ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ నాయుడి పెత్త‌న‌మా?

చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు టీడీపీలో వ‌ర్గ‌పోరు ప‌తాక‌స్థాయికి చేరింది. జీడీనెల్లూరు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డి నుంచి వైసీపీ త‌ర‌పున మంత్రి నారాయ‌ణ‌స్వామి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన మాజీ మంత్రి…

చిత్తూరు జిల్లా జీడీనెల్లూరు టీడీపీలో వ‌ర్గ‌పోరు ప‌తాక‌స్థాయికి చేరింది. జీడీనెల్లూరు ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం. ఇక్క‌డి నుంచి వైసీపీ త‌ర‌పున మంత్రి నారాయ‌ణ‌స్వామి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. టీడీపీ త‌ర‌పున పోటీ చేసిన మాజీ మంత్రి గుమ్మ‌డి కుతూహ‌ల‌మ్మ కుమారుడు హ‌రికృష్ణ ఓడిపోయారు. ఆ త‌ర్వాత రాజ‌కీయంగా సైలెంట్ అయ్యారు. గ‌త ఏడాది త‌ల్లీకుమారుడు టీడీపీ నుంచి నిష్క్ర‌మించారు.

జీడీనెల్లూరు టీడీపీ ఇన్‌చార్జ్‌గా భీమినేని చిట్టిబాబు నాయుడిని నియ‌మించారు. దీన్ని ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని టీడీపీ ఎస్సీలు జీర్ణించుకోలేకున్నారు. తాజాగా టీడీపీలో అంత‌ర్గ‌త విభేదాలు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న పుణ్య‌మా అని బ‌జారున ప‌డ్డాయి. 

బాదుడేబాదుడు కార్య‌క్ర‌మంలో భాగంగా శుక్ర‌వారం సాయంత్రం చంద్ర‌బాబు జీడీనెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని కార్వేటిన‌గ‌రం వెళ్ల‌నున్నారు. చంద్ర‌బాబుకు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతూ టీడీపీ ద‌ళిత నాయ‌కుడు డాక్ట‌ర్ ప‌చ్చికాప‌ల్లం ర‌వికుమార్ కార్వేటిన‌గ‌రంలో క‌టౌట్లు, బ్యాన‌ర్లు క‌ట్టారు.

శుక్ర‌వారం తెల్ల‌వారుజామున వీటిని చించేయ‌డంతో టీడీపీలో వ‌ర్గ‌విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గంలో చిట్టిబాబు నాయుడు పెత్త‌నం ఏంట‌ని డాక్ట‌ర్ ర‌వికుమార్ ప్ర‌శ్నిస్తున్నారు. జీడీనెల్లూరులో తాను దీటైన నాయ‌కుడిగా ఎదుగుతుండ‌డాన్ని జీర్ణించుకోలేక పార్టీలోనే కొంద‌రు ఏకంగా చంద్ర‌బాబు నిలువెత్తు ఫొటోలున్న క‌టౌట్లు, బ్యాన‌ర్లు చింప‌డానికి కూడా వెనుకాడ‌లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

ఇవాళ సాయంత్రం చంద్ర‌బాబు ఎదుటే జీడీనెల్లూరు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ విష‌య‌మై తాడోపేడో తేల్చుకుంటామ‌ని డాక్ట‌ర్ ర‌వికుమార్ అనుచ‌రులు హెచ్చ‌రిస్తున్నారు. ఇదిలా వుండ‌గా డాక్ట‌ర్ ర‌వికుమార్‌కు అంత సీన్‌లేద‌ని, ఆయ‌న ప్లెక్సీల లీడ‌ర్ అని, బ‌ల‌మైన ద‌ళిత నాయ‌కుడిని నిల‌బెడుతామ‌ని భీమినేని చిట్టిబాబు నాయుడు అంటున్నారు. 

కులం పేరుతో డాక్ట‌ర్ ర‌వికుమార్ రెచ్చ‌గొట్టే రాజ‌కీయాల‌కు తెరలేపార‌ని, ఇవాళ చంద్ర‌బాబు ఎదుటే అత‌ని క‌థేంటో తేలుస్తామ‌ని చిట్టిబాబు అనుచ‌రులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న ఆందోళ‌న రేకెత్తిస్తోంది.