వైసీపీ ప్లీనరీ అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతోంది. గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో ప్లీనరీలో భాగంగా రెండో రోజు సమావేశాలు జరుగుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు తమదైన రీతిలో ప్రత్యర్థులపై దూకుడుగా మాట్లాడుతున్నారు. అయితే 12 గంటల తర్వాత ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అయ్యింది.
అప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని దుష్టచతుష్టయంపై సెటైర్స్‌తో వైసీపీ శ్రేణుల్ని కట్టిపడేసేలా ప్రసంగాన్ని చేస్తున్నారు. పేర్ని తర్వాత గుడివాడ ఎమ్మెల్యే , వైసీపీ ఫైర్‌బ్రాండ్ కొడాలి నాని కూడా దుష్టచతుష్టయంపై ప్రసంగాన్ని మొదలు పెట్టారు.
మెల్లిగా వర్షం పెరిగింది. మరోవైపు తన మార్క్ పంచ్‌లతో కొడాలి వీరవిహారం చేస్తున్నారు. ఒక వైపు జోరు వర్షానికి తడిసి ముద్దవుతూ, మరోవైపు వాడి, వేడి పంచ్‌లతో కూడిన కొడాలి నాని ప్రసంగాన్ని వైసీపీ శ్రేణులు ఆస్వాదించాయి.
వైసీపీ శ్రేణుల నిబద్ధతకు, జగన్‌పై అభిమానానికి వర్షం ఓ పరీక్ష పెట్టిందనే సరదా కామెంట్స్ ప్లీనరీలో వినిపించాయి. కొడాలి నాని తమ నాయకుడు జగన్ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ, అలాగే ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటే వానను సైతం వైసీపీ శ్రేణులు లెక్కచేయకుండా ఈలలు వేస్తూ, చప్పట్లు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.
కొడాలి నాని ప్రసంగం పూర్తయిన తర్వాత విజయసాయిరెడ్డి మాట్లాడుతూ సమావేశాల షెడ్యూల్‌ను కొంచెం ముందుకు జరిపినట్టు ప్రకటించారు.
వర్షం పెరిగే అవకాశాలు ఉండడంతో త్వరగా సమావేశాల్ని ముగించాలని భావించినట్టు సమాచారం. ఇందులో భాగంగా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగాన్ని రెండు గంటలకు మొదలు పెట్టనున్నట్టు విజయసాయిరెడ్డి ప్రకటించడం గమనార్హం.
అలాగే వైసీపీ అధ్యక్షుడిగా జగన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కూడా ప్రకటించనున్నారు. మొత్తానికి వర్షంలో కూడా వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనడం అధిష్టానానికి కిక్ ఇస్తోంది.