2019 ఎన్నికల తర్వాత ఇవాళ్టికి మూడేళ్లు గడచిపోయాయి. ముప్పయ్యేళ్లు ముఖ్యమంత్రిగా సేవలందిస్తానని అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గద్దె ఎక్కిన తర్వాత.. ఈ మూడేళ్లకాలంలో రెండేళ్లకు పైగా కరోనా వెతలతోనే గడచిపోయాయి. అప్పటికే కునారిల్లి ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కరోనా దెబ్బకు మరింత సర్వనాశనం అయిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ముఖ్యమైన నాయకులు! వీరిలో, ముఖ్యమంత్రి గనుక.. కరోనాను ఎదుర్కొనే సమస్త బాధ్యతలను ఆయన స్వయంగా చూసుకున్నారు. మిగిలిన ఇద్దరు నాయకులూ కరోనా భయానికి గూటిలోనే ముడుక్కుని కూర్చున్నారు.
ఆ విషయాలన్నీ పక్కన పెడితే.. ఈ మూడేళ్లలో ఏ నాయకుడి ప్రస్థానం ఎలా సాగింది? వారిలో మంచి చెడులు ప్లస్సులు మైనస్సులు ఏమిటి? సంక్షిప్తంగా సమీక్షించే ప్రయత్నం ఇది..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లస్సులు
=) మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి మాటను తొలిమూడేళ్లలోనే ఆచరణలోకి తేవడం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యం అయింది. నవరత్నాల రూపేణా సంక్షేమ పథకాలు విరివిగా అమలవుతున్నాయి. రాష్ట్రంలోని పేదల్లో ప్రభుత్వ సాయం అందని వారు ఒక్క కుటుంబం కూడా ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ విషయంలో ప్రతిఒక్కరూ జగన్ ను తమ కుటుంబ సభ్యుడిలాగానే భావిస్తున్నారు.
=) పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం ద్వారా.. కొత్త దశదిశ నిర్దేశించారు. పాఠశాలల రూపురేఖలు ఇదివరకటితో పోలిస్తే గణనీయంగా మారిపోయాయి.
=) ప్రభుత్వ హాస్పిటళ్లు కూడా చాలా మెరుగయ్యాయి. కొవిడ్ ఉధృతి సమయంలో కొన్ని అపశృతులు ఉన్నప్పటికీ.. స్థూలంగా చూసినప్పుడు హాస్పిటళ్ల సేవలు మెరుగుపడ్డాయి.
=) మంత్రివర్గాన్ని కూడా ముందే చెప్పినట్టు.. రెండున్నరేళ్లు గడచిన తర్వాత పునర్ వ్యవస్థీకరించారు. సీనియర్లను ఎన్నికల్ టీమ్ గా ప్రజల్లో మోహరించి, అనుభవం తెచ్చుకునే అవకాశంగా ఇతరులకు స్థానం కల్పించారు. ఇది వ్యూహాత్మక ఎత్తుగడ
మైనస్సులు
=) పార్టీని సమన్వయం చేసుకోవడంలో లోటుపాట్లు కనిపిస్తూనే ఉన్నాయి. పార్టీలో నిర్ణయాత్మకంగా ఉండగల నెంబర్ టూ నాయకుడు ఎవరు? అనేది సమాధానంలేని ప్రశ్నగానే మిగిలిఉంది.
=) మీడియాను ఫేస్ చేయడానికి జగన్ భయపడతాడు అనే అపకీర్తిని తొలగించుకోలేకపోయారు. ముఖ్యమంత్రి అయిన మూడేళ్లలో నిర్వహించిన మీడియా సమావేశాలు బహుస్వల్పం. అవి కూడా.. తాను చెప్పదలచుకున్నది చెప్పడమే తప్ప.. ప్రశ్నలను ఎదుర్కోవడం, రిటార్టు ఇవ్వడం లేనే లేదు.
=) పార్టీ నేతలు హద్దులు మీరుతున్నా అదుపు చేయలేకపోయారు. పార్టీ నేతలు కట్టుతప్పి వ్యవహరించినప్పుడు వారి మీద కఠిన చర్యలతో పార్టీ పరువును కాపాడే ప్రయత్నాలు శూన్యం. చర్య తీసుకుంటే.. విపక్షాల ఆరోపణలకు విలువ ఇచ్చినట్టు అవుతుందనే అనవసరపు భయంతో.. ప్రజల దృష్టిలో పార్టీనేతల చేతలు పరువుతీసేవి అయినా సరే, వారిని సమర్థిస్తూ మాట్లాడే ధోరణి ఇబ్బందికరం.
=) లిక్కర్ ధరలు ఎలా పెరిగినా.. సంపూర్ణ మద్య నిషేధం అనేహామీని హర్షించిన ప్రజలు సంతోషించారు. ప్రయోజనం ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి స్థిరంగా లేదు. ఊగిసలాటగా వ్యవహరిస్తున్నారు. ఇసుక ధరల విషయంలో ఎంత శాస్త్రీయంగా, పారదర్శకంగా చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్పుకుంటున్నా.. గతంలోకంటె ధర ఎక్కువగా ఉండడం మాత్రమే సామాన్య ప్రజలకు కనిపిస్తుంది.
చంద్రబాబునాయుడు ప్లస్సులు
=) వార్ధక్యం బాగా మీదపడినప్పటికీ ఇప్పటికీ చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా ఇదివరకటిలాగానే ఫుల్ యాక్టివ్ గా కష్టపడుతున్నారు.
=) తాను చిటికె వేస్తే చాలు ఏదో ఒక రకంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మీద అడ్డదారుల్లో కోర్టుకు వెళ్లి, ఆ నిర్ణయాలు అమలు కాకుండా ఆపేసే.. రహస్య దళాలు పుష్కలంగా ఉండడం పెద్ద ఎడ్వాంటేజీ.
=) 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబును ఛీకొట్టిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మళ్లీ ఆయన పల్లకీ మోయడానికి ఎగబడుతున్నాడు. ఇది ఆయనకు లాభసాటి విషయం.
=) పత్రికలు, టీవీ ఛానెళ్లు కొన్ని తమకు మరో జీవితాశయమే లేదన్నట్టుగా చంద్రబాబును ముఖ్యమంత్రి పీఠంపై పునఃప్రతిష్ఠించడానికి అహరహం శ్రమిస్తున్నాయి.
మైనస్సులు
=) కరోనా కాలంలో ఇల్లు కదలకుండా కేవలం ఆన్ లైన్ ముచ్చట్లతో కాలం గడుపుతూ.. మీడియా అటెన్షన్ తనమీద నుంచి మరలిపోకుండా చూసుకున్నారు.
=) కొడుకు నారా లోకేష్ చేతగానితనం, ఇప్పటికీ పట్టుగల నాయకుడిగా ఎదగలేకపోవడం పెద్ద మైనస్. కొడుకు అసమర్థత వల్ల చంద్రబాబే ఇప్పటికీ రెక్కలు ముక్కలు చేసుకోవాల్సి వస్తోంది.
=) గెలిచిన 23 సీట్లను కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఆ ఎమ్మెల్యేల్లో కొందరు వైసీపీ పంచన చేరిపోగా, మిగిలిన వారిలోనూ.. పార్టీలో యాక్టివ్ గా ఉన్నవారు తక్కు. పార్టీకి భవిష్యత్తు ఉండదని సైలెంట్ గా ఉన్నవారే ఎక్కు.
=) పార్టీ కట్టు తప్పిపోకుండా, కార్యకర్తల్లో భరోసా కల్పించడంలో విఫలం అయ్యారు. పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపు ఇస్తే.. నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పట్టుమని పదిమందితో మాత్రమే నిర్వహించే దుస్థితి చాలా చోట్ల ఉంది.
=) ప్రజల్లో చంద్రబాబు మీద నమ్మకం పోయింది. అబద్ధాలు చెబుతున్నారనే అభిప్రాయం ఏర్పడింది.
పవన్ కల్యాణ్ ప్లస్సులు
=) అవినీతి ఆరోపణలు లేవు. గెలుపులూ లేవు, అధికారమూ లేదు గనుక.. అవినీతి ఆరోపణలు ఉండడం సాధ్యం కాదు. కాకపోతే.. పార్టీ నిర్వహణ పేరుతో తనను ఆశ్రయించిన నేతల నుంచి వసూళ్లు చేస్తున్నాడనే ఆరోపణలు కూడా లేవు.
=) భీమ్లానాయక్ సినిమా విడుదల సమయంలో జగన్ ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు పవన్ పై సానుభూతి పెంచాయి. ప్లస్ అయింది.
=) రోడ్ల రిపేర్ల పేరిట నడిపించిన ఎపిసోడ్, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థికసాయం వంటివి ప్రజల్లో పేరును , గుర్తింపును తెచ్చాయి.
మైనస్సులు
=) మాట్లాడితే అర్థం ఉండదు. తలాతోకాలేకుండా విమర్శలు, వెకిలి వ్యాఖ్యలు.. స్థిరచిత్తం లేని నాయకుడిలాగా మాట్లాడుతూ జనంలో పలచన అవుతుంటారు.
=) బీజేపీతో తాను భాగస్వామ్య పార్టీ అంటారు. రాష్ట్ర బీజేపీతో కలిసి ఒక్క పని కూడా చేయరు. తనది మోడీరేంజి అన్నట్టుగా.. ఇక్కడివారిని చిన్నచూపు చూస్తారు.
=) తన రాజకీయ వైరాలు, ఈగోల వల్ల నిర్మాతలను ముంచేస్తున్నారనే అపప్రథ ఉంది.
=) షూటింగులకు, స్టోరీ డిస్కషన్లకు మధ్య గ్యాప్ దొరికినప్పుడు మాత్రమే ప్రజల వద్దకు వెళుతుంటాడనే పేరుంది.
=) పవన్ కల్యాణ్ రాజకీయాలను సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి అనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించలేకపోయారు.
ఇవీ ఈ ముగ్గురు నాయకుల ప్లస్సులు మైనస్సులు. రాబోయే రెండేళ్లలో మైనస్సులను ప్లస్సులుగా మార్చుకుంటూ.. వచ్చే ఎన్నికల నాటికి గద్దెమీదకి వచ్చేంత కృషి ఎవరు, ఎలా చేస్తారో చూడాలి.