కాస్కో నా రాజా అనే రేంజ్‌లో మంత్రి బొత్స సత్యనారాయణకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సవాల్ విసిరారు. పోరాడితే పోయే దేం లేదు బానిస సంకెళ్లు తప్ప అనే కమ్యూనిస్టుల స్ఫూర్తిని సోము వీర్రాజు ఆదర్శంగా తీసుకున్నట్టున్నారు. ఆ అంటే ఏపీ సర్కార్‌కు సవాల్ విసురుతూ తాము జగన్‌కు బద్ద వ్యతిరేకులుగా చాటి చెప్పుకోవాలని తపన పడుతున్నారు.
ఇవాళ సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అదంతా బీజేపీ ఘనతగా చెప్పుకొచ్చారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరిగిందని, జరుగుతోందన్నారు. ఏపీ అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని ఆయన సవాల్ విసరడం విశేషం. ఏపీలో వైసీపీ సర్కార్ చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు.
దోపిడీ ప్రభుత్వమని ఏపీ సర్కార్‌పై మండిపడ్డారు. రేషన్ బియ్యంలో ఏపీ రూ.2 పెడితే.. కేంద్రం వాటా రూ.30 అని తెలిపారు. రేషన్ పంపిణీ వాహనాలపై జగన్ ఫొటో ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల 40 ఏళ్ల కల విశాఖ రైల్వే జోన్ అని వీర్రాజు చెప్పారు. విశాఖ రైల్వే జోన్ కలను మోదీ సర్కార్ నెరవేర్చినట్టు సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.
మోదీ సర్కార్ ఘనత గురించి సోము వీర్రాజు చెప్పనవి మనం తెలుసుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేస్తున్న ఘనత కూడా మోదీ సర్కార్‌దే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని ఘనత కూడా కేంద్ర ప్రభుత్వానిదే. ఏపీకి గుండెకాయ లాంటి పోలవరం భారీ ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధులు ఇవ్వని ఖ్యాతి కూడా మోదీ నేతృత్వంలోని సర్కార్‌కే దక్కుతుంది.
సోము వీర్రాజు గారు ఈ ఘనత బీజేపీది కాదని సవాల్ విసిరే దమ్ము, ధైర్యం మీకున్నాయా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.