కేఏ పాల్ వచ్చారంటే ఎన్నికల ఫీవర్ వచ్చేసినట్టే!

సరిగ్గా ఎన్నికల ముందు ప్రత్యక్షం అవుతారు కేఏ పాల్. హడావుడి చేస్తారు, కామెడీ చేస్తారు, తనదైన విశ్లేషణలు చేస్తారు. ఎన్నికలు అయిన వెంటనే ఎంచక్కా తిరిగి వెళ్లిపోతారు. ఏపీ, తెలంగాణ ఎన్నికలే కాదు, అమెరికా…

సరిగ్గా ఎన్నికల ముందు ప్రత్యక్షం అవుతారు కేఏ పాల్. హడావుడి చేస్తారు, కామెడీ చేస్తారు, తనదైన విశ్లేషణలు చేస్తారు. ఎన్నికలు అయిన వెంటనే ఎంచక్కా తిరిగి వెళ్లిపోతారు. ఏపీ, తెలంగాణ ఎన్నికలే కాదు, అమెరికా ఎన్నికల సమయంలో కూడా ఆయన ఇలాగే చేస్తారు. ఆయన సీన్ లోకి వచ్చారంటే ఎన్నికల ఫీవర్ మొదలైందని అర్థం చేసుకోవాలి. 

ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోకి కేఏ పాల్ ఎంటరయ్యారు. అంటే అక్కడ ఎన్నికల వేడి మొదలైందని అర్థం. రేపోమాపో ఆయన ఏపీ రాజకీయాల్లోకి కూడా మరోసారి అడుగుపెడతారు. ఇప్పటికే పవన్ పై ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నారు. పాల్ హడావుడి ఈ రెండేళ్లు ఉంటుంది.

బీజేపీ బినామీయేనా..?

ఈమధ్య తెలంగాణపై ఫోకస్ పెంచిన బీజేపీ.. అక్కడ రకరకాల బీ-టీమ్ లను రెడీ చేస్తోంది. అందులో ఒకటి పాల్ టీమ్. పాల్ నోరేసుకుని టీఆర్ఎస్ పై పడిపోవడం, టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనపై దాడి చేయడం, ఆ తర్వాత పంచాయితీ ఢిల్లీకి వెళ్లడం, అమిత్ షా ని కలిసిన పాల్.. ప్రెస్ మీట్ పెట్టడం, తెలంగాణలో హైదరాబాద్ లోక్ సభ స్థానం మినహా మిగిలిన అన్ని స్థానాల్లో ప్రజాశాంతి అభ్యర్థులు నిలబడతారని ప్రగల్భాలు పలకడం.. ఇలా అన్నీ ఓ ప్లాన్ ప్రకారం జరిగిపోయాయి.

కట్ చేస్తే.. నేను బీజేపీ బినామీని కాదు అని పాల్ క్లారిటీ ఇచ్చుకున్నారు కూడా. కానీ తెలంగాణలో క్రిస్టియన్ ఓట్లు చీల్చడం కోసమే పాల్ తో యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.

2019 ఏపీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు.. వైసీపీ అభ్యర్థుల పేర్లను తలపించాయి. దాదాపు దగ్గర దగ్గరగా ఉండేవి. దాన్ని బట్టి ఆయన ఎవరి బినామీ, ఎవరు చెబితే ఆయా పేర్లున్న అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారనే విషయం అర్థమైపోయింది. 

ఇప్పుడు 2024 టార్గెట్ గా ఆయన ముందుగా రంగంలోకి దిగుతున్నారు. నేరుగా జగన్ ని టార్గెట్ చేస్తే ఏపీలో వర్కవుట్ కాదని తెలుసుకుని, పవన్ కల్యాణ్ ని గిల్లుతున్నారు. పవన్ ని తనతో కలసి రమ్మని చెప్పే పాల్, అదే సమయంలో ఆయనపై విమర్శలు కూడా చేస్తుంటారు.

ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు సీన్ లోకి ఎంట్రీ ఇచ్చే పాల్… తెలంగాణలో తన పని మొదలు పెట్టారు. ఏపీలో కూడా మెల్లగా కాలు పెడతారు. ప్రజాశాంతి పార్టీకి ఫండ్ ఇచ్చి టికెట్ తెచ్చుకోగలిగితే ఆ తర్వాత ప్రచారం కోసం కోట్లు తిరిగిస్తారని గతంలో చాలామందిని మోసం చేశారు. ఈ ప్రచారం తనది కాదు అని పాల్ చెప్పుకోవచ్చు కానీ.. మోసపోయినోళ్లు మాత్రం లబోదిబోమంటున్నారు.

కేవలం టికెట్ల కేటాయింపు వరకే పాల్ యమా బిజీగా ఉంటారు, ఆ తర్వాత మాయమైపోతారు. మళ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వచ్చి, తనకు అన్యాయం జరిగింది, మోసం చేశారని, తన అభ్యర్థుల్ని బెదిరించారని చెప్పుకొస్తారు. ఇదంతా రొటీన్ గా జరుగుతున్న వ్యవహారం. ఆ సీజన్ ఇప్పుడు మళ్లీ స్టార్ట్ అయింది, ఆ ఎపిసోడ్ మళ్లీ మొదలైంది.