అవును ఇదొక పెద్ద ధర్మసందేహం. ఒక స్టార్ హీరోకు అనల్పమైన సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నప్పుడు.. ఆ ఫ్యాన్స్ మీద.. ఆ స్టార్ హీరో యొక్క మాటల ప్రభావం ఉంటుందా? లేదా? స్టార్ హీరో నేరుగా చెప్పినా చెప్పకపోయినా.. ఆయన మనసులో ఉన్న మాటను గ్రహించి ఆ ఫ్యాన్స్ నడుచుకుంటారా లేదా? అలా కాకుండా, స్టార్ హీరో కు తాము పేరుకు ఫ్యాన్స్ మాత్రమే గానీ.. ఆయన ఇష్టాేనికి వ్యతిరేకంగా.. తమకు నచ్చిన రీతిలో తాము, తమ ప్రయోజనాలు తాము చూసుకుంటూ చెలరేగిపోతామని వారు రెచ్చిపోతుంటారా? …ఈ సందేహాలన్నీ కలిపి పెద్ద ధర్మసందేహం.
ఈ సందేహం ఎవరి గురించో పుట్టినదైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి గురించి కలుగుతున్న సందేహం ఇది. మెగా ఫ్యాన్స్ అందరూ బెజవాడలో పెద్ద సమావేశం పెట్టుకుని.. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా.. జనసేన పార్టీకి మద్దతివ్వాలని, జనసేనాని పవన్ కల్యాణ్ వెంట ఉండాలని, ఆయనను వచ్చే ఎన్నికల్లో సీఎం చేయడానికి పాటుపడాలని ఒక నిర్ణయం తీసుకున్నారు.
మెగా ఫ్యాన్స్ అనగా, మెగాస్టార్ చిరంజీవి, నాగేంద్రబాబు, పవన్ కల్యాణ్, రాంచరణ్ ఫ్యాన్స్ మాత్రమే అన్నమాట. విజయవాడలో జరిగిన ఆత్మీయ సమావేశం అనే మీటింగు బ్యానర్ లో ఈ నలుగురి ఫోటోలు మాత్రమే ఉన్నాయి. సమావేశం అయ్యాక.. అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం అద్యక్షుడు స్వామినాయుడు మీడియాకు ఈ వివరాలు చెప్పారు.
ఇంతకూ తన ఫ్యాన్స్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి మెగాస్టార్‌కు సమాచారం ఉందా? లేదా? అనేది సందేహం. చిరంజీవి ఏమో.. ముఖ్యమంత్రి జగన్ తో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ.. ఆయన ప్రాపకం కోసం పాకులాడుతూ, ఆయనకు చేతులెత్తి మొక్కుతూ ఆయనను పలువేదికల మీద ప్రశంసిస్తూ.. తన సినిమాలకు టికెట్ ధరలు పెంచుకోడానికి ఆరాటపడుతుంటారు. ఆయన ఫ్యాన్స్ మాత్రం.. బాసు సినిమా ఫ్లాప్ అయిపోగానే.. తమంత తాము జగన్ ను ఓడించడానికి, జగన్ ను తిట్టిపోస్తున్న పవన్ ను ముఖ్యమంత్రి చేయడానికి పనిచేస్తామని చెబుతుంటారు? ఏమిటిదంతా?
చిరంజీవి ఫ్యాన్స్ గా ఉన్నవారు.. ఆ మాత్రం తమ మెగాస్టార్ మనోగతాన్ని అర్థం చేసుకోలేరా? పవన్ కల్యాణ్ తన ప్రసంగాల్లో చిరంజీవిని కూడా వెటకారం చేయడం, తిట్టడం వారికి తెలియదా? చిరు గురించి పవన్ అవమానకరంగా మాట్లాడుతున్నా కూడా.. వారు పవన్ కే జై కొడతారా? ఫ్యాన్స్ అంటే ఇంతేనా? లేక, ఫ్యాన్స్ తన తమ్ముడి వెంట నడవడానికి.. మెగాస్టార్ రహస్య ఆశీస్సులు కూడా ఉన్నాయా? అనేది ప్రజల్లో అనుమానం.
మెగాస్టార్ , జగన్ ప్రభుత్వంతో సత్సంబంధాలతో కెరీర్ ను నిమ్మళంగా లాగిస్తున్నారు. ఫ్యాన్స్ ఇలాంటి పనిచేసి, జగన్ ను తిడుతూ, పవన్ ను నెత్తిన పెట్టుకుంటే.. చిరంజీవి పుట్టి మునుగుతుందేమో అని పలువురు సందేహిస్తున్నారు.