వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నారనే విషయంలో నారా చంద్రబాబునాయుడు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ పట్ల ప్రజల్లో ఇప్పటిదాకా ఎలాంటి అసంతృప్తి లేదు, ఆయన చేపడుతున్న పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
అదే సమయంలో పార్టీలో కూడా ఆయన ఏకచ్ఛత్రాధిపత్యానికి తిరుగులేకుండా ఉంది. జగన్ చరిష్మా, జగన్ అంకితభావం, చిత్తశుద్ధి ప్రజాదరణ ఫలితంగానే తాము అధికారంలో ఉన్నాం అని నమ్ముతున్న ఆ పార్టీ నాయకుల్లో కించిత్ అభిప్రాయ భేదాలు కూడా లేవు. అందుకే ఆ పార్టీకి తిరుగులేని నాయకుడుగా జగన్ ను వారు ఆమోదిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. పార్టీ అధ్యక్ష పదవి అనేది.. వారి యొక్క అంతర్గత వ్యవహారం. దాని గురించి చంద్రబాబునాయుడు విలపించడం ఎందుకో అర్థం కావడం లేదు.
సాంకేతిక కారణాలు చూపి, ఎవరూ తన వైఖరిని తప్పుపట్టకూడదనే ఉద్దేశంతో జగన్ తల్లి వైఎస్ విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయినా సరే, తన జగన్ బాబుకు, ఏపీ ప్రజలకు ఎప్పటికీ తోడుగా ఉంటానని కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. అయితే.. జగన్ అవసరం తీరిన తర్వాత.. చెల్లిని, తల్లిని కూడా పార్టీ నుంచి బయటకు పంపేశారంటూ చంద్రబాబు ఆడిపోసుకుంటున్నారు.
నిజానికి తెలుగుదేశం పార్టీ ఇలాంటి పరిణామంకోసమే నిరీక్షిస్తూ ఉంది. విజయమ్మ రాజీనామా చేస్తే.. జగన్ మీద బురద చల్లడం కోసం వేచి ఉంది. వారికి ఇది అందివచ్చిన అవకాశం. అందుకే .. జగన్ మీద నిందలు వేయడానికి చంద్రబాబు ఎగబడుతున్నారు.
అంతవరకు ఓకే. కానీ, చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు.. వైసీపీ ప్లీనరీ గురించి ఇంకా అనేక అవాకులు చెవాకులు పేలుతున్నారు. ‘ఆ పార్టీలో ఇక అధ్యక్ష స్థానానికి ఎన్నికలే ఉండవంట. ప్రపంచంలో ఇప్పటిదాకా ఎవరికైనా ఇలాంటి చెత్త ఆలోచనలు వచ్చాయా’ అంటూ కామెడీ చేస్తున్నారు.
పార్టీ స్థాపించిన ఎన్‌టి రామారావును వెన్నుపోటు పొడిచి, పొట్టన పెట్టుకుని, దొంగిలించిన పార్టీకి దశాబ్దాలుగా చంద్రబాబునాయుడు ఏకైక అధ్యక్షుడుగా కొనసాగుతుండగా.. తన రెక్కల కష్టంతో స్థాపించిన పార్టీని అధికారంలోకి తెచ్చిన జగన్ శాశ్వత అధ్యక్షుడు అయితే తప్పేంటో ప్రజలకు అర్థం కావడం లేదు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ నిర్వహించుకుని అనేకానేక తీర్మానాలు చేస్తూ ఉంటే.. వాటిని విమర్శించడానికి సరైన పాయింట్ కూడా లేకుండా.. కుమిలిపోతున్న చంద్రబాబునాయుడు, ఆ నైరాశ్యంలో.. జగన్ పార్టీ అధ్యక్ష పదవి గురించి సంకుచితంగా మాట్లాడుతున్నారని ప్రజలు అనుకుంటున్నారు.