దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇవాళ (శుక్రవారం), రేపు (శనివారం) వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందుకు నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో వేదిక సిద్ధమైంది. 2017లో రెండో ప్లీనరీ నిర్వహించిన చోటే మూడోది కూడా జరపాలని నిర్ణయించడం విశేషం. ప్లీనరీ ప్రాంగణానికి వైఎస్సార్ పేరు పెట్టారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న మొదటి ప్లీనరీ ఇది. మరోసారి అధికారంలోకి రావడానికి పార్టీ శ్రేణుల్ని సమరానికి సన్నద్ధం చేయడానికి నిర్వహిస్తున్న ప్లీనరీ. అందుకే ఈ ప్లీనరీకి ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది.
వైఎస్సార్సీపీ ప్లీనరీని మరికొన్ని గంటల్లో జరుపుకోనున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వం, విశిష్టతల గురించి చెప్పుకుందాం. వైఎస్సార్సీపీ అంటే వైఎస్ జగనే. వైఎస్ జగన్ అంటే వైఎస్సార్సీపీ. ప్రజాస్వామ్యం గురించి అమెరికా అధ్యక్షుడు దివంగత అబ్రహం లింకన్ నిర్వచించిన సూత్రాన్ని వైఎస్సార్సీపీకి వర్తింపచేయొచ్చు. అబ్రహం లింకన్ దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కొరకు నిర్వహించే ప్రభుత్వం. వైఎస్సార్సీపీ అంటే వైఎస్ జగన్ యొక్క, జగన్ చేత, జగన్ కోసం ఏర్పాటైన ప్రాంతీయ పార్టీ.
ఏ ప్రాంతీయ పార్టీలోనైనా వ్యక్తిస్వామ్యం రాజ్యమేలుతుంది. అయితే వైఎస్సార్సీపీ ఇందుకు మరింత ప్రత్యేకం. మన చుట్టూ ఉన్న ప్రాంతీయ పార్టీల ఆవిర్భావాలను పరిశీలిస్తే… ఏదో ఒక బలమైన కారణం, సామాజిక, రాజకీయ నేపథ్యం కనిపిస్తుంది. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత, తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంపై టీడీపీ ఆవిర్భవించింది. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్ఎస్, తమిళనాడులో ద్రావిడ ఉద్యమ నేపథ్యంలో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు ఆవిర్భవించాయి.
కానీ వైఎస్సార్సీపీ ఆవిర్భావం ఒక విచిత్ర పరిస్థితిలో జరిగిపోయింది. వైఎస్ రాజశేఖరరెడ్డి అనే వ్యక్తి మరణం వైఎస్సార్సీపీ అనే బలమైన ప్రాంతీయ పార్టీ ప్రాణం పోసుకోడానికి కారణమైంది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడి వ్యక్తిగత రాజకీయ ఎజెండానే వైఎస్సార్సీపీ పుట్టుకకు కారణమైంది. ఇందులో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలు ముడిపడి లేవు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్పాటు ఉద్యమాలు ఎంత మాత్రం కారణం కాదు. కాంగ్రెస్, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు చేయాలన్న తలంపు నుంచి వైఎస్సార్సీపీ పుట్టలేదు.
జాతీయ పార్టీ కాంగ్రెస్‌లో కొనసాగితే తన రాజకీయ ఎదుగుదలకు అడ్డంకి అని భావించి, తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి జనంలో ఉన్న చరిష్మాను క్యాష్ చేసుకునే క్రమంలో వైఎస్ జగన్ కొత్త పార్టీని స్థాపించారు. ఇది పూర్తిగా తన సొంత నిర్ణయం. పార్టీని స్థాపించడం మొదలు, అంచెలంచెలుగా బలోపేతం చేసుకోవడం వెనుక వైఎస్ జగన్ కృషి, పట్టుదల, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా మొక్కవోని దీక్ష ఉన్నాయి.
ఇదే వైఎస్సార్సీపీ విశిష్టత. తండ్రి రాజకీయ వారసత్వాన్ని మాత్రమే జగన్ తీసుకున్నారు. షర్మిలను పక్కన పెట్టడం ద్వారా తనయుడిగా వైఎస్సార్ రాజకీయ వారసత్వంపై తనకే పూర్తి హక్కులున్నాయని లోకానికి చాటి చెప్పారు. సంప్రదాయ రాజకీయ అభిప్రాయాలున్న వారికి మాత్రమే జగన్‌తో ఇబ్బంది. జగన్ మనస్తత్వాన్ని గుర్తించి, అందుకు తగ్గట్టు నడుచుకుంటున్న వారికి ఆయనతో ఎలాంటి సమస్య లేదు.
జగన్‌కు సెంటిమెంట్లు లేవని మొట్టమొదట ఎవరైనా గుర్తించాల్సిన ప్రధాన అంశం. అందుకే చెల్లి షర్మిల, తల్లి విజయమ్మ రాజకీయంగా దూరమయ్యారనే ప్రచారం జరుగుతున్నా ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. భవిష్యత్‌లో పట్టించుకోరు కూడా. తన గురించి సమాజం ఏమనుకుంటున్నదో జగన్‌కు అనవసరం. మంచైనా, చెడైనా సమాజమైనా, మరేదైనా తన వెంట నడిచి తీరాల్సిందే అని జగన్ భావన. అందుకు తగ్గట్లే ఆయన ఆలోచనలు, నిర్ణయాలు వుంటాయి.
ప్రతిపక్ష నాయకుడిగా, ప్రభుత్వాధినేతగా జగన్ తీసుకున్న నిర్ణయాలను గమనిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. అందుకే జగన్ ఎవరికీ అర్థం కారు. అలాగని ఆయన సమాజ గమనాన్ని, గమ్యాన్ని గుర్తించకుండా వెళుతున్నారని ఎవరైనా అనుకుంటే, అది వారి అజ్ఞానమే తప్ప, జగన్‌ది తప్పు కాదు. మొదట్లో జగన్ అభిప్రాయాలు, ఆలోచనల్ని తప్పు పట్టిన వాళ్లు, కాలం గడిచే కొద్ది… ఔను జగనే రైట్ అని ఒప్పుకోక తప్పదు.
ఉదాహరణకు కరోనాపై జగన్ అభిప్రాయాన్నే తీసుకుందాం. కరోనా ఇప్పట్లో పోదని, దాంతో సహజీవనం చేయాల్సిందేనని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. జగన్ అనరాని మాట ఏదో అన్నారని ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ఆ తర్వాత ప్రపంచ ప్రముఖులంతా అదే మాట చెప్పడం మనం వినలేదా? ఇటీవల సినిమా టికెట్ల రేట్లకు సంబంధించి జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. టాలీవుడ్‌ని అణిచివేస్తున్నారని తెగబడి విమర్శలు చేసిన వారిని చూశాం. చివరికి జగనే రైట్, తామే రాంగ్ అని చెంపలు వాయించుకున్న సినీ సెలబ్రిటీలను చూస్తున్నాం.
వైఎస్ జగన్‌కు భవిష్యత్‌పై క్లారిటీ వుంది. ప్రధానంగా జగన్‌పై ఆరోపణ ఏంటంటే… ఎంతన్నా చెప్పండబ్బా, జగన్ వాళ్ల నాన్న మాదిరి కాదు అనే మాట తరచూ వినిపిస్తూ వుంటుంది. ఇది వాస్తవం. తండ్రిలా తాను వుండకూదనేదే జగన్ సిద్ధాంతం. తండ్రి విధేయులు, ఆప్తులు, స్నేహితులెవరూ ఇప్పుడు ఆయన వెంట లేరు. మహా అయితే ఒకరిద్దరు ఉన్నప్పటికీ వారికి జగన్ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. జగన్‌ను వ్యతిరేకించే వారిని అక్కున చేర్చుకోకూడదనేది జగన్ సిద్ధాంతమే అయి వుంటే… పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని దగ్గరికి తీసుకునే వారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్‌రెడ్డికి జగన్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారా?
కాంగ్రెస్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యతిరేక వర్గంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజకీయాలు నడిపారు. ఇప్పుడు అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్సార్సీపీలోనూ, ప్రభుత్వంలోనూ పవర్ఫుల్ లీడర్. ఇది చాలదా జగన్‌ను అర్థం చేసుకోడానికి. తండ్రితో జగన్‌ను పోల్చి తమకు ప్రాధాన్యం ఇవ్వలేదని మదనపడుతుంటే… అది ముమ్మాటికీ వాళ్లదే తప్పు. జగన్‌కు అంతిమంగా తన ప్రయోజనాలే ముఖ్యం. తండ్రైనా, తల్లైనా, చెల్లైనా తన ప్రయోజనాలను కాపాడుతారని భావిస్తేనే, వారికి ప్రాధాన్యం, విలువ వుంటాయి. లేదంటే నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టడానికి జగన్ వెనుకాడరు
ఇందుకు నిలువెత్తు ఉదాహరణ చెప్పుకుందాం. గత ఏడాది వైఎస్ విజయమ్మ తన భర్త వైఎస్సార్ కేబినెట్లో పని చేసిన వాళ్లు, ఆయనతో రాజకీయంగా నడిచిన వాళ్లు, స్నేహితులతో హైదరాబాద్‌లో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వైఎస్ జగన్ వెళ్లకపోవడంతో పాటు తన పార్టీలోని ఏ ఒక్కర్నీ పంపకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ సమావేశానికి వెళ్లని వారంతా వైఎస్సార్‌పై అభిమానం లేదనుకోవాలా? ప్రయోజనాలే అన్నింటిని నియంత్రిస్తాయి. చివరికి తండ్రి పేరుతో తల్లి నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి కూడా స్వయంగా తానే పోలేని, అలాగే వెళ్లొద్దని నియంత్రించడం వెనుక రాజకీయ లాభనష్టాలే కారణమని జగన్‌కు తెలియదా?
వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం అంత ఈజీగా జరగలేదు. ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయి. అన్నింటిని తట్టుకుని, గట్టిగా నిలబడడం వల్లే ఈవేళ జగన్ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు టీడీపీలోకి ఫిరాయించినా జగన్ చెక్కుచెదరలేదు. మరింత ఆత్మవిశ్వాసంతో పాదయాత్రగా జనంలోకి వెళ్లారు. “నేను విన్నాను, నేను ఉన్నాను” అంటూ జనానికి భరోసా కల్పించారు. నాయకుల్ని కాదు, జనాన్ని నమ్ముకోవాలనేది జగన్ సిద్ధాంతం. ప్రతిపక్ష నేతగానే కాదు, ప్రభుత్వాధినేతగా కూడా అదే నమ్ముకున్నారు.
అందుకే గడపగడపకూ వెళ్లాలని తన ఎమ్మెల్యేలను జగన్ ఆదేశించారు. ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే జనంలోకి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వెళ్లడం ఆశ్చర్యమే. తనకు ముఖ్యమంత్రి పదవి కావాలి, అది ప్రజల చేతల్లో వుంది. ఎవరూ ఏదీ ఊరికే ఇవ్వరని జగన్ గ్రహించారు. జనానికి కావాల్సింది ఇస్తే, వాళ్లు తనకు కావాల్సింది ఇస్తారని నమ్మారు. 2019లో ఇది వర్కౌట్ అయ్యింది. 2024లో కూడా తన నమ్మకాన్ని జనం నిలబెడతారని జగన్ విశ్వసిస్తున్నారు. అందుకే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులొచ్చినా నవరత్నాల సంక్షేమ పథకాలను మాత్రం పక్కాగా అమలు చేస్తున్నారు.
ఇక జగన్ ప్రభుత్వంపై విమర్శలంటారా? తక్కువగా ఏం లేవు. ఉదాహరణకు కమలాపురం నియోజకవర్గంలో మా గ్రామం వుంటుంది. సర్వరాయసాగర్‌కు ఏడు కిలోమీటర్ల దూరంలో మా పొలాలుంటాయి. రూ.300 కోట్లు ఖర్చు చేస్తే కమలాపురం నియోజకవర్గంలోని పొలాలకు నీళ్లు ఇచ్చే కాలువలకు మోక్షం కలుగుతుంది. కానీ ఆ పని జరగడం లేదనే అసంతృప్తి నాలాంటి ఎంతో మందిలో ఉంది. వైఎస్సార్ సర్వరాయసాగర్ ప్రాజెక్ట్ నిర్మిస్తే, ఆయన కుమారుడు కనీసం కాలువలు తవ్వి నీళ్లు ఇవ్వలేదనే ఆగ్రహం ఉంది. మా ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డిని తిట్టుకోని రోజు లేదు. కానీ ఏం లాభం?
ఈ సందర్భంగా గాయం సినిమాలోని సిరివెన్నెల పాట గుర్తుకొస్తోంది.
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం
గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం
పాత రాతి గుహలు పాల రాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా
బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండ
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్య కాండ
జనంపై జగన్‌కు ఎందుకంత నమ్మకమో అర్థం చేసుకోవాలంటే ఈ పాట చాలు. ఇప్పటి వరకూ మెజార్టీ జనానికి జగన్‌పై మోజు తీరలేదు. జనానికి సమాజం, సమూహం ప్రయోజనాలు అవసరం లేదు. ప్రతి ఒక్కరిలో వ్యక్తిగత స్వార్థం పెరిగింది. నాకేంటి? అనే భావన పెరిగింది. ఇదే జగన్‌కు శ్రీరామరక్ష. అందుకే ఆయన పదేపదే “నేను విన్నాను, నేను ఉన్నాను” అని భరోసా ఇవ్వడం.
అలాగని మిగిలిన రాజకీయ పక్షాలు సమాజ సేవ చేయడానికి ఉద్భవించిన స్వచ్ఛంద సంస్థలేమీ కాదు. కానీ జగన్‌ను అంచనా వేయడంలోనూ, ఎదుర్కోవడంలోనూ బోల్తా పడ్డాయి. ఇప్పుడు జగన్ అధికార అండతో ప్రతిపక్షాల పాలిట సింహస్వప్నమయ్యాడు. అధికారాన్ని నిలుపుకునే క్రమంలో పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేసేందుకు ప్లీనరీని ఉపయోగించుకోనున్నారు.
జగన్‌ను తక్కువ అంచనా వేస్తే మాత్రం… అదే వారి పతనానికి బాట వేస్తుందని హెచ్చరించేలా ప్లీనరీ జరుగుతుందనేది వాస్తవం. ఎందుకంటే మారుతున్న రాజకీయానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్.
సొదుం రమణ