జ‌రిగే ప‌నేనా చంద్రికా?

శ్రీ‌లంక మునిగిపోయింది. ఆయిల్ కొన‌డానికి డ‌బ్బులు లేని ఏ దేశ‌మైనా మునిగిపోయిన‌ట్టే. ఈ అధ్వాన్న‌మైన ప‌రిస్థితుల్లో మాజీ అధ్య‌క్షురాలు చంద్రికా బండారునాయ‌కే ఒక ప్ర‌తిపాద‌న చేశారు. ప్ర‌భుత్వానికి స‌మాంత‌రంగా జాతీయ మండ‌లి (కౌన్సిల్ ఆఫ్…

శ్రీ‌లంక మునిగిపోయింది. ఆయిల్ కొన‌డానికి డ‌బ్బులు లేని ఏ దేశ‌మైనా మునిగిపోయిన‌ట్టే. ఈ అధ్వాన్న‌మైన ప‌రిస్థితుల్లో మాజీ అధ్య‌క్షురాలు చంద్రికా బండారునాయ‌కే ఒక ప్ర‌తిపాద‌న చేశారు. ప్ర‌భుత్వానికి స‌మాంత‌రంగా జాతీయ మండ‌లి (కౌన్సిల్ ఆఫ్ స్టేట్‌) ఏర్పాటు చేసి దేశాన్ని చ‌క్క‌దిద్దాల‌ని సారాంశం. 

ఈ మండ‌లిలో 36 మంది వుంటారు. ప‌ద‌వీ కాలం ఐదేళ్లు. తొమ్మిది మంది మాత్ర‌మే రాజ‌కీయ నాయ‌కులు, మిగిలిన 27 మంది వేర్వేరు రంగాల‌కు చెందిన నిపుణులు, మేధావులు. స‌మాజంలోని ఒక విశిష్ట‌ వ్య‌క్తి దీనికి అధ్య‌క్షుడు. ఈ కౌన్సిల్ చ‌ట్టాల‌ను స‌మీక్షించి, మార్పుల్ని సూచిస్తుంది. సొంతంగా చ‌ట్టాల‌ను ప్ర‌తిపాదిస్తుంది.

విన‌డానికి బానే వుంది కానీ, ఈ స‌భ్యుల్ని ఎవ‌రు నియ‌మించాలి? ప్ర‌భుత్వ‌మే క‌దా? అంటే మ‌ళ్లీ రాజ‌కీయ నాయ‌కులే నిర్ణ‌యాలు తీసుకుంటారు. వీళ్లేం చేస్తారు? త‌మ‌కు అనుకూల‌మైన వాళ్ల‌ని నియ‌మిస్తారు. క‌థ మ‌ళ్లీ మొద‌టికే.

మ‌న‌కి కూడా రాజ్య‌సభ వుంది, రాష్ట్రాల్లో కౌన్సిళ్లు ఉన్నాయి. ఈ స‌భ‌ల్లో మేధావులు వుంటార‌ని, అర్థ‌వంత‌మైన చ‌ర్చ జ‌రిపి ప్ర‌భుత్వాల్ని స‌క్ర‌మంగా న‌డుపుతార‌ని రాజ్యాంగ నిపుణులు ఆశ‌ప‌డ్డారు.

డ‌బ్బులుంటే రాజ్య‌స‌భ‌ను కొనుక్కోవ‌చ్చు. దాని నిండా వ్యాపారులు, ప్ర‌జ‌ల్లో నిల‌బ‌డి వార్డు స‌భ్యులుగా గెల‌వ‌లేని వాళ్లున్నారు. సినిమా రంగానికి చెందిన ఎంద‌రో క‌ళాకారులు రాజ్య‌స‌భ‌కి నామినేట్ అయ్యారు. వాళ్ల‌లో ఎంత మంది చ‌ర్చ‌లు జ‌రిపారు, ఎన్నిసార్లు స‌భ‌లో మాట్లాడారో ఎవ‌రికైనా గుర్తుందా?

యూనివ‌ర్సిటీ వైస్‌ఛాన్స‌ల‌ర్లు కూడా రాజ‌కీయ సిఫార్సుల‌తో నియ‌మితుల‌వుతున్న‌ప్పుడు రాజ‌కీయాల‌తో సంబంధం లేని మేధావులు ఎక్క‌డి నుంచి వ‌స్తారు?

చంద్రిక ఆశ త‌ప్ప ఒరిగేదేమీ లేదు. ఒక‌వేళ కౌన్సిల్ ఏర్పాటైనా దాన్ని సొంతంగా ప‌ని చేయ‌నివ్వ‌రు. అధ్య‌క్షుడి ఆదేశాల‌ను పాటించాల్సిందే. జ‌నంపైన అన‌వ‌స‌ర ఖ‌ర్చు.

పాల‌కులు ఎవ‌రి స‌ల‌హాలు విన‌రు. అనుకున్న‌దే చేస్తారు.

జీఆర్ మ‌హ‌ర్షి