వరసబెట్టి గత మూడు రోజులుగా వంద దాటి కరోనా కేసులు విశాఖలో నమోదు అవుతున్నాయి. ఇప్పటిదాకా పాతిక యాభై వద్దకే నంబర్ కదలాడుతూ వచ్చిన కరొనా కేసులు మూడు రోజులుగా ఒక్కసారి జోరు చేశాయి. అలా ఏకంగా నంబర్ సెంచరీ దాటేసింది. అది లగాయితూ ప్రతీ రోజూ వందకు వంద అని పెంచుకుంటూ పోతోంది.
విశాఖలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోందా అని వైద్య ఆరొగ్య వర్గాలు కూడా కలవర పడే పరిస్థితి ఇది. నిజానికి చూస్తే గత ఏడాది తరువాత వందలోపే రోజు వారీ కేసులు ఉన్నాయి.
రెండు నెలల ముందు దాకా చూస్తే పదుల లోపు కేసులు నమోదు అయ్యాయి. ఒక దశలో జీరో నంబర్ కూడా నమోదుకు దగ్గరలో ఉన్నామని ధీమా పడే పరిస్థితి. ఇక కరోనా నుంచి ఊరట కలిగింది. ఆ మహమ్మారీ లేదు రాదు అని అంతా నిబ్బరంగా ఉన్న నేపధ్యంలో డబుల్ డిజిట్ నంబర్ కొనసాగిస్తూ ఇపుడు సెంచరీకి ఎక్కడా తగ్గనంటోంది.
దీంతో విశాఖవాసులకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాలలో మాస్కులు పెట్టుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు. అలాగే కరోనా ప్రోటోకాల్ ని అందరూ గుర్తు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమవుతోంది అంటున్నారు.