బొమ్మరిల్లు భాస్కర్ చాలా అంటే చాలా కాలం తరువాత కిందా మీదా పడి బ్యాచులర్ సినిమా అందించారు. దానికి తెర వెనుక సాయం పట్టిన జనాలు చాలా మంది వున్నారు. అన్నింటికి మించి గీతా సంస్థ, బన్నీవాస్ వుండనే వున్నారు.
చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఏదో విధంగా బతికి బయటపడిందా సినిమా. ఆ తరువాత మళ్లీ బొమ్మరిల్లు భాస్కర్ ను పిలిచి అడ్వాన్స్ చేతిలో పెట్టిన వారు లేరు.
ఇప్పుడు కొత్తగా ఓ ప్రాజెక్టు వినిపించడం ప్రారంభమైంది. టాలీవుడ్ లో మంచి నిర్మాత, బ్యాడ్ లక్ ను వెంటేసుకుని తిరిగే నిర్మాత అని టాక్ వున్న అనిల్ సుంకర ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
లేటెస్ట్ గా మహాసముద్రం సినిమాతో భయంకరమైన ప్లాప్ ను చవిచూసారు ఆయన. ఆయన అడిగితే ఏ హీరో అయినా డేట్లు ఇస్తారు. ఆయన మంచితనం అలాంటిది.
కానీ దొరికే ప్రాజెక్టులు మాత్రం ఇలాంటివి. బొమ్మరిల్లు భాస్కర్ ను హీరో నాగచైతన్యను ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నది వినవస్తున్న వార్తలు సారాంశం.
ఇప్పటికే చైతన్య చేతిలో రెండు ప్రాజెక్టులు వున్నాయి. ఒకటి వెంకట్ ప్రభు-చిట్టూరి శ్రీను ప్రాజెక్టు. రెండవది 14రీల్స్-పరుశురామ్ ప్రాజెక్టు. ఈ రెండు ప్రాజెక్టుల తరుువాత ఇది వుంటుందేమో?
ఇంతకీ తమ్ముడి సినిమా బ్యాచులర్ చూసిన తరువాత కూడా చైతన్యకు ఇంకా బొమ్మరిల్లు భాస్కర్ మీద నమ్ముకముందా?