నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు శ్రీనివాస్ నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. తన కుమారుడిని విడుదల చేయాలని నిందితుడు శ్రీనివాస్ తల్లి సావిత్రి వేడుకుంటోంది. ఈ మేరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ఆమె లేఖ రాయడం గమనార్హం.
2018లో విజయనగరం జిల్లాలో జగన్ పాదయాత్ర పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు బయల్దేరారు. విశాఖ నుంచి విమానంలో వెళ్లడానికి ఆయన విమానాశ్రయానికి వెళ్లారు. ఆ సమయంలో కోడికత్తితో శ్రీనివాస్ అనే యువకుడు జగన్‌పై దాడికి పాల్పడ్డాడు. జగన్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. వెంటనే ఆయన హైదరాబాద్‌కు వెళ్లి ఆస్పత్రిలో చేరారు.
ఘటనా స్థలంలో శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ అభిమానిగా ఆ యువకుడు చెప్పడం అప్పట్లో సంచలనం సృష్టించింది. నాలుగేళ్లుగా అతను రిమాండ్‌లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో నిందితుడి తల్లి కుమారుడిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి, మన తెలుగు వ్యక్తి అయిన జస్టిస్ ఎన్వీ రమణకు తన ఆవేదనను విన్నవించుకుంటూ లేఖ రాయడం చర్చనీయాంశమైంది.
తన కుమారుడిపై న్యాయస్థానం, అలాగే ఎన్ఐఏ ఎలాంటి విచారణ జరపకపోవడాన్ని ఆమె సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లారు. లేఖలపై ఎన్వీ రమణ వెంటనే స్పందించడం గురించి మీడియా ద్వారా తెలుసుకున్నాం. మరి జగన్‌పై హత్యాయత్నం కేసులో జస్టిస్ ఎన్వీ రమణ ఎలా స్పందిస్తారోననే ఉత్కంఠ నెలకుంది.