నక్వీని అందలమెక్కిస్తే ముస్లిములు పండగ చేస్కోవాలా?

గాయం ఒకచోట చేసి, మందు మరొకచోట రాస్తే ఏం జరుగుతుంది? దాని వలన ఫలితం ఉంటుందా? కానీ కాషాయదళ వైద్యుల సిద్ధాంతం ప్రకారం అలా చేసినా కూడా వర్కవుట్ అవుతుంది. ఫలితం దక్కుతుంది! అందుకే..…

గాయం ఒకచోట చేసి, మందు మరొకచోట రాస్తే ఏం జరుగుతుంది? దాని వలన ఫలితం ఉంటుందా? కానీ కాషాయదళ వైద్యుల సిద్ధాంతం ప్రకారం అలా చేసినా కూడా వర్కవుట్ అవుతుంది. ఫలితం దక్కుతుంది! అందుకే.. వారిప్పుడు కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీని ఉపరాష్ట్రపతిని చేయాలని అనుకుంటున్నారు. 

ముస్లింల మీద విషప్రచారానికి చాపకింద నీరులా పాల్పడుతున్న, ముస్లింల భద్రతకు ప్రమాదకరంగా తయారవుతున్న, ముస్లింల జీవితాలను అస్థిరతకు గురిచేస్తున్న పార్టీగా బిజెపి ముద్రవేసుకుంది. కేంద్రం మీద ముస్లిం వ్యతిరేక మరకలు చాలానే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే.. వెంకయ్యనాయుడు పదవీవిరమణ ద్వారా ఖాళీ కాబోతున్న ఉపరాష్ట్రపతి పదవిలో ముస్లిం కమల నాయకుడు ముఖ్తార్ అబ్బాస్ నక్వీని కూర్చోబెట్టబోతున్నారని రాజకీయ వర్గాల్లో గుప్పుమంటోంది.

ముస్లింలు ఈ దేశంలో భయానికి గురయ్యేలా బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అనేకానేక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. ముస్లింల భయంలో అర్థం లేదని, బిజెపి వ్యవస్థీకృతంగా పనిచేస్తోందే తప్ప.. ముస్లింల మీద కక్షతో కాదని ఒక వాదన ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అలాంటి ప్రచారాలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. 

తాజా పరిణామాల్లో నుపుర్ శర్మ వ్యాఖ్యలు బిజెపి ప్రభుత్వాన్ని ప్రపంచస్థాయిలో బద్నాం చేశాయి. చాలా వరకు ముస్లిం దేశాలు.. భారతదేశాన్ని దోషిగా చూసేంత వాతావరణాన్ని సృష్టించాయి. వెనకటికి ఓ మహా ఇల్లాలు-  మొగుడు కొట్టినందుకు కాదు.. తోడికోడలు నవ్వినందుకు ఏడ్చిన చందంగా.. బిజెపి ప్రభుత్వం కూడా నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి.. అసహ్యమైన లేకి మాటలు మాట్లాడినందుకు పశ్చాత్తాపం చెందలేదు గానీ.. అంతర్జాతీయంగా ఇస్లామిక్ దేశాల దృష్టిలో తమకు విలన్ ముద్ర వస్తోందని భయపడి కొన్ని మొక్కుబడి చర్యలు తీసుకుంది. 

అలాంటి కంటి తుడుపు చర్యలు ఫలితమివ్వకపోగా.. బిజెపి ముస్లిం వ్యతిరేక పార్టీగా మరింత తీవ్రమైన ప్రచారమే జరుగుతోంది. ఈనేపథ్యంలో మరకలను కడిగేసుకోడానికి వెంకయ్య స్థానంలో నక్వీని వైస్ ప్రెసిడెంట్ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. 

అయినా.. దేశంలోని యావత్ ముస్లింసమాజానికి గాయం చేసి.. కమలదళ భావజాలాన్ని భుజాన మోస్తున్న ఒక ముస్లింకు పదవి ఇస్తే సరిపోతుందా? ఒక ముస్లిం వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాగానే.. ఈ దేశంలో యావత్ ముస్లిం సమాజం పండగ చేసుకోవాలా? ఈ దేశంలో యావత్ ముస్లిముల పట్ల కేంద్ర ప్రభుత్వం వైఖరిలో ప్రేమ వెల్లువెత్తుతున్నట్లే అనుకోవాలా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. 

మౌలికంగా ముఖ్తార్ అబ్బాస్ నక్వీని సగం ముస్లింగానే గుర్తించాలి. ఆయన భార్య సీమా నక్వి హిందువు. ఆయనది ప్రేమ పెళ్లి. ఆయన భార్య సీమ, ఒకానొక విహెచ్‌పి అగ్రనేత కూతురు అనే ఒక ప్రచారం కూడా ఉన్నది గానీ.. అవన్నీ రుజువులు లేని ప్రచారాలు. ఏదేమైనా ఆమె హిందువు. ఆ రకంగా ఆయన సగం ముస్లిం మాత్రమే. 

బిజెపికి ముస్లింల మీద ప్రేమ పొర్లిపోతే గనుక.. హిందూ బంధం లేని మరొక్క ముస్లిం వారికి ఈ దేశంలోనే కనిపించలేదా? అనేది పలువురి ప్రశ్న. కేంద్ర కేబినెట్ లో ఉన్న ఒకే ఒక్క ముస్లింని, ఆ పదవినుంచి తప్పించి.. హోదా వైభవం తప్ప ఎలాంటి అధికారం ఉండని ఇలాంటి నామమాత్రపు ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టడం అనేది.. ముస్లిం సమాజానికి మేలు ఎలా అవుతుందనేది వారి అనుమానం. 

నక్వీ కాకుండా, పూర్తిగా ముస్లిం ముద్ర ఉన్న నాయకుడిని ఉపరాష్ట్రపతిని చేసి, అదే తరహాలో కేంద్ర కేబినెట్ లో కూడా ఒక ముస్లింను మంత్రిగా తీసుకుంటేనే.. బిజెపి.. కనీసం తాము ముస్లిములకు వ్యతిరేకం కాదని, వారికి పెద్దపీట వేస్తున్నామని చెప్పుకోవడం కుదురుతుంది. 

అలా చేయకపోతే.. పైన చెప్పుకున్నట్లుగా.. గాయం ఒకచోట ఉంటే మందు ఒకచోట వేసినట్లుగా అది నయం కాదు సరికదా.. ఇలా చేసినంత మాత్రాన ఆ పార్టీని నమ్ముతారనే గ్యారంటీ కూడా లేదు.