ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిత్యం జపించే దుష్టచతుష్టయానికి వైసీపీ ప్లీనరీలో ప్రాధాన్యం కల్పించారు. గతంలో ఏ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో చేయని రీతిలో … ఏపీ అధికార పార్టీ ప్రస్తుతం నిర్వహించనున్న సమావేశాల్లో మీడియాపై కీలక తీర్మానం చేయనున్నారు. ఈ మేరకు వైసీపీ తీర్మానాలకు సంబంధించిన వివరాల్లో ఎల్లో మీడియాకు స్థానం దక్కడం గమనార్హం.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా మూడో ప్లీనరీ జరుపుకోనున్నారు. ప్లీనరీ వేదిక వద్దకు జనాలు పెద్ద ఎత్తున వెళుతున్నారు. ఇడుపులపాయలో తండ్రి వైఎస్సార్‌కు నివాళులర్పించిన అనంతరం ప్లీనరీకి జగన్ బయల్దేరారు. ఇదిలా వుండగా ప్లీనరీలో ప్రవేశ పెట్టనున్న తీర్మానాల గురించి వైసీపీ ముందే ప్రకటించింది.
మహిళా సాధికారత –దిశ చట్టం, విద్య, నవరత్నాలు –డీబీటీ, వైద్యం, పరిపాలన –పారదర్శకతలపై మొదటి రోజు చర్చించి తీర్మానాలు ప్రవేశ పెడతారు. రెండో రోజు సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు – ఎంఎస్‌ఎంఈలు – ప్రోత్సాహకాలు, ఎల్లో మీడియా – దుష్టచుతుష్టయంపై చర్చించి తీర్మానాలను ఆమోదిస్తారు. ఎల్లో మీడియాను ఇటీవల కాలంలో జగన్ దుష్టచతుష్టయంగా అభివర్ణిస్తున్న సంగతి తెలిసిందే.
ప్లీనరీలో ఏకంగా దుష్టచతుష్టయంపై చర్చించి, ఆమోదించాలని నిర్ణయించడం చర్చనీయాంశమైంది. జగన్‌పై ఎల్లో మీడియా దుష్ప్రచారం పతాక స్థాయికి చేరింది. బహుశా దేశంలో జగన్‌లా ఏ నాయకుడు కూడా మీడియా టార్గెట్‌కు గురై వుండరేమో! జగన్ లేచినా, నిలిచినా, ఏం చేసినా నెగెటివ్ కోణంలో వార్తా కథనాలు వండివార్చుతున్నారు.
అందుకే జగన్ కూడా అదే స్థాయిలో ఎదురు దాడికి దిగే క్రమంలో దానిపై ప్లీనరీలో చర్చించాలని నిర్ణయించుకున్నట్టున్నారు. కానీ మంచో చెడో దుష్టచతుష్టయానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ మాత్రం జరుగుతోంది.