సమయం-సందర్భం లేకపోయినా.. తల-తోక దొరక్కపోయినా.. వైసీపీని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు పవన్. ఈ విషయంలో ఆయన సందర్భం ఏంటనేది చూడడం లేదు. సమయం ఏంటనేది ఆలోచించడం లేదు. ఏదైనా టాపిక్ దొరికితే చాలు, దాన్ని వైసీపీ వైపు టర్న్ చేయడం విమర్శించడం పవన్ కల్యాణ్ కు ఫ్యాషన్ అయిపోయింది. సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతికి, వైసీపీకి ఏమైనా సంబంధం ఉందా?
“ఆవు వ్యాసం” గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఏ టాపిక్ మాట్లాడినా చుట్టూతిప్పి ఆవుకు రెండు కొమ్ములుంటాయి, గడ్డి తింటుంది అనే దగ్గరకు వచ్చి ఆగుతుంది వ్యాసం. ఇప్పుడు పవన్ వ్యవహారశైలి కూడా ఇలానే ఉంది. ఏ టాపిక్ ఎత్తినా, వైసీపీపై విమర్శలు చేయడం దగ్గరకు వచ్చి ఆగుతున్నారు పవన్.
స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా పవన్ స్పందించారు. జయంతి సందర్భంగా 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం’ పేరిట మొదటి సంపుటి ప్రచురించారు. ఈ సంపుటిపై స్పందించిన పవన్.. సిరివెన్నెలతో తనుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన సాహిత్యాన్ని మెచ్చుకున్నారు. ఇక్కడితో ఆగితే పద్ధతిగా ఉండేది. కానీ పవన్ ఆ పద్ధతులు ఎప్పుడో గాలికొదిలేశారు.
“ఏరు దాటాకా అవసరం తీరిందని తెప్ప తగలబెట్టే ఆలోచనలతో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు ఒకసారి శాస్త్రి గారి సాహిత్యాన్ని చదివి అర్థం చేసుకోవాలి”. ఇదీ జయంతి సందర్భంగా పవన్ ఇచ్చిన స్టేట్ మెంట్. నేరుగా ఆయన పార్టీలు, పేర్లు ప్రస్తావించకపోయినా ఆ విమర్శ ఎవర్ని ఉద్దేశించి చేసిందో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అసలు సిరివెన్నెల సాహిత్యానికి, పవన్ ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ కు ఏమైనా సంబంధం ఉందా? ఆయన జయంతికి, పవన్ చేసిన వ్యాఖ్యలకు లింకు ఏమైనా ఉందా? పవన్ ఏమైనా ప్రవచనకర్తలా ఫీల్ అవుతున్నారా లేక స్వామి వివేకానంద అనుకుంటున్నారా?
ఇదే సందర్భంలో తన సొంత డబ్బాను కూడా మరిచిపోలేదు “శ్రీ పవన్”. “ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా/ తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే – అనే ఈ పంక్తులు ఇప్పటికీ నా బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి. నన్ను నిలబెట్టిన ఈ సమాజానికి రుణం తీర్చుకోవడం నా విధిగా భావిస్తాను” అంటూ కాస్త గట్టిగానే డబ్బా కొట్టుకున్నారు.
సిరివెన్నెల జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఇంకా చాలానే అన్నారు పవన్ కల్యాణ్. “జనసేన పార్టీ పక్షాన కౌలు రైతులకు భరోసా ఇచ్చి ఆర్థిక సాయం చేయడం కూడా నా బాధ్యతే.” అంటూ ప్రకటించుకున్నారు. అసలు అక్కడ సందర్భం ఏంటి? పవన్ వ్యాఖ్యలేంటి?
అసలు ఏ సందర్భంలో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కూడా మరిచిపోయారా? దాని బదులు శాస్త్రి గారిపై స్పందించకుండా ఉంటే ఇంకా మేలేమో. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉందా పవనూ!