ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు చేసేందుకు నారా లోకేశ్ సిద్ధంగా ఉంటారు. తన మదిలో మొలిచిన ప్రశ్నలే అద్భుతమని భావించి, ఆయన సంధిస్తుంటారు. జగన్‌పై, ఏపీ సర్కార్‌పై విమర్శలు చేయందే అయనకు పొద్దు గడవదు మరి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ పర్యటనపై తన మార్క్ ప్రశ్నల్ని లోకేశ్ విసరడం గమనార్హం. ఇదే సందర్భంలో లోకేశ్‌కు నెటిజన్లు ప్రశ్నలు విసురుతున్నారు.
ఏపీ రాజధాని ఏదంటే దావోస్‌లో జగన్ ఏమని సమాధానం ఇస్తారని లోకేశ్ ప్రశ్నించారు. అలాగే ఏపీలో పీపీఏలను ఎందుకు రద్దు చేశారంటే సమాధానం ఏం చెబుతారని లోకేశ్ నిలదీశారు. దావోస్‌లో వైసీపీ నేతల మీటింగ్ జరుగుతున్నట్టుందే తప్ప, పెట్టుబడుల కోసం జగన్ వెళ్లినట్టు లేదని తప్పు పట్టారు. గత 24 గంటల్లో జగన్ కలిసిన ఏకైక పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మాత్రమే అని, ఆయన్ను కలవడానికి ఢిల్లీ వెళితే సరిపోతుందని లోకేశ్ వెటకరించారు.
లోకేశ్ ప్రశ్నలపై నెటిజన్లు సెటైర్స్ విసరడాన్ని గమనించొచ్చు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని ఎందుకు గద్దె దించావని వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ప్రశ్నిస్తే జగన్ ఏం సమాధానం చెబుతారని నెటిజన్లు ప్రశ్నించారు. అలాగే మంగళగిరిలో నాడు మంత్రి హోదాలో పోటీ చేసిన లోకేశ్‌ను ఓడించడానికి మనసెలా వచ్చిందని జగన్‌ను ప్రశ్నిస్తే ఏం సమాధానం చెబుతారనే కామెంట్స్ ప్రత్యక్షమయ్యాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని నామరూపాలు లేకుండా ఎలా చేశారని దావోస్‌లో ఎవరైనా ప్రశ్నిస్తే జగన్ ఏం సమాధానం చెబుతారని నెటిజన్లు తమదైన సృజనాత్మకతను జోడించి ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు చెప్పడం జగన్‌కు కష్టమే. జగన్‌కు దావోస్‌లో పెద్ద కష్టం వచ్చిందే అని లోకేశ్ ప్రశ్నలకు సోషల్ మీడియాలో వ్యంగ్య కౌంటర్లు ఇవ్వడం విశేషం.