జగన్ సర్కార్ ఏడాదిలోనే కూలిపోయేదా…?

ఏపీలో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ మీద ఆదిలో ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేవా. జగన్ ప్రభుత్వం ఏడాది వ్యవధిలోనే పడిపోతుంది అనుకున్నారా. అలా ఆశించారా. ఇవన్నీ ప్రశ్నలు. వీటికి జవాబు జగన్…

ఏపీలో మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ మీద ఆదిలో ఎవరికీ పెద్దగా నమ్మకాలు లేవా. జగన్ ప్రభుత్వం ఏడాది వ్యవధిలోనే పడిపోతుంది అనుకున్నారా. అలా ఆశించారా. ఇవన్నీ ప్రశ్నలు. వీటికి జవాబు జగన్ క్యాబినేట్ లో సీనియర్ మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు చెప్పుకొచ్చారు.

వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఏడాది కంటే పాలన చేయలేదు అని చాలా మంది అనుకున్నారని, కలగన్నారని, కానీ అలాంటి వారి దురాశలను వమ్ము చేస్తూ మూడేళ్ళుగా విజయవంతంగా జగన్ పాలన సాగించారని, ఎక్కడా తగ్గకుండా అప్రతిహతంగా తన పాలనను సాగిస్తూ ప్రత్యర్ధులకు చుక్కలు చూపించారని అన్నారు.

అంతే కాదు వైసీపీ ప్రభుత్వంలో బంధుప్రీతికి స్థానం లేదని, శ్రేయోభిలాషులకు, దగ్గర‌వారికి దోచిపెట్టడానికి తమ ప్రభుత్వం ఏర్పడలేదని కూడా ప్రత్యర్ధులకు చురకలు అంటించారు. రాజ్యాంగబద్ధమైన పాలన చేస్తూ పేదలను పెద్దలను చేయాలన్న అకుంఠిత దీక్షతో జగన్ నిరంతరం పరితపిస్తున్నారు అని ధర్మాన చెప్పడం విశేషం.

పేదలకు సంక్షేమ పధకాలు ఇస్తే మీకు ఎందుకు మంట అని విపక్షాలను నిలదీశారు. పేదవారు ఎపుడూ అక్కడే ఉండిపోవాలా వారికి ఆర్ధికంగా చేయూత ఇవ్వకూడదా అని ఆయన ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలోని సంపన్న వర్గాలు కొన్నాళ్ళు ఓపిక పట్టాలని కూడా ధర్మాన సూచించడం విశేషం.

పేదలను, బడుగులను ముందు వరసలోకి తెచ్చి సమసమాజ నిర్మాణం చేయడానికి జగన్ కంకణం కట్టుకున్న వేళ ఎవరు అడ్డుకున్నా ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరించారు. ఇక విపక్షాలు సంక్షేమ పధకాల మీద విమర్శలు చేస్తున్నాయి, వాటిని పేదలకు ఇవ్వకూడదని వారు తన రాజకీయ విధానంగా చెప్పగలరా అని ధర్మాన సూటి ప్రశ్నను వేశారు.

ఇవన్నీ ఎలా ఉన్నా జగన్ ఏడాది కంటే ఎక్కువ కాలం పాలన చేయలేడు అని భావించింది ఎవరు, వైసీపీ సర్కార్ కూలిపోవాలని కోరుకున్నదెవరు అన్నదే ఇపుడు ఆలోచించాల్సిన విషయం. జగన్ కి మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం లేకపోవడంతో ఆయన సర్కార్ నడపలేడని ప్రత్యర్ధులు భావించి ఉండవచ్చు. మరి అలాంటి వారి ఆశలను జగన్ నిరాశ చేశారు అంటే మొనగాడే అనుకోవాలి.