వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలిగా వైఎస్ విజయమ్మ రాజీనామా చేయడంతో ఎల్లో మీడియా కొత్త పల్లవి అందుకుంది. ఈ సందర్భంగా ఎల్లో మీడియా ఒక కీలక విషయాన్ని విస్మరించింది. సతీమణి భారతీరెడ్డి కోసం తల్లి వైఎస్ విజయమ్మను జగన్ వ్యూహాత్మకంగా తప్పించారనే ప్రచారాన్ని ఎల్లో మీడియా నెత్తికెత్తుకుంది.
భవిష్యత్‌లో జగన్ జైలుకెళ్లాల్సిన పరిస్థితే వస్తే.. ముఖ్యమంత్రి కుర్చీలో తన భార్య భారతీరెడ్డిని కూర్చోబెట్టేందుకే సీఎం జగన్మోహన్‌రెడ్డి తన తల్లి వైఎస్ విజయలక్ష్మిని వైసీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి సాగనంపారంటూ ఎల్లో మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది. అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ తన దర్యాప్తును వేగవంతం చేస్తే.. జగన్‌కు చట్టపరమైన చిక్కులు తప్పవని.. అదే జరిగితే సీఎం స్థానంలో భార్య భారతీరెడ్డిని కూర్చోబెట్టాలన్న ముందస్తు ప్రణాళికలో భాగంగానే తల్లిచెల్లిని జగన్ పొరుగు రాష్ట్రానికి సాగనంపారని ఎల్లో మీడియా విశ్లేషిస్తోంది.
ఈ ప్రచారం అంతా నిజమే అనుకుందాం. మరి టీడీపీ పరిస్థితి ఏంటి? ఈ మూడేళ్ల పరిపాలనపైనే జనంలో విపరీతమైన అసంతృప్తి ఉందని ఇదే ఎల్లో మీడియా కోడై కూస్తోంది. ఎన్నికలు ఇప్పుడు జరిగినా టీడీపీ అధికారంలోకి రావడం తథ్యం అని జోస్యం చెబుతోంది. మరోవైపు భారతీరెడ్డి కోసం వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్ష పదవి నుంచి తల్లిని తప్పించారని ఎల్లో మీడియా కథనాలు రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్నాయి. ఇప్పట్లో సీబీఐ కేసుల వల్ల జగన్ జైలుకెళ్లే పరిస్థితి లేదు. అలాంటప్పుడు సీఎం సీట్లో భార్యను కూచోపెట్టడానికే తల్లి అడ్డు తొలగించుకున్నారనే వాదనలో బలం, వాస్తవం ఎంత? భవిష్యత్‌లో కేసుల వల్ల తనకు ఇబ్బందులు ఎదురైతే ఎందుకైనా మంచిదని జగన్ అప్రమత్తం అయ్యారని ఆ మీడియా రాస్తోంది. అంటే జగన్ ఇంకా ఎంత కాలం సీఎంగా ఉంటారని ఆ మీడియా అంచనా కడుతున్నదో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా 30 ఏళ్ల పాటు తాను అధికారంలో ఉంటానని జగన్ ధీమాగా ఉన్నారు. అదే ఎల్లో మీడియా నమ్ముతోందా? ఎప్పుడైనా అంటే…. 10 సంవత్సరాలా? 20 ఏళ్లా? ఎంత కాలం?
జగనే అంత కాలం సీఎంగా ఉంటే, టీడీపీ భవిష్యత్ ఏంటో చెప్పాలి? ఇక ఇప్పట్లో టీడీపీ అధికారంలోకి రాదని భారతీరెడ్డిపై కథనం ద్వారా ఎల్లో మీడియా చెప్పదలుచుకుందా? జగన్ కుటుంబంపై బురద చల్లే క్రమంలో, టీడీపీకి భవిష్యత్ లేదని ఎల్లో మీడియా చెప్పకనే చెబుతోంది. 2024లో అధికారంలోకి రాకపోతే టీడీపీ కథ కంచికే అని తమ ఆరాధ్య నాయకుడు చంద్రబాబు ఆందోళన చెందుతుంటే, మరోవైపు విజయమ్మ రాజీనామాపై పైశాచిక రాతల వల్ల లాభం ఎవరికో? ఒక్కసారైనా ఎల్లో మీడియా ప్రశ్నించుకుంటున్నట్టు లేదు.
ఇలాంటి కథనాల వల్ల జగన్‌కు లాభం, బాబుకు నష్టం అని గ్రహిస్తే మంచిది. భారతీరెడ్డి సీఎం అయితే …అంతిమంగా వైఎస్ కుటుంబానిదే కదా అధికారం! చంద్రబాబు, లోకేశ్ హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోవాలా?