వాడుకోవడం, వంచించడం, వెన్నుపోటు పొడవడంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి మాత్రమే హక్కులున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఈ పని మరొకరు చేస్తే చంద్రబాబు సహించరు. అలా చేసిన వాళ్ల గుండెల్లో నిద్రపోతానని ఆయన హెచ్చరిస్తారు. ప్రజాస్వామ్యం గురించి, వాడుకోవడం, వెన్నుపోటు పొడవడం గురించి చంద్రబాబు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వుంటుంది.
వైసీపీ ప్లీనరీపై చంద్రబాబు తన మార్క్ చిల్లర కామెంట్స్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలిగా విజయమ్మ తప్పుకోవడంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా చంద్రబాబు ఏమన్నారంటే…
“మొన్నటి వరకూ అందరినీ వాడుకున్నారు. మొన్న చెల్లి పార్టీని వదిలిపెట్టి వెళ్లింది. ఇప్పుడు తల్లి వంతు వచ్చింది. గౌరవాధ్యక్షు రాలిగా ఉన్న తల్లి విజయమ్మతో జగన్ రాజీనామా చేయించారు. ఈయన వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఉంటాడంట. అందుకు తీర్మానం చేయించుకుంటారంట. ఆ పార్టీలో ఇక ఎన్నికలే ఉండవంట. అదొకట పార్టీనా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం?” అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
1983లో ఇందిరాగాంధీ ఆదేశిస్తే… పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌పై పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి, టీడీపీ అధికారంలోకి రాగానే అదే మామ పంచన చేరడాన్ని ఏమంటారు చంద్రబాబు? అల్లుడు కదా అని ఆశ్రయమిస్తే వెన్నుపోటు పొడిచి, ఎన్టీఆర్‌నే సీఎం పీఠంపై నుంచి కూలదోసిన నాయకుడు కూడా వాడుకోవడం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడ్డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఇక తమరి వాడుకోవడం గురించి చెప్పుకోవాల్సి వస్తే… దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి హరికృష్ణ, నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, అలాగే నందమూరి హరికృష్ణ తనయ సుహాసిని …ఇలా ఎంతెంత మంది ఉన్నారో గుర్తుందా?
తనయుడు లోకేశ్‌కు మాత్రం ఏపీలో మంత్రి పదవి ఇచ్చి, బామ్మర్ది హరికృష్ణ కూతురు సుహాసినికి తెలంగాణలో ఓడిపోయే సీటు ఇచ్చిన వాళ్లు కూడా జగన్‌ను విమర్శించడమా? తన హక్కుల్ని జగన్ లాక్కుంటున్నారని చంద్రబాబు బాధపడుతున్నారా? నవ్విపోతారనే ధ్యాస కూడా లేకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడ్డం… చంద్రబాబుకే చెల్లింది.