Advertisement

Advertisement


Home > Politics - Analysis

కొండను తవ్వారు.. ఎలుకనైనా పట్టారా..?

కొండను తవ్వారు.. ఎలుకనైనా పట్టారా..?

ఏపీలో పదో తరగతి పరీక్షలు తీవ్ర వివాదాల మధ్య ముగిశాయి. పేపర్ లీకేజీ అని కొంతసేపు, కాదు కాదు మాస్ కాపీయింగ్ అని మరికొంతసేపు, అసలు కాపీయింగ్ కూడా జరక్కుండానే నిందితుల్ని అరెస్ట్ చేశారని మరికాసేపు.. ఇలా అధికారులు, నాయకులు రకరకాల వాదనలు వినిపించారు. చివరకు హైదరాబాద్ లో ఉన్న మాజీ మంత్రి నారాయణను ఇలా చిత్తూరు తీసుకొచ్చి, అలా పంపించి వేశారు. 

అక్కడ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవహార శైలిపై అనుమానం. ఇలాంటి పరిస్థితుల్లో కొండను తవ్వినంత పని చేసిన పోలీసులు, అధికారులు కనీసం ఎలుకను సైతం పట్టుకోలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

వ్యవస్థలతో ఎందుకీ అవస్థ..

"చంద్రబాబు వ్యవస్థలను బహు బాగా మేనేజ్ చేయగలరు." ఎంతకాలం ఈ మాట చెప్పుకుంటారు. పోనీ వ్యవస్థలేమైనా బాబు బానిసలా..? అధికారంలో లేకపోయినా అంతగా బాబుకి భయపడాలా..? మాజీ మంత్రి నారాయణ, అరెస్ట్, బెయిల్ వ్యవహారంలో నిజంగానే వైసీపీ డొల్లతనం, అధికారుల అసమర్థత బయటపడింది. 

పోనీ ఇంతచేసి, ఏమైనా సాధించారా అంటే అదీ లేదు. నారాయణ హ్యాపీ, వారి విద్యాసంస్థలు హ్యాపీ.. చివరకు హైదరాబాద్ నుంచి చిత్తూరు తీసుకొచ్చినందుకు పెట్రోల్ ఖర్చులు కూడా దండగ అనేట్టు చేశారు.

పెట్టిన కేసులు ఏమయ్యాయి...?

ప్రస్తుతం నారాయణ బెయిల్ పై వచ్చేశారు, ఆయన సంస్థ నుంచి అరెస్ట్ అయినవారికి కూడా బెయిలొచ్చింది. కోర్టు కేసు వాయిదా పడింది. ఓసారి వాయిదా పడింది అంటే.. కేసు వ్యవహారం ఎలా సాగుతుందో అందరికీ తెలిసిందే. మరి ఈ మాత్రానికే రాష్ట్రమంతా మారుమోగిపోయేలా నారాయణ అక్రమాలు, పేపర్ లీకేజీలు అని ఎలివేషన్లు ఎందుకు. 

కేవలం ఈ కేసులో టార్గెట్ నారాయణేనా..? మిగతా విద్యాసంస్థల విషయం కూడా ప్రస్తావనకు వచ్చినప్పుడు.. అటు కూడా అరెస్ట్ లు ఉండాలి కదా. కొండను తవ్విన అధికారులు నిజంగా ఎలుకను కూడా పట్టుకోలేకపోయారనే అపప్రధ అసలెందుకు..?

ప్రజలకు ఏమని సమాధానం చెబుతారు..?

పేపర్ లీకేజీకి ప్రయత్నించినవారు అరెస్ట్ అయ్యారు. అక్కడితో కేసు క్లోజ్ అయిపోయినట్టేనా..? కనీసం ఆ విద్యాసంస్థలపై చర్యలుంటాయా లేదా..? వచ్చే ఏడాది తమ పిల్లలను నారాయణ స్కూల్ లో కొనసాగించాలంటేనే భయపడిపోతున్న తల్లిదండ్రులకు భరోసా ఇచ్చేది ఎవరు..? నారాయణ అరెస్ట్ తోనే ఏదో అయిపోయినట్టు బిల్డప్ ఇచ్చిన అధికారులు, ఆయనకు బెయిల్ రాగానే నీరసపడిపోయారు. 

ప్రభుత్వం కూడా ఇతర వ్యాపకాల్లో పడిపోయింది. యథావిధిగా వచ్చే ఏడాది నారాయణ అడ్మిషన్ల హడావిడి ఉంటుంది. ఈ వ్యవస్థని మార్చాలన్నా, మార్చే ప్రయత్నం చేయాలన్నా.. ఎందుకోమరి ఎవరికీ సాధ్యం కావట్లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?