాళ్లే ఈ పదవికి న్యాయం చేయగలరు. ఇంతకు ముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేయడం జరిగింది. ఈ విషయం పై గళం విప్పిన తరువాత 52 మంది నియామకం నిలిపి వేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తున్నదని అర్ధమవుతున్నది. కనుక టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మం పై నమ్మకమున్న వారిని మరియు హిందూ ధర్మం అనుసరించే వాళ్ళని నియమించాలి”
ఈ ట్వీట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో పురందేశ్వరికి చీవాట్లు పెడుతున్నారు. ముందుగా బీజేపీకి నమ్మకమైన లీడర్స్‌ను అధ్యక్షులుగా నియమించాలని పురందేశ్వరి ట్వీట్ సంకేతం ఇస్తోందని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు. తానేం చెప్పదలుచుకున్నారో, బయటికి ప్రకటించడానికి ధైర్యం చాలనప్పుడు, ఆ విషయం గురించి మౌనం పాటించడం ఉత్తమమని తెలుసుకోవాలని నెటిజన్లు హితవు చెప్పారు.
అలాగే టీటీడీ నూతన చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి నియామకం సరైంది కాదని తాను నమ్ముతున్నప్పుడు, బహిరంగంగా విమర్శించడానికి పురందేశ్వరికి వచ్చిన ఇబ్బంది ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. భూమన హిందుత్వం గురించి నేరుగా శంకించడానికి మనస్సాక్షి అంగీకరించలేదంటే, తాను తప్పుడు ట్వీట్ చేస్తున్నానన్న అపరాధ భావన పురందేశ్వరిని వెంటాడుతున్నట్టు కనిపిస్తోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. టీడీపీకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో పురందేశ్వరి ట్వీట్ చేసిందే తప్ప, తన పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ట్వీటాడలేదనే విషయం అర్థమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారమే లక్ష్యంగా పార్టీలు మారే పురందేశ్వరి కూడా నమ్మకాలు, ధర్మాల గురించి మాట్లాడుతుంటే, వినాల్సిన ఖర్మ ఆంధ్రా ప్రజానీకానికి పట్టిందని నెటిజన్లు చీవాట్లు పెట్టడం గమనార్హం. 2019లో తన భర్త, కుమారుడు వైసీపీలో ఉంటే, తాను మాత్రం బీజేపీలో ఎందుకు కొనసాగారో చెప్పాలని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ పార్టీలంటే తమ పునరావాస కేంద్రాలని పురందేశ్వరి భావిస్తున్నారని ఆమె పొలిటికల్ జంపింగ్‌లే నిదర్శనమని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఏ వ్యవస్థలకైనా నమ్మకమైన నాయకత్వం అవసరమని, తమ పార్టీకి పురందేశ్వరి ఎంత వరకూ విశ్వసనీయత ఉన్న లీడరో గుర్తించాలని బీజేపీకి నెటిజన్లు సూచిస్తున్నారు.