తన అసమర్థతను తానే చాటుకున్న చంద్రబాబు!

‘రాధాకల్యాణం’ అనే సినిమాలో పాలకాట్టు మాధవన్ అనే వర్ధమాన మ్యూజిక్ డైరట్రు ఉంటాడు. అనగా చంద్రమోహన్ అన్నమాట. ఓ పాటకు చక్కని ట్యూన్ కట్టి పాడుతాడు ఇలా.. ‘‘నేను సన్నాసిని, పరమ సన్నాసిని, ఒట్టి…

‘రాధాకల్యాణం’ అనే సినిమాలో పాలకాట్టు మాధవన్ అనే వర్ధమాన మ్యూజిక్ డైరట్రు ఉంటాడు. అనగా చంద్రమోహన్ అన్నమాట. ఓ పాటకు చక్కని ట్యూన్ కట్టి పాడుతాడు ఇలా.. ‘‘నేను సన్నాసిని, పరమ సన్నాసిని, ఒట్టి సన్నాసిని, జడ్డి సన్నాసిని..’’ అని పాడుతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు. సదరు పాల్గాట్టు మాదవన్ తమిళుడు. 

తెలుగు సరిగా రాదు. తెలుగు పదాలు చెబితే ట్యూన్ కట్టి పాడేసి.. నవ్వుల పాలవుతాడు. మరి మన చంద్రబాబు గారికి ఏమైంది. ఆయన తెలుగువాడే కదా! తన అసమర్థతలను, తన చేతగాని తనాన్ని అలా తానే బడాయిగా చాటుకుంటూ పదేపదే చాటుకోవడం ఎందుకు అని ఆయన ప్రసంగం విన్నవారికి ఇప్పుడు అనుమానం కలుగుతోంది. 

రాజంపేట ఎంపీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అన్నమయ్య జిల్లా పార్టీ నాయకుల సమావేశం చంద్రబాబునాయుడు నిన్న నిర్వహించారు. ఆ పార్టీలో ఆయన చెబుతున్న మాటలు విని పార్టీ నాయకులే విస్తుపోయారు.

‘‘రాష్టం విభజన అయ్యాక అధికారంలోకి రాగానే.. నవ్యాంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంంలో నిలిపేందుకు సర్వశక్తులు ఒడ్డానని, ఈ క్రమంలో కార్యకర్తలను విస్మరించానని.. ఈ పొరబాటు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటానని’’ చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటన్నమాట.. భవిష్యత్తులో తాను అధికారంలోకి వస్తే గనుక.. కార్యకర్తలను మాత్రం గమనించుకుంటూ.. నవ్యాంద్రప్రదేశ్ అభివృద్ధిని గాలికొదిలేస్తాను అనేనా? అని వాళ్లే చర్చించుకుంటున్నారు. 

నాయకుడు అనేవాడు.. అటు ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని దానితో పాటు సమానంగా పార్టీని పట్టించుకోవాలి.. ముందుకు తీసుకెళ్లాలి. 2014 లో అధికారంలోకి వచ్చినప్పుడు.. ఈ రెండు బాధ్యతల నిర్వహణ చేతకాక కార్యకర్తలను వదిలేశానని అనడం నిజమే అయితే గనుక.. రేపు మాత్రం ఎలా చేయగలరనేది వారి సందేహం. 

ఈ మీటింగ్ సందర్భంగా ఇన్నాళ్లకు చంద్రబాబునాయుడు ఒక విషయం నిస్సిగ్గుగా ఒప్పుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలను కొంతకాలంగా చురుగ్గా చూసుకోకపోవడం వల్ల మునిసిపాలిటీని కోల్పోయామని ఆయన అన్నారు. ఇప్పుడు అన్నీ చక్కదిద్దేస్తున్నానని కూడా బాబు అన్నారు. ఒక్కసారి కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి.. కుప్పం మునిసిపాలిటీలో దారుణ పరాభవానికి, పరాజయానికి గురైనప్పుడు చంద్రబాబునాయుడు ఏం చెప్పాడో గుర్తు చేసుకోండి! 

వైసీపీ అరాచకాలకు పాల్పడిందని, తమ పార్టీ వారిని నామినేషన్లు కూడా వేయనివ్వలేదని, ఓటుకు పదివేల వరకు కూడా పంచారని రకరకాలుగా అంటూ వచ్చారు. మరిప్పుడు ఏమంటున్నారో చూశారా.. సరిగా చూసుకోకపోవడం వల్లనే కుప్పంలో ఓడిపోయారట. అంటే ఇన్నాళ్లూ ఆ ఓటమి గురించి చెప్పినవన్నీ.. నిస్సిగ్గు అబద్ధాలే కదా!

వైకాపా చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దేందుకు 10-15 ఏళ్లు పడుతుందని చంద్రబాబు అంటున్నారు. అంటే దాని అర్థం.. ఆయనను గెలిపిస్తే గనుక.. 10-15 ఏళ్ల పాటూ అసలేమీ అభివృద్ధిని అడుగు ముందుకు పడనివ్వకుండా, దోచుకుంటూ కూర్చుంటారేమోనని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.