తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం ఎటూ పోలేక జంక్షన్ లో నిలబడిపోయిందని అనలిస్ట్ సుంకర వెంకటేశ్వరరావు (సువేరా) అభిప్రాయపడ్డారు. ఆయన ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో కమ్మ సామాజిక వర్గ పరిస్థితిని సమీక్షించారు.
తెలంగాణ విభజన పోరులో కమ్మవారిని టార్గెట్ చేసారని, నిజానికి వారికి ఏపాపం తెలియదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా వుందన్నారు. తెరాస వైపు వెళ్లడానికి అవకాశం లేదని, ఎందుకంటే వైకాపా-తెరాస కవలపిల్లలని వెల్లడించారు. హరికృష్ణ కుమార్తెను పోటీకి పెట్టినపుడు చేసిన విమర్శలు మరిచిపోలేమన్నారు.
కాంగ్రెస్ వైపు వెళ్లాలన్నా, చిరకాలంగా వున్న కాంగ్రెస్ వ్యతిరేకత వల్ల ఓట్ల ట్రాన్సఫర్ మేషన్ జరగదన్నారు. గత అయిదేళ్లుగా భాజపా కమ్మవారిని బాగా అవమానాలకు గురి చేస్తోందన్నారు. ఒక్క ఎంపీ పదవి ఇచ్చినా బాగుండునన్నారు. (ఈ ఇంటర్వూ చేసేనాటికి రాజమౌళి తండ్రి కి ఇంకా పదవి ప్రకటించలేదు).
ఒక్క కిరణ్ కుమార్ రెడ్డి పాలనా టైమ్ లోనే కమ్మవారి పరిస్థితి కాస్త బాగుందన్నారు. హైదరాబాద్ లో మీడియా, సినిమా, ఫార్మా, రియల్ ఎస్టేట్ ఇలా ప్రతి రంగంలో కమ్మవారు అభివృద్ది పథంలో వుండడం వల్ల సహజంగా చాలా మందికి కంటగింపుగా మారారని, నిజానికి కమ్మవారంత మంచి వారు వుండరని, ఇంట్లో పనివాళ్లను కూడా స్వంత మనుషుల్లా చూస్తారని అన్నారు.
కమ్మవారికి ఐక్యత లేదని, అందువల్లే ఎవరితో కలిసినా ఓట్ ట్రాన్స్ ఫార్మేషన్ పూర్తిగా జరగదని అన్నారు. వేల కోట్లు వున్నవాడు చెప్పాడని, కూటికి లేని వాడు వినడని, అదే కమ్మవారి నైజం అని అన్నారు.
తెలంగాణలో ముఫై అయిదు సీట్లలో అయిదు వేల నుంచి ఇరవై వేల వరకు ఓట్లు తమవి వున్నాయన్నారు. కమ్మవారి జనాభా గణన ఇంత వరకు జరగలేదని, ఆంధ్ర, తెలంగాణ కలిపి ఆరు శాతం జనాభా వుంటుదని అంచనా అని అన్నారు.
ప్రస్తుతానికి అయితే తెలంగాణలో ఎటు వెళ్లాలి, ఎటు మొగ్గాలి అన్నది తెలియడం లేదని, కమ్మ వర్గ పెద్దలు అదే ఆలోచనలో వున్నారని సుంకర వెంకటేశ్వరరావు చెప్పారు.