ట్విట్టరే సాక్షి: బిజెపితో పవన్ కటీఫ్ సంకేతం!

రంగులకు ఉండే అర్థం, రంగులు తెలియజెప్పగల సందేశం, సంకేతం.. రంగులకు ఉండే విలువల ఒక సినిమా నటుడికి చాలా బాగా తెలిసే ఉంటాయి. తెరమీద తాము ఎలా కనిపించబోతున్నామో.. రంగుల విషయంలో వాళ్లు చాలా…

రంగులకు ఉండే అర్థం, రంగులు తెలియజెప్పగల సందేశం, సంకేతం.. రంగులకు ఉండే విలువల ఒక సినిమా నటుడికి చాలా బాగా తెలిసే ఉంటాయి. తెరమీద తాము ఎలా కనిపించబోతున్నామో.. రంగుల విషయంలో వాళ్లు చాలా నిర్దిష్టంగా ఉంటారు. అలాంటిది.. పవర్ స్టార్ గా అభిమానులు కీర్తించే సీనియర్ హీరో పవన్ కల్యాణ్ రంగులను పట్టించుకోకుండా ఉంటారని అనుకోలేం. 

అందుకే ఆయన తాజాగా ట్విటర్ లో పోస్ట్ చేసిన ఒక కార్టూన్ చూస్తే.. మనకు రకరకాల అనుమానాలు పుట్టుకొస్తాయి. ఎప్పుడెప్పుడు పెటాకులు అవుతుందా అని ఇరువర్గాలు కూడా ఎదురుచూస్తున్న బిజెపితో బంధం.. తెగతెంపులు చేసుకోవడానికి ఆ కార్టూన్ చాలా సంకేతాలు ఇస్తున్నదని మనకు అర్థమవుతుంది.

ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ చాలా ఇన్నోవేటివ్ మార్గంలో ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించేలా కార్టూన్లు గీయించి.. వాటిని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. 

పవన్ కల్యాణ్ ట్విటర్ ఖాతాకు సహజంగానే.. ఫాలోయర్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. సాధారణంగా ఆయన జయంతి, వర్ధంతి, దుర్ఘటనలకు ప్రతిస్పందనలు వంటివి, విమర్శలూ పెడుతుంటారు. ఈ మధ్య ఆయా విమర్శలకు తోడుగా.. కొత్తగా కార్టూన్లు కూడా గీయించి పెడుతున్నారు. వాటిని చూసేవాళ్లూ ఉంటారు.. ఎవరైనా చూడడం మిస్సవుతుందేమో అని.. పవన్ ను నెత్తిన పెట్టుకుని ఊరేగే మీడియా.. ఆ కార్టూన్లను తమ తమ పత్రికల్లో పునర్ముద్రిస్తుంటుంది కూడా.

అయితే.. ఆ క్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ తాజాగా ఒక కార్టూన్ పెట్టారు. అందులో- ఇంటినుంచి ఇద్దరు పిల్లలు బయల్దేరి స్కూలుకు వెళుతున్నారు. వారి బోసినోటి తాతయ్య వాకిట్లో అరుగుమీద కూర్చుని, ‘‘మాచిన్నప్పుడు కూడా అయిదారు క్రోసులు నడిచి బడికి వెళ్లే వాళ్లం రా. మళ్లీ ఇప్పుడు మీ ముద్దుల సీఎం మామ మిమ్మల్ని వెనకటి రోజులకు తీసుకువెళుతున్నాడన్నమాట’’ అని అంటూ ఉంటాడు. 

అంటే- స్కూళ్ల రేషనలైజేషన్ కారణంగా.. పిల్లలు రెండు మూడు కిలోమీటర్లు నడిచి స్కూళ్లకు వెళ్లాల్సి వస్తోందనేది కార్టూనిస్టు గారి మనసులోని మాట. కార్టూన్లో స్పష్టత లేదు! సాధారణంగా ఇలాంటి కార్టూన్లలో ఒక న్యూస్ పేపర్ లాంటిది ఒక మూలన పెట్టి.. ‘‘రేషనలైజేషన్ తో కి.మీలు నడిచి బడికి వెళ్తున్న పిల్లలు’’ లాంటి క్యాప్షన్ పెడతారు. ఆ పాటి జ్ఞానం కార్టూనిస్టుకు గానీ, దాన్ని ఓకే చేసి తన పర్సనల్ ఖాతాలో పోస్టు చేసిన పవన్ కల్యాణ్ కు గానీ లేవు. 

అయితే ఇంతకంటె ట్విస్టు ఏంటంటే.. ఆ కార్టూన్లోని పిల్లలకు వేసిన రంగులు. అబ్బాయికి నీలం రంగు చొక్కా వేసి.. చేతిలో ఆకుపచ్చ బ్యాగు పెట్టారు! అంటే వైసీపీ రంగులు వేశారన్నమాట. వాడితో కలిసి బడికి వెళ్తున్న అమ్మాయికి.. కాషాయం రంగు జాకెట్టు, ఆకుపచ్చ పావడ వేశారు. అచ్చంగా భారతీయ జనతా పార్టీ రంగులు.!!

ఇదే అసలు ట్విస్టు. వైసీపీ- బీజెపే చెట్టపట్టాలు వేసుకుని నడుస్తున్నాయి.. అనే సంకేతం ఇవ్వడానికే పవన్ కార్టూన్లో రంగుల ఎంపిక ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు. అల్లూరి సభలో ప్రధాని మోడీ- జగన్ ఎంత కలివిడిగా ఉన్నారో అందరూ గమనించారు. 

కనీసం ఆ సభకు ఆహ్వానం కూడా లేని పవన్ కల్యాణ్ కు కాలినట్టుంది. అందుకే.. తాను బిజెపితో తెగతెంపులు చేసుకుంటున్న సంగతి ఇంకా బయటకు చెప్పకపోయినప్పటికీ.. ఆ పార్టీ వైసీపీతో అంటకాగుతున్నదని ఆయన చాటదలచుకున్నట్టున్నారు. ఆయన మనసులో ఉన్న భావనే.. కార్టూన్ రంగుల్లో బయటకు వచ్చింది. 

రేపో మాపో.. బిజెపి- అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నది గనుక.. వారితో తెగతెంపులు చేసుకుంటున్నా.. అని ప్రకటించినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి అందుకు ఆయన భూమిక సిద్ధం చేసుకుంటున్నారు.