‘‘మెగాస్టార్ చిరంజీవికి ప్రధాని నరేంద్రమోడీ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారా? ఆ ఆఫర్ గొప్పదే అయినప్పటికీ.. మెగాస్టార్ దానికి సవినంగా నో చెప్పారా? ఆయన ఆఫర్ వద్దనుకున్న తర్వాతే.. ఆ ఆఫర్ మరొకరికి వెళ్లిందా?’’ నిజానిజాలు ఏమో గానీ. టాలీవుడ్, తెలుగు రాజకీయ వర్గాల్లో ఈ కబురు గుప్పుమంటోంది. మెగాస్టార్ చిరంజీవిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపడమే ఆ ఆఫర్! అయితే, అసలు మళ్లీ రాజకీయ వాసనే ఇష్టం లేని చిరంజీవి చాలా మర్యాదగా ఆ ఆఫర్ ను తిరస్కరించారని అనుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవిలో రాజకీయ ఆసక్తి అనేది ముగిసిపోయిన ఎపిసోడ్! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోగలనని ఆయన పార్టీ పెట్టారు. అనుకున్న విజయాలు నమోదు చేయలేక. ఆ పార్టీని కాంగ్రెసులో విలీనం చేసి సాంత్వన పొందారు. కేంద్రమంత్రిగా పదవినీ పొందరు. వైభవాన్నీ వెలగబెట్టారు. తానొక పార్టీగా వెలిసినప్పుడు.. తన జట్టుగా ఉన్న వాళ్లంతా కకావికలు అయిపోయాక ఈ జీవితానికి ఇక రాజకీయం చాలనుకుని.. తన ఒట్టు తీసి గట్టున పెట్టి మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. జీవితంలో రాజకీయంలోకి మళ్లీ అడుగుపెట్టబోయేది లేదని.. సన్నిహితులతో చెప్పేశారు.
కాంగ్రెసు పార్టీ కూడా ఆయనను చాలా కన్వీనియెంట్ గా మరచిపోయింది. ఇప్పుడు ఏ పార్టీతోనూ సంబంధంలేని ఒక సినిమా నటుడిగా మాత్రమే ఉన్నారు.
తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినా.. ఇండైరక్టుగా తనమీద కూడా సెటైర్లు వేసినా.. రాజకీయంగా చాలా దూకుడు ప్రదర్శిస్తున్నా.. అవేవీ తనకు పట్టని వ్యవహారాల్లాగానే చిరంజీవి ఉన్నారు. అలాంటి మెగాస్టార్ వద్దకు బిజెపినుంచి ఇప్పుడు ఆఫర్ వచ్చినట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి.
ఎన్డీయే భాగస్వామ్య పార్టీ అయిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా పిలుపు లేదు గానీ.. మెగాస్టార్ చిరంజీవిని.. అల్లూరి విగ్రహావిష్కరణ సభలో మోడీతో కలిసి పాల్గొనడానికి ఆహ్వానించడం ఒక పెద్ద పరిణామం. ఆరోజున మెగాస్టార్ తో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రత్యేకంగా, ఆంతరంగికంగా మంతనాలు సాగించారు. వాటి సారాంశం ఆయనకు ఎంపీ పదవి ఆఫరేనని సమాచారం.
రాజకీయాలంటే చిరంజీవి విముఖంగా ఉన్న నేపథ్యంలో.. పార్టీ తరఫున రాజ్యసభకు పంపితే బిజెపి ముద్ర పడుతుంది గానీ.. రాష్ట్రపతి కోటాలో పంపితే.. ఆ ప్రమాదం లేదని.. దానిని ఒప్పుకోవాలని ఆ భేటీలో ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే.. రాజకీయాల జోలికే వెళ్లకూడదని అనుకుంటున్న చిరంజీవికి మాత్రమే ఆ బంపర్ ఆఫర్ ఇవ్వడం వెనుక వారి కారణాలు వారికి ఉన్నాయి.
ఏపీలో కాపు ఓటు బ్యాంకును తమ పార్టీ గుత్తసొత్తుగా మలచుకోవాలని బిజెపి కలగంటోంది. ఏపీ రాష్ట్రానికి చేసిన ద్రోహానికి ఆ రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరని వారికి తెలుసు గానీ.. ఏదో ఒక మాయోపాయాల ద్వారా ఒకానొక అతిపెద్ద కుల ఓటు బ్యాంకును చేజిక్కించుకోవాలని భావిస్తోంది. వరుసగా అదే వర్గం నుంచి పార్టీ అధ్యక్షులు ఎంపికవుతున్నా, పవన్ తో పొత్తులు పెట్టుకున్నా అసలు కారణం అదే.
అయితే వారి అంచనాలకు భిన్నంగా పవన్ కల్యాణ్ ఇప్పుడు తన ధిక్కార ధోరణి కనబరుస్తున్నారు. తెలుగుదేశం పల్లకీకి బోయీగా పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. అవసరమైతే బిజెపితో తెగతెంపులకు సిద్ధం అనే సంకేతాలూ ఇస్తున్నారు. బిజెపి కూడా ఆయనను పట్టించుకోవడం మానేసింది. తమ జట్టు అనే సంగతే మర్చిపోయింది. అల్లూరి విగ్రహావిష్కరణ సభే అందుకు నిదర్శనం.
పవన్ తమ పిడికిటనుంచి జారిపోయినా.. కాపు ఓటు బ్యాంకు పదిలంగా తమకు దక్కాలంటే.. చిరంజీవి బెటర్ అని.. ఈ ఎరవేసినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
చిరంజీవికి బిజెపి రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సీటు ఎరవేసింది గానీ.. చిరు అందుకు సుముఖంగా లేరు. రాష్ట్రపతి కోటాలో పార్లమెంటుకు పంపినా సరే.. రాష్ట్రంలో బిజెపి నాయకులు.. చిరంజీవి జీవితాన్ని తామే ఉద్ధరించామని.. కాపులను ఆకర్షించేలా ప్రచారం చేసుకోకుండా ఉండరనే సంగతి మెగాస్టార్ కు తెలుసు.
ఆయనేదో పాపం సినిమాలు చేసుకుంటూ.. అన్ని పార్టీలతో మంచిగా ఉంటూ, ప్రభుత్వంలో ఉన్న పార్టీలతో మరింత స్నేహంగా మెలగుతూ.. వారిని కీర్తిస్తూ.. తన సినిమా వ్యాపారం సజావుగా, అధిక టికెట్ రేట్లతో లాభసాటిగా జరిగిపోయేలా జాగ్రత్తగా ఉంటున్నారు.
అలాంటిది.. కొత్తగా ఎంపీగా ఒక ముద్ర వేసుకుని, ఏ ఒక్క పార్టీకి మనస్తాపం కలిగించినా.. వ్యాపారం దెబ్బతింటుందని, అసలే ఒకసారి క్రెడిబిలిటీ మంటగలిసి అభాసు పాలయ్యాక వ్యాపారాన్ని కూడా నాశనం చేసే రాజకీయం తనకు అక్కర్లేదని ఆయన అనుకున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి.
చిరంజీవి వద్దని చాలా మర్యాదగా తిరస్కరించిన తర్వాతనే.. రాష్ట్రపతి కోటాలో ఎంపీ పదవి.. విజయేంద్ర ప్రసాద్ ను వరించినట్లుగా పలువురు అనుకుంటున్నారు.