జడ్జిలపై ఏపీ అధికార పార్టీ నేతలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా దాడులకు పాల్పడుతున్నారనే తీవ్ర ఆరోపణలున్నాయి. అయితే ఏపీ కంటే ఇతర రాష్ట్రాల్లో ఈ జాడ్యం ఎక్కువని స్వయంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యతో తెలిసొచ్చింది. ఇటీవల కాలంలో ఏపీ సర్కార్, న్యాయ వ్యవస్థ మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి. అంతకు మించి వివాదానికి దారి తీసేలా తీర్పులు లేవు.
మూడు రాజధానుల తీర్పుపై మాత్రం అధికార పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ఎంపిక నిర్ణయం ఏపీ అసెంబ్లీకి లేదని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో, అధికార పార్టీ ప్రజాప్రతినిధి ధర్మాన ప్రసాదరావు లేఖతో అసెంబ్లీలో మంచి చర్చ జరిగింది. ఇటీవల కాలంలో జగన్ ప్రసంగాల్లో అదే ఉత్తమమైందనే ప్రశంసలు వచ్చాయి.
ఇదిలా వుండగా జడ్జిలపై ఆరోపణలు చేయడం ఈ రోజుల్లో ప్యాషన్‌గా మారిందని సుప్రీంకోర్టు మండిపడింది. కోర్ట్ ధిక్కరణకు పాల్పడిన అడ్వొకేట్‌కు మద్రాస్ హైకోర్ట్ 15 రోజుల జైలుశిక్ష విధించింది. దీనిపై సదరు లాయర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ డీవై చంద్రచుడ్ విచారిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిటిషన్‌పై జోక్యం చేసుకోబోమని చంద్రచుడ్ స్పష్టం చేశారు. శిక్షను సమర్థించారు.
చట్టం కంటే లాయర్లు ఎక్కువకాదన్నారు. న్యాయ నిబంధనలను అతిక్రమిస్తే లాయర్లైనా పర్యవసనాలను ఎదుర్కోవాల్సిందే అన్నారు. అలాంటి లాయర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సదరు లాయర్ ప్రవర్తన మారేలా కనిపించడం లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. మనస్తత్వంంలో ఎలాంటి మార్పురాని లాయర్ల వర్గానికి చెందిన వ్యక్తిగా పిటిషనర్ గురించి కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు, సదరు న్యాయవాది న్యాయవృత్తిలో మచ్చలాంటివారని ఘాటు వ్యాఖ్య చేయడం చర్చనీయాంశమైంది..
న్యాయమూర్తులను టార్గెట్ చేస్తున్న కేసుల సంఖ్య పెరుగుతుండడంపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. ఈ తరహా కేసులు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో ఎక్కువగా నమోదవుతున్నాయని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జడ్జి ఎంత గట్టివాడైతే, అతడిపై అంతటి చెత్త ఆరోపణలు చేస్తున్నారని విచారం వ్యక్తం చేయడం గమనార్హం.